Begin typing your search above and press return to search.

కంగానా రనౌత్ ఎన్నిక చెల్లదా?... హైకోర్టు నోటీసులు!

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మండి స్థానం నుంచి గెలిచిన ఆమెకు ఆ రాష్ట్ర హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది.

By:  Tupaki Desk   |   25 July 2024 7:29 AM GMT
కంగానా రనౌత్  ఎన్నిక చెల్లదా?... హైకోర్టు నోటీసులు!
X

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కంగనా రనౌత్.. మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె చిక్కుల్లో పడ్డారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆమె ఎన్నిక చెల్లదంటూ ఓ పిటిషన్ దాఖలవ్వడం.. ఆ పిటిషన్ పై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది.

అవును... బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చిక్కుల్లో పడ్డారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మండి స్థానం నుంచి గెలిచిన ఆమెకు ఆ రాష్ట్ర హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ ఎన్నికల్లో ఉద్దేశపూర్వకంగానే తన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారని ఆరోపిస్తూ లాయక్ రామ్ నేగి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.

ఇదే సమయంలో... కంగనా రనౌత్ ఎన్నికను పక్కనపెట్టాలని విజ్ఞప్తి చేశారు. దీంతో... ఈ పిటిషన్ పై స్పందించిన హిమాచల్ ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం కంగనా రనౌత్ కు బుధవారం నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వలంటూ కోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా... ఆగస్టు 21లోగా స్పందనను తెలియజేయాలని తెలిపింది.

లాయక్ రామ్ నేగి తన పిటిషన్ లో కీలక విషయాలు వెల్లడించారు! ఇందులో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన తాను.. ముందస్తుగానే పదవీ విరమణ చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో... నామినేషన్ పత్రాలతో పాటే డిపార్ట్మెంట్ నుంచి పొందిన "నో డ్యూ సర్టిఫికెట్" ను కూడా జత చేసినట్లు వెల్లడించారు.

అయితే... వీటితో పాటు ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్, టెలిఫోన్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా సర్టిఫికెట్లు తీసుకురావాలని రిటర్నింగ్ అధికారి ఆదేశించినట్లుగా లాయక్ నేగి తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. అందుకు వారు ఇచ్చిన ఒక్కరోజు గడువులోనే తాను అన్ని సర్టిఫికెట్లూ తీసుకెళ్లినట్లు తెలిపారు. అయినప్పటికీ రిటర్నింగ్ అధికారులు తన నామినేషన్ ను తిరస్కరించినట్లు తెలిపారు!

రిటర్నింగ్ అధికారులు అడిగిన అన్ని సర్టిఫికెట్లనూ తాను సమయానికే అందచేసినా వాటిని స్వీకరించకపోగా, తన నామినేషన్ ను తిరస్కరించారని.. తన నామినేషన్ ను అంగీకరించి ఉంటే తాను అక్కడ గెలిచి ఉండేవాడినని అందువల్ల.. ఈ ఎన్నికను పక్కనపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు లాయక్ రామ్ నేగి తన పిటిషన్ లో పేర్కొన్నారు.