చిన్నారుల శవాలపై అత్యాచారం.. హైకోర్టు సంచలన తీర్పు!
ఈ కారణంగానే వారిని నిర్దోషులుగా పరిగణిస్తున్నట్లు అలహాబాద్ హైకోర్టు వెల్లడించింది. దీంతో ఈ కేసుల్లో వారి మరణశిక్ష రద్దు అయ్యింది.
By: Tupaki Desk | 16 Oct 2023 2:16 PM GMTవరుసగా చిన్నారులను హత్య చేయడంతోపాటు వారి మృతదేహాలను అత్యాచారం చేయడానికి సంబంధించిన కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించి కింది స్థాయి కోర్టులో మరణశిక్ష ఎదుర్కొంటున్న ఇద్దరు దోషులను నిర్దోషులుగా ప్రకటించింది. నిందితులు సురేందర్ కోలీ, మానిందర్ సింగ్ పంధేర్ ను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. వీరిద్దరూ దోషులు అనడానికి సరైన సాక్ష్యాలు లేవని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కారణంగానే వారిని నిర్దోషులుగా పరిగణిస్తున్నట్లు అలహాబాద్ హైకోర్టు వెల్లడించింది. దీంతో ఈ కేసుల్లో వారి మరణశిక్ష రద్దు అయ్యింది.
కాగా ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. నోయిడాలోని నిఠారీ గ్రామంలో 2005 నుంచి 2006 మధ్య చిన్నారులు, మహిళలు వరుస హత్యలకు గురయ్యారు. ఈ క్రమంలో 2006 డిసెంబరులో స్థానిక వ్యాపారవేత్త మానిందర్ సింగ్ పంధేర్ ఇంటి సమీపంలోని ఓ మురికి కాలువలో కొన్ని మానవ అవశేషాలు కొట్టుకువచ్చాయి. ఆ శరీర భాగాలను చూసి ఆందోళన చెందిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల విచారణలో వరుస హత్యలు వెలుగు చూశాయి. దర్యాప్తులో మానిందర్ సింగ్ పంధేర్ ఇంటి వెనుక పెరట్లో అనేక మంది చిన్నారులు, యువతుల అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఇవన్నీ ఆ ప్రాంతంలో ఏడాదిగా కన్పించకుండా పోయిన పేద చిన్నారులు, యువతులవేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అనంతరం ఈ కేసు విచారణను సీబీఐ చేపట్టింది. సీబీఐ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మానిందర్ సింగ్ పంధేర్ ఇంట్లో పనిచేసే సురేందర్ కోలీ.. చిన్నారులకు స్వీట్లు, చాక్లెట్ల ఆశ చూపి ఇంటికి ఆహ్వానించేవాడని వెల్లడైంది. అనంతరం వారిని హత్య చేసి, మృతదేహాలపై లైంగిక దాడి చేశాడని తేలింది. ఆ తర్వాత శరీర భాగాలను ఇంటి వెనుక పెరడు ఉన్న భాగంలో విసిరేశారని సీబీఐ అభియోగాలు మోపింది. ఈ క్రమంలో సురేందర్ కోలీ, మానిందర్ సింగ్ నరమాంస భక్షకులనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో.. వారిద్దరిపై మొత్తం 19 కేసులు నమోదు చేశారు. అయితే సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా వీటిలో మూడింటిని మూసివేశారు.
మిగతా 16 కేసులపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు.. వీటిల్లోని కొన్ని కేసుల్లో సురేందర్ కోలీని దోషిగా తేల్చింది. అతడికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఇక మానిందర్ సింగ్ పంధేర్ కొన్ని కేసుల్లో నిర్దోషిగా బయటపడగా.. రెండు కేసుల్లో దోషిగా తేలాడు. దీంతో అతడికి కూడా ట్రయల్ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో 12 కేసుల్లో తనకు పడిన మరణశిక్షను సవాల్ చేస్తూ సురేందర్ కోలీ, రెండు కేసుల్లో తనకు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ మానిందర్ సింగ్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. ఈ 14 కేసుల్లో వీరిద్దరికీ వ్యతిరేకంగా ప్రత్యక్ష సాక్షులు, సరైన ఆధారాలు లేవని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. ఈ కారణంగా వీరిని నిర్దోషులుగా ప్రకటించింది.