బీజేపీ మహా ధర్నాకు గ్రీన్ సిగ్నల్.. సర్కారు పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ప్రభుత్వం పై రాష్ట్ర హైకోర్టు తీవ్రస్థాయి లో ఫైరైంది. సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది.
By: Tupaki Desk | 24 July 2023 1:10 PM GMTతెలంగాణ ప్రభుత్వం పై రాష్ట్ర హైకోర్టు తీవ్రస్థాయి లో ఫైరైంది. సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. "కేంద్ర ప్రభుత్వం పై రాష్ట్ర ప్రభుత్వమే ధర్నాకు దిగిన విషయం మాకు ఇంకా గుర్తుంది. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తం గా ప్రభుత్వమే ధర్నా చేసినప్పుడు.. శాంతి భద్రతల కు విఘాతం కలగలేదా?" అని నిలదీసింది. అంతేకాదు.. మీరు చేసినప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎలా వస్తుందని ప్రశ్నించింది.
విషయం ఏంటంటే.. రాష్ట్రం లో కేసీఆర్ సర్కారు కట్టించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయం లో జరుగుతున్న అవకతవకలు సహా వీటి పంపిణీ పై రాష్ట్ర బీజేపీ నాయకులు ధర్నాకు దిగాల ని నిర్ణయించారు. దోమలగూడ లోని ఇందిరా పార్కు వద్ద మంగళవారం ఈ ధర్నా చేపట్టాల ని ప్రతిపాదించారు. దీనికి సంబంధించి పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు దీనికి నిరాకరించారు.
దీంతో రాష్ట్ర బీజేపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. గతం లో ఉద్యమాల ద్వారానే రాష్ట్రం వచ్చిదని ప్రస్తావించారు. ఇప్పుడు మాత్రం ఉద్యమాల కు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. దీని పై ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ.. శాంతి భద్రతల సమస్య ఉందని.. అందుకే వద్దన్నామని చెప్పారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఫైరైన హైకోర్టు.. గతం లో ఇలా ఉత్తర్వులు ఏమైనా జారీ చేశారా? అని ప్రశ్నించింది.
అంతేకారు.. కేవలం 5 వేల మంది ధర్నాలో పాల్గొంటే.. వారిని కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందా? అని ప్రశ్నించింది. కేంద్రం పై రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుంది? అని నిలదీసింది. ఈ క్రమంలో బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. పోలీసుల సూచనల ను పాటించాలని, శాంతి భద్రతల కు విఘాతం కలగకుండా.. వలంటీర్‌ల ను నియమించకోవాల ని బీజేపీకి కూడా సూచించడం గమనార్హం.