Begin typing your search above and press return to search.

అజాన్ తో శబ్దకాలష్యం.. పిటిషనర్ కు క్లాస్ పీకిన హైకోర్టు

అందుకు అజాన్ ను స్పీకర్లు పెట్టే అంశంపై పరిమితులు విధించాలని కోరుతూ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు.

By:  Tupaki Desk   |   30 Nov 2023 4:52 AM GMT
అజాన్ తో శబ్దకాలష్యం.. పిటిషనర్ కు క్లాస్ పీకిన హైకోర్టు
X

సున్నితమైన అంశాలపై అభ్యంతరాల్ని వ్యక్తం చేసే వేళలో ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. అందుకు భిన్నంగా సంకుచిత ఆలోచనలతో న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తే.. ఇలాంటి తలంటు ప్రోగ్రాంలు తప్పవు. ఏళ్లకు ఏళ్లుగా వస్తున్న వాటిని వేలెత్తి చూపిస్తూ.. అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తూ పిటిషన్లు వేయటం ఈ మధ్యన ఒక అలవాటుగా మారింది. ఇలాంటి అలవాట్లకు చెక్ చప్పే పరిణామం గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటు చేసుకుంది.

మసీదుల్లో పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి అజాన్ చేయటం వల్ల శబ్ద కాలుష్యం అవుతోందని.. అందుకు అజాన్ ను స్పీకర్లు పెట్టే అంశంపై పరిమితులు విధించాలని కోరుతూ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ (గుజరాత్ హైకోర్టుచీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్.. జస్టిస్ అనిరుద్ద) అభ్యంతరం వ్యక్తం చేసింది. పిటిషనర్ వాదనలపై అసహనం వ్యక్తం చేసింది. అజాన్ కారణంగా శబ్ద కాలుష్య స్థాయి పెరుగుతోందని.. పరిమితికి మించిన డెసిబెల్స్ వినాల్సి వస్తోందన్న వాదనలో అర్థం లేదని పేర్కొంది.

పిటిషనర్ ఉద్దేశం ఏమిటో తమకు అర్థం కాలేదన్న హైకోర్టు.. "మీ పిటిషన్ లో ఉద్దేశం మాకు అర్థం కాలేదు. లౌడ్ స్పీకర్లతో అజాన్ వినిపించటం వల్ల శబ్దకాలుష్యం పెరుగుతుందని ఎలా అనగలరు? దీని వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటోందని మీరు పిటిషన్ ఎందుకు వేశారో అర్థం కాలేదు. గుళ్లల్లో ఉదయం మూడు గంటలకే హారతి కార్యక్రమం ఉంటుంది. ఆ సమయంలో డ్రమ్స్ వాయిస్తూ హారతిని ఇస్తారు. ఆ శబ్దం వల్ల ధ్వని కాలుష్యం కాదా? గంట వాయిస్తుంటే.. ఆ శబ్ధం కేవలం గుడికే పరిమితం అవుతుందా? బయటకు వినకుండా ఉంటుందా? ఇలాంటి పిటిషన్లను ఏ మాత్రం ఉపేక్షించం. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఆచారమిది. ఓ పది నిమిషాల ప్రార్థనను కాదనలేం కదా?" అంటూ ప్రశ్నించింది.

అజాన్ కారణంగా శబ్ద కాలుష్యమన్న పిటిషనర్ వాదనకు.. శబ్ద కాలుష్యానికి సంబంధించిన సైంటిఫిక్ మెథడ్ ఉంటుందని పేర్కొన్న న్యాయస్థానం.. పిల్ లో పేర్కొన్నట్లుగా శబ్ద కాలుష్య అంశాలు లేకపోవటాన్ని ప్రశ్నించింది. అజాన్ వచ్చే పది నిమిషాలకు ఎంత శబ్ద కాలుష్యం అవుతుందన్న విషయాన్ని తమకు చెప్పాలని పేర్కొంది. మొత్తంగా ఒక ఉద్దేశంతో వేసే పిల్ కు ఎదురుదెబ్బలు తప్పవన్న విషయం తాజా ఉదంతం మరోసారి నిరూపించిందని చెప్పాలి.