Begin typing your search above and press return to search.

మేడిగడ్డ పిటిషన్ పై స్పందించిన హైకోర్టు.. ఏమందంటే?

రెండు వారాల్లోగా వివరాలు ఇవ్వాలని హై కోర్టు ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

By:  Tupaki Desk   |   19 Dec 2023 11:49 AM GMT
మేడిగడ్డ పిటిషన్ పై స్పందించిన హైకోర్టు.. ఏమందంటే?
X

కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పులను బయటవేస్తుంది. రీసెంట్ గా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా ప్రభుత్వ పక్షం కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బాహా బాహీ తలపడ్డాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతీ పథకంలో అక్రమాలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తుంటే.. ప్రధాన ప్రతిపక్షంలోని కేటీఆర్, హరీశ్ రావు సీఎంను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పాలకపక్షం సభ్యులు సభ నుంచి బయటకు పంపించాలని సీఎంను కోరగా.. రేవంత్ రెడ్డి స్పందిస్తూ వారికి ఇదే శిక్ష వారి హయాంలో చేసిన తప్పులు నిర్బంధంగా వినాల్సిందే అంటూ చెప్పారు.

మేడిగడ్డ బరాజ్ పిల్లర్ కుంగడంపై కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రోజులుగా విస్తృతంగా విచారణ చేపడుతుంది. నిర్మాణ సంస్థకు సంబంధించిన ఇంజినీరింగ్ అధికారులతో సీఎం మాట్లాడారు. నిర్మాణ సమయంలో చేసుకున్న ఒప్పందాల గురించి సీఎంకు వారు వివరించారు. అయితే నిర్మాణ ఖర్చును ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చెల్లించదని నిబంధనల మేరకు సదరు సంస్థనే ఖర్చును భరించుకొని మరమ్మతు చేయాలని సీఎం వారిని కోరారు.

మేడిగడ్డ బరాజ్ పిల్లర్ కుంగడంపై సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ నేత నిరంజన్ రెడ్డి హై కోర్టులో పిటిషన్ వేశారు. బరాజ్ పిల్లర్లు కుంగడంపై చాలా అనుమానాలు ఉన్నాయని, వాటి నివృత్తి కోసం సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆయన పిటిషన్ లో కోరారు. మహదేవపురం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్ లో ఆయన కోర్టును అభ్యర్థించారు.

బరాజ్ పిల్లర్ కుంగడంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలంగాణ సీఎస్ శాంతి కుమారికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో సీఎస్ నుంచి వివరాలు తీసుకొని తమకు సమర్పించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు వారాల్లోగా వివరాలు ఇవ్వాలని హై కోర్టు ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఏది ఏమైనా 'మేడిగడ్డ'పై ఇప్పడు రాష్ట్రంలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. అయితే నిబంధనల ప్రకారం బరాజ్ మరమ్మతు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ బాధ్యతేనని ప్రభుత్వం చెప్తుండగా.. తమ గడువు ముగిసిందని ఎల్ అండ్ టీ చెప్తుంది. ఇద్దరి వివాదం కోర్టు జోక్యంతోనైనా పరిష్కారం అవుతుందో లేదో చూడాలి.