ఎమ్మెల్సీ ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు!
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
By: Tupaki Desk | 12 Jan 2024 8:20 AM GMTతెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. దీంతో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ కు షాక్ తగిలింది. తెలంగాణలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
అయితే హైకోర్టు ఈ పిటిషన్ ను కొట్టేసింది. రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు జరుగుతాయని హైకోర్టు తేల్చిచెప్పింది. దీంతో తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం దక్కలేదు.
ఎమ్మెల్సీలుగా ఉన్న బీఆర్‌ఎస్ నేతలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో శానసమండలిలో వారి స్థానాలు ఖాళీలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం జనవరి 4న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యేల కోటాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాలను మెజారిటీ రీత్యా కాంగ్రెస్ పార్టీయే గెలుచుకునే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ ను స్వీకరించిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బీఆర్‌ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదించారు. ఆర్టికల్ 171(4)కు విరుద్దంగా ఎన్నికల ప్రకటన ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఎన్నికల సంఘం రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలను నిర్వహించడం ఎన్నికల నిర్వహణ నిబంధనలకు విరుద్ధమని వాదించారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాలేదని అందువల్ల ఇది న్యాయ సమీక్షకు అడ్డంకి కాదని తెలిపారు. అడ్డంకులను తొలగించి ఎన్నికలు సాఫీగా నిర్వహించడంలో భాగంగా కోర్టులు జోక్యం చేసుకోవచ్చంటూ గతంలో సుప్రీంకోర్టు పేర్కొందన్నారు.
మరోవైపు ఆర్టికల్ 329(బీ) ప్రకారం.. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యాక ఎన్నికల నిర్వహణలో హైకోర్టు జోక్యం ఉండదని ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసిందన్నారు. ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తయిన తరువాత ఏర్పడే ఖాళీలకు అధికరణ 171 కింద ఎన్నిక నిర్వహిస్తామని చెప్పారు. అలాగే పదవీ కాలం పూర్తి కాకుండా రాజీనామాలు, ఇతర కారణాలతో ఏర్పడిన ఖాళీలకు అధికరణం 151 కింద ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం ఈ అధికరణ కింద రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుప్రీం కోర్టు కూడా ఈ విధానాన్ని సమర్థించిందని గుర్తు చేశారు.
ఇరువైపుల వాదనలను విన్న హైకోర్టు ధర్మాసనం పదవీ కాలం పూర్తి కాకముందు ఏర్పడే సాధారణ ఖాళీలను భర్తీ చేయడానికి అధికరణ 151 కింద నోటిపికేషన్ జారీ చేయవచ్చని స్పష్టం చేసింది. అందువల్ల ఎన్నికల సంఘం 4వ తేదీన జారీ చేసిన పత్రికా ప్రకటన ఆమోదయోగ్యమేనని తేల్చిచెప్పింది. ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు చోటు చేసుకోలేదని తెలిపింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినందున ఈ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమంటూ బీఆర్‌ఎస్ నేత కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ ను కొట్టివేసింది.