Begin typing your search above and press return to search.

భర్త వ్యక్తిగత వివరాల్ని భార్యకు చెప్పాల్సిన అవసరం లేదన్న హైకోర్టు

ఆమె కోరిన రీతిలో మాజీ భర్త ఆధార్ వివరాల్ని ఇచ్చేందుకు అవకాశం లేదని ఉడాయ్ రిజెక్టు చేసింది. దీంతో.. సంస్థ నిర్ణయంపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు.

By:  Tupaki Desk   |   29 Nov 2023 4:55 AM GMT
భర్త వ్యక్తిగత వివరాల్ని భార్యకు చెప్పాల్సిన అవసరం లేదన్న హైకోర్టు
X

భర్త అయినప్పటికీ భార్యకు ఆయన ఆధార్ వివరాల్ని అందించాల్సిన అవసరంలేదన్న కీలక తీర్పును తాజాగా కర్ణాటక హైకోర్టు వెలువరించింది. భార్యతో దాంపత్య జీవితంలో ఉన్నా.. విడిపోయినప్పటికీ వ్యక్తిగత గోప్యతకు సంబంధించి భంగం వాటిల్లే వీల్లేదని ధర్మాసనం పేర్కొంది. విడిపోయిన భార్యభర్తల కేసుకు సంబంధించి కర్ణాటక హైకోర్టుకు చెందిన జస్టిస్ ఎస్. సునీల్ దత్..జస్టిస్ విజయకుమార్ ఏ పాటిల్ తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

అసలేమైందంటే.. హుబ్బళ్లికి చెందిన ఒక మహిళకు 2005లో వివాహమైంది. వారికి కుమార్తె పుట్టిన తర్వాత దంపతులు ఇద్దరు విడిపోయారు. ఫ్యామిలీ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా భరణాన్నితన మాజీ భర్త ఇవ్వటం లేదంటూ ఆమెను కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా మాజీ భర్త ఆధార్ వివరాలు ఇవ్వాలని ఆమె ఆధార్ సంస్థ (ఉడాయ్)నుకోరారు. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు.

అయితే.. ఆమె కోరిన రీతిలో మాజీ భర్త ఆధార్ వివరాల్ని ఇచ్చేందుకు అవకాశం లేదని ఉడాయ్ రిజెక్టు చేసింది. దీంతో.. సంస్థ నిర్ణయంపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఆధార్ వివరాల్ని ఇవ్వాలని హైకోర్టు ఉడాయ్ ను ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై మరోసారి ఉడాయ్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించింది.

అత్యవసర పరిస్థితుల్లో హైకోర్టు న్యాయమూర్తి ఆదేశిస్తే మాత్రమే ఆధార్ నంబరు.. ఇతర వివరాల్ని ఇవ్వాలంటూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలోనే చేసిన ఆదేశాల్ని ఉడాయ్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు. దీనిపై స్పందించిన కర్ణాటక హైకోర్టు.. ఉడాయ్ కు అనుకూలంగా తీర్పు ను ఇవ్వటంతో పాటు మాజీ భర్త ఆధార్ వివరాల్ని మాజీ భార్యకు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో వ్యక్తిగత గోప్యతపై కీలక వ్యాఖ్యలు చేసింది.