Begin typing your search above and press return to search.

యూట్యూబర్‌ పై హైకోర్టు ఆగ్రహం... స్టంట్ వీడియో వైరల్!

తమిళనాడుకు చెందిన టీటీఎఫ్‌ వాసన్‌ అనే యూట్యూబ్‌ ఛానల్ లో బైక్‌ స్టంట్లు, రోడ్ ట్రిప్పులకు సంబంధించిన వీడియోలు ఉంటుంటాయి. ఫలితంగా అతడి ఛానల్‌ కు లక్షల మంది ఫాలోవర్లున్నారు.

By:  Tupaki Desk   |   5 Oct 2023 3:30 PM GMT
యూట్యూబర్‌  పై హైకోర్టు ఆగ్రహం... స్టంట్  వీడియో వైరల్!
X

ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో లక్షల ఛానల్స్ యూట్యూబ్ నిండా ఉంటాయి! అయితే వాటిలో కొన్ని ప్రయోజనం కలిగించేవి అయితే.. మరికొన్ని మాత్రం సమాజహితాన్ని చెడగొట్టేవని చెబుతుంటారు. ఈ క్రమంలో తాజాగా ఒక యూట్యూబర్ పై హైకోర్టు సీరియస్ అయ్యింది.

అవును... రోడ్లపై బైక్ తో స్టంట్స్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్ పై యువతను ప్రేరేపించేలా వీడియోలు చేయడం చేస్తుంటారు. వాటివల్ల ఎవరికి ఉపయోగం లేదు సరికదా.. సమాజానికి తప్పుడు సంకేతాలు పంపిస్తుంటాయి. అదేవిధంగా.. ఈ స్టంట్స్ చేస్తున్న సమయంలో రోడ్లపై తోటి ప్రయాణికులు, వాహనదారులు ఎంత ఇబ్బంది పడతారనేది వీరి సృహకి రాదు.

వివరాళ్లోకి వెళ్తే... తమిళనాడుకు చెందిన టీటీఎఫ్‌ వాసన్‌ అనే యూట్యూబ్‌ ఛానల్ లో బైక్‌ స్టంట్లు, రోడ్ ట్రిప్పులకు సంబంధించిన వీడియోలు ఉంటుంటాయి. ఫలితంగా అతడి ఛానల్‌ కు లక్షల మంది ఫాలోవర్లున్నారు. ఈ క్రమంలో సెప్టెంబరు 17న అతడు ఓ రోడ్‌ ట్రిప్‌ లో భాగంగా చెన్నై-వేలూరు హైవేపై స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు.

దీంతో... దమాల్‌ సమీపంలో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లాడు. అయితే.. ఆ సమయంలో అతడు హెల్మెంట్‌, రేస్‌ సూట్‌ వేసుకుని ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. అయినప్పటికీ అతడి చేతికి మాత్రం ఫ్రాక్చర్‌ అయ్యింది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో... అతడి బెయిల్‌ పిటిషన్‌ ను కాంచిపురం సెషన్స్‌ కోర్టు గతనెల 26న తిరస్కరించింది. దీంతో అతడు మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా ఈ పిటిషన్ పై మద్రాసు ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా... వాసన్‌ రూ.20లక్షల ఖరీదు చేసే బైక్‌ పై రూ.3లక్షల రేస్‌ సూట్‌ ధరించి ప్రమాదకర స్టంట్లు చేస్తున్నాడు. ఖరీదైన బైక్‌ లు కొనుగోలు చేసి రేస్‌ లకు రావాలని యువతను ప్రేరేపిస్తున్నాడు అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు.

అయితే... ఈ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. యువతను ప్రమాదకర ర్యాష్‌ డ్రైవింగ్‌ వైపు ప్రేరేపిస్తున్న అతడి బెయిల్‌ పిటిషన్‌ ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. ఇదే సమయంలో ఇది అతడికో గుణపాఠం కావాలని తెలిపింది. అదేవిధంగా... ఇక ఆ యూట్యూబర్‌ తన ఛానల్‌ ను తక్షణమే మూసివేయాలని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాతే కోర్టును ఆశ్రయించాలని సూచించింది. దీంతో... ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది.