పిన్నెల్లికి భారీ ఊరట !
దీంతో కౌంటింగ్ దాకా పిన్నెల్లికి హై లెవెల్ టెన్షన్ తప్పినట్లు అయింది.
By: Tupaki Desk | 23 May 2024 5:37 PM GMTమాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్ధి అయిన పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు జూన్ 6 వరకూ అరెస్ట్ చేయవద్దు అంటూ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఆదేశాలు జారీ చేసింది. దీంతో కౌంటింగ్ దాకా పిన్నెల్లికి హై లెవెల్ టెన్షన్ తప్పినట్లు అయింది. ఆయన మెడ మీద అరెస్ట్ కత్తి గత ఇరవై నాలుగు గంటల పాటు వేలాడింది.
పిన్నెల్లిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారు అన్న వార్తలు పెద్ద ఎత్తున సాగాయి. మాచర్లలోని ఒక పోలింగ్ బూత్ లో జొరబడి ఈవీఎం ని ద్వంసం చేశారు అన్నది వీడియో బయటకు వచ్చింది. దాంతో ఏకంగా పిన్నెల్లి మీద పది సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఆ మీదట ఆయన కోసం వేట మొదలైంది.
అయితే పిన్నెల్లి అజ్ఞాతంలోనే ఉంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ముందస్తు బెయిల్ ఇప్పించాలని ఆయన కోరారు. దీని మీద వాడిగా వేడిగా వాదనలు జరిగాయి. ఈవీఎం ధ్వంసం కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లిని అరెస్ట్ చేసి తీరాల్సిందే అని ఈసీ తరఫున న్యాయవాదులు వాదించారు.
అయితే పిన్నెల్లి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు మాత్రం ఆయన పేరిట విడుదల అయిన వీడియో ఫేక్ అయి ఉండవచ్చు కదా అని ఒక సందేహాన్ని బయటకు తెచ్చారు. పైగా అది ఈసీ రిలీజ్ చేయలేదని ప్రత్యర్థి పార్టీ సోషల్ మీడియాలో పెడితే ఎలా లీక్ అయిందో కూడా చూడాలి కదా అని అంటున్నారు.
అంతే కాదు దాన్నే ప్రమాణంగా తీసుకుని ఎలా అరెస్ట్ చేస్తారు అని ప్రశ్నించారు. అరెస్ట్ కి ముందు నోటీసులు జారీ చేయాలి కదా అని అంటున్నారు. మామూలుగా అయితే 41ఏ నోటీసుని ఇచ్చి పిలిపించాలని కూడా కోర్టు దృష్టికి తెచ్చారు. ఇలా ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ మీద వాదనలు సాగాయి.
దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. జూన్ 6వ తేదీ ఉదయం 10 గంటల వరకు మాత్రమే తమ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
పిన్నెల్లి సహా వివిధ కేసులు ఎదుర్కొంటున్న అసెంబ్లీ అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు విచారించింది. తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డికి కూడా హైకోర్టులో ఊరట లభించింది. అస్మిత్ రెడ్డిని కూడా జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది.
కాగా, కోర్టు ఆదేశాల నేపథ్యంలో, పిన్నెల్లి స్పందించారు. న్యాయం గెలిచింది అంటూ ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. మొత్తం మీద చూస్తే ఎన్నడూ లేని విధంగా పోలింగ్ నాటి నుంచి వార్తలలో హెడ్ లైన్స్ లో ఉన్న మాచర్ల వ్యవహారంలో కధ క్లైమాక్స్ కి చేరుకుని అరెస్ట్ దాకా వెళ్ళిన క్రమంలో హై కోర్టు ఆదేశాలతో తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడినట్లు అయింది .