Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే ఎత్తయిన రహదారి... వివరాలు వింటే అవాక్కే!

సరిహద్దుల్లో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకొంటుంది

By:  Tupaki Desk   |   16 Aug 2023 10:02 AM GMT
ప్రపంచంలోనే ఎత్తయిన రహదారి... వివరాలు వింటే అవాక్కే!
X

సరిహద్దుల్లో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకొంటుంది. ఈ క్రమంలో రహదారుల నిర్మాణం, సైనిక బలగాల వసతి సౌకర్యాలు, హెలిపాడ్లను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా.. ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశంలో ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపింది.

అవును... భారత్ - చైనా సరిహద్దులో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా గత తొమ్మిదేళ్లలో బి.ఆర్.ఓ. (సరిహద్దు రహదారి సంస్థ) పలు కీలక ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ క్రమంలోనే స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కీలకమైన ప్రాజెక్టుకు బి.ఆర్.ఓ. శ్రీకారం చుట్టింది.

ఇప్పటివరకూ తూర్పు లద్దాఖ్‌ లోని ఉమ్లింగ్ లా పాస్ ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశంలో ఉన్న మోటారబుల్ రోడ్‌ గా పేరు పొందింది. సముద్రమట్టానికి దీని ఎత్తు 19,024 అడుగులు. అయితే దీన్ని తలదన్నేలా కొత్తగా బి.ఆర్.ఓ. సరికొత్త రోడ్డు నిర్మాణం చేపట్టబోతోంది. సముద్ర మట్టం నుంచి 19,400 అడుగుల ఎత్తులో ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు బి.ఆర్.ఓ. తెలిపింది.

ఈ రహదారి నిర్మాణాన్ని 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేసింది. లికారు – మిగ్ లా-పుక్చే ప్రాంతాలను కలుపుతూ ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది.

కాగా... తూర్పు లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో గతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాలకు చెందిన సైనికుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే 18 సార్లు చర్చలు జరగగా.. తాజాగా 19వ సారి ఆగస్టు 13, 14 తేదీల్లో జరిగాయి.

అయితే.. ఇరు దేశాలకు చెందిన ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించారని, రెండు దేశాల నుంచి కూడా సానుకూల వాతావరణం కనిపించిందని ఈ మేరకు భారత విదేశాంగ శాఖ పేర్కొంది.