మోడీ ప్రమాణస్వీకారానికి ఎంతటి అసాధారణ భద్రత అంటే?
ఈ రోజు సాయంత్రం నిర్వహించే మోడీ పట్టాభిషేక కార్యక్రమం జీ20 సదస్సు వేళ కల్పించిన భద్రతను తలపించేలా ఉందని చెబుతున్నారు. 500
By: Tupaki Desk | 9 Jun 2024 6:12 AM GMTముచ్చటగా మూడోసారి.. హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ఈ సాయంత్రం 7.15 గంటలకు(ఆదివారం) ప్రమాణస్వీకారం చేయనున్నారు నరేంద్ర మోడీ. ఈ కార్యక్రమానికి సిద్ధంచేసిన భద్రతా చర్యలు అసాధారణమని వ్యాఖ్యానిస్తున్నారు. జీ20 తర్వాత ఇంత భారీగా భద్రతా ఏర్పాట్లు చేసింది ఇప్పుడేనని చెబుతున్నారు. ఇప్పటికే పలువురు దక్షిణాసియా దేశాధినేతలు మోడీ ప్రమాణస్వీకారం కోసం ఢిల్లీకి చేరుకున్నారు.
మోడీ ప్రమాణస్వీకారం కోసం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ను సిద్ధం చేశారు. ప్రమాణస్వీకార వేదిక పరిసరాల్లో ప్రైవేటు డ్రోన్ల సంచారాన్ని పూర్తిగా నిషేధించారు. అంతే కాదు.. ఢిల్లీ మహానగరం మొత్తం భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. హైఅలెర్టు ప్రకటించారు. జూన్ 9, 10 రెండు రోజులు ఢిల్లీలో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. నేషనల్ సెక్యూరిటీ గార్డులు.. షార్ప్ షూటర్లు రంగంలోకి దిగారు. ఈ రోజు సాయంత్రం నిర్వహించే మోడీ పట్టాభిషేక కార్యక్రమం జీ20 సదస్సు వేళ కల్పించిన భద్రతను తలపించేలా ఉందని చెబుతున్నారు. 500 సీసీ కెమెరాలతో ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.
ఢిల్లీలో పలు దేశాల అధినేతలు బస చేసిన హోటళ్లను అణువణువూ శోధించారు. పూర్తిగా జల్లెడ పట్టారు. దాయాది పాకిస్థాన్ మినహా ఇరుగుపొరుగు దేశాలకు చెందిన అగ్రనేతలు ఢిల్లీకి చేరుకున్నారు. వీరంతా లీలా.. తాజ్.. ఐటీసీ మౌర్య.. క్లారిడ్జెస్.. ఒబేరాయ్ తదితర ఫైవ్ స్టార్ హోటళ్లను కేటాయించారు.
ఎలాంటి పొరపాటు దొర్లకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి తప్పు జరగకుండా ఉండటానికి వీలుగా డేగకళ్లతో పహారా కాస్తున్నారు. మూడు అంచెల భద్రతా వలయాన్నిరాష్ట్రపతి భవన్ వద్దా.. పరిసరాల్లో నిర్మించారు. మొదటి అంచెలో ఐదు కంపెనీల పారామిలిటరీ బలగాలు.. రెండో అంచెలో నేషనల్ గార్డులు.. డ్రోన్లు.. మూడో అంచెలో స్నీపర్ (స్వాట్ స్పెషల్ వెపన్స్ అండ్ ట్యాక్టిక్స్) టీంలతో మొహరించారు.
రాష్ట్రపతి భవన్ లోపల ఇలాంటి పరిస్థితి ఉంటే.. బయట ప్రాంతాన్ని ఎన్ ఎస్ జే.. స్వాట్ టీంలు అదుపులోకి తీసుకున్నాయి. ప్రమాణస్వీకారోత్సవానికి అతిధులుగా వచ్చిన వివిద దేశాధినేతలు బస చేసిన హోటల్ నుంచి రాష్ట్రపతి భవన్ కు ఎలా వెళ్లాలి? ఎలా తిరిగి రావాలి? లాంటి అంశాలకు సంబంధించి నిర్దుష్ట ప్లాన్ సిద్ధం చేశారు. ఇందుకోసం 2500 మంది పోలీసుల్నిమొహరించారు. ఢిల్లీలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో డ్రోన్ల పహరా చేపట్టారు.