బోలెడన్ని విశేషాలకు కేరాఫ్ ప్రమాణస్వీకారోత్సవం
సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన టాప్ 10 మంది ఎంపీల్లో నలుగురికి తాజాగా కేంద్ర మంత్రి పదవులు దక్కాయి.
By: Tupaki Desk | 10 Jun 2024 11:00 AM GMTఅంచనాలకు తగ్గట్లే మోడీ 3.0 కొలువు తీరింది. ప్రమాణస్వీకార మహోత్సవం పూర్తైంది. ప్రధానిగా నరేంద్ర మోడీతో సహా 72 మంది కేంద్ర మంత్రివర్గం కొలువు తీరింది. సభ్యులందరూ ప్రమాణస్వీకారం పూర్తి చేశారు. దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన ఈ వేడుకలో విశేషాలకు కొదవ లేదు. అంచనాలకు తగ్గట్లే మిత్రపక్షాలకు ఈసారి మంత్రివర్గంలో పెద్దపీట వేశారు. ప్రాధాన్యతను ఇచ్చారు. ఆ మాటకు వస్తే.. సొంత పార్టీ వారికి కాస్తంత ప్రాధాన్యత తగ్గించారని చెప్పక తప్పదు. ప్రమాణస్వీకారోత్సవ వేళ.. ఆసక్తికర ఐదు అంశాల్ని చూస్తే..
టాప్ 10 మెజార్టీ నేతల్లో నలుగురికి మంత్రిపదవులు
సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన టాప్ 10 మంది ఎంపీల్లో నలుగురికి తాజాగా కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈసారి ఎన్నికల్లో 400 ప్లస్ సీట్ల టార్గెట్ పెట్టుకోవటం.. బీజేపీ సొంతంగా 370 సీట్లను సొంతం చేసుకోవటం లాంటివన్నీ కూడా మోడీ కారణంగానే సాగాయి. అయితే.. అలాంటి మోడీకి మాత్రం ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన వారణాసిలో ఆదరణ తగ్గింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఆయన మెజార్టీ భారీగా తగ్గటమే దీనికి కారణం.
ఇందుకు భిన్నంగా మోడీకి అత్యంత సన్నిహితుడైన అమిత్ షా మాత్రం టాప్ 10 మెజార్టీ సాధించిన ఎంపీల్లో ఒకరిగా నిలవటం విశేషం. అత్యధిక మెజార్టీలు సాధించి.. తాజాగా మంత్రి పదవుల్ని సొంతం చేసుకున్న నలుగురు ఎవరంటే.. అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియా, సీఆర్ పాటిల్. అమిత్ షా గాంధీ నగర్ నియోజకవర్గంనుంచి 7.44 లక్షలకు పైగా మెజార్టీని సాధిస్తే.. జ్యోతిరాదిత్య సింధియా 5.40 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీని సొంతం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ లోని గుణ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగారు. సీఆర్ పాటిల్ విషయానికి వస్తే గుజరాత్ లోని నవ్ సారి నుంచి 7.73 లక్షల ఓట్లకు పైగా మెజార్టీని సాధించారు.
అత్యధికులు హిందీ.. కొందరే ఇంగ్లిషు
ప్రధానమంత్రిగా మోడీ మొదలు కొని మంత్రి వర్గంలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో అత్యధికులు హిందీలోనే ప్రమాణస్వీకారం చేశారు. కొద్ది మంది మాత్రమే ఇంగ్లిషులో చేశారు. ఏపీకి చెందిన ఇద్దరు తెలుగుదేశం ఎంపీలు (కింజరపు రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ పెమ్మసాని) ఇంగ్లిషులో ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీకి చెందిన ఏపీలోని నరసాపురం నుంచి విజయం సాధించిన ఎంపీ శ్రీనివాస వర్మ హిందీలో ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ నుంచి కేంద్రమంత్రి పదవుల్నిసొంతం చేసుకున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఇద్దరు హిందీలోనే ప్రమాణస్వీకారం చేశారు.
తడబడ్డ మంత్రులు ఎక్కువే
ప్రమాణస్వీకారం వేళ తడబడే అలవాటు కొందరిలో ఉంటుంది. ఎంపీలతో పోలిస్తే ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అయితే..మంత్రుల హోదాల్లోకి వెళ్లిన వారు తమ ప్రమాణస్వీకార వేళ తడబడటం చాలా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే.. మోడీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న 72 మంది మంత్రుల్లో దాదాపు తొమ్మిది మంది వరకు తడబడటం విశేషం. కేంద్రమంత్రిగా 2014 నుంచి వరుసగా చోటు దక్కించుకున్న కిరణ్ రిజుజు లాంటి సీనియర్ నేత సైతం తడబడటం విశేషం.
పంచకట్టెతో అదరగొట్టిన సురేశ్ గోపీ
దక్షిణాదిన అందునా కేరళ.. కర్ణాటక.. తమిళ ప్రజలు తమ కల్చర్ ను ఎంతలా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. మన సంప్రదాయ పంచెనుకట్టుకోవటానికి తెలుగువారు అస్సలు ఇష్టపడరు. అదే తమిళులు అయితే వేదిక ఏదైనా వాటిని ధరించి వెళ్లేందుకు అస్సలు వెనుకాడరు. మలయాళీలు కూడా ఇందుకు మినహాయింపుకాదు. కేరళలో తొలిసారి బీజేపీ తరఫునఎంపీగా ఎన్నికైన ఘతను సాధించిన సినీ నటుడు సురేశ్ గోపీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి సంప్రదాయ పంచెకట్టులోనే హాజరై అలరించారు.మిగిలినవారికి భిన్నంగా కనిపించారు. ఇలాంటి తీరు మన తెలుగు నేతల్లో కాగడా పట్టి వెతికినా కనిపించదని చెప్పాలి.
యూపీ.. బిహార్ లకే ఎక్కువ మంత్రి పదవులు
కమలనాథులు కలలు కన్న 370 సీట్లు రాకపోవటానికి.. ఎన్డీయే మొత్తం కలిపి 400ప్లస్ సీట్లు రాకపోవటానికి కారణం యూపీ.. బిహార్ లో ఆ పార్టీకి అనుకున్న సీట్లు రాకపోవటం. ఈ రెండు రాష్ట్రాల్లో తగినన్ని సీట్లు వచ్చి ఉంటే.. 400ప్లస్ కాకుండా.. కూటమి మొత్తం కలిపి 370 సీట్లు వచ్చే వీలుండేది. అయితే.. కేంద్ర కేబినెట్ లో ఈ రెండు రాష్ట్రాలకు పెద్దపీట వేయటం గమనార్హం.
యూపీలో బీజేపీకి బాగా దెబ్బ తిన్నప్పటికీ ఆ రాష్ట్రానికి మంత్రి వర్గంలో తొమ్మిది స్థానాలు కేటాయించారు. బిహార్ విషయానికి వస్తే 8 పదవులు కట్టబెట్టారు. మహారాష్ట్రకు 6, గుజరాత్ కు 5, మధ్యప్రదేశ్ కు 5, కర్ణాటకకు 5, రాజస్థాన్ కు 5, ఒడిశాకు 2, ఏపీకి 3, తెలంగాణకు 2 మంత్రి పదవులు కేటాయించారు.