ఏపీలో పోలింగ్ గుబులు.. చివరి గంటే కీలకం !
వరసగా మూడు రోజులు సెలవులు పైన మాడు పగిలే ఎండలు. ఇదీ మే 13 పోలింగ్ ముందు ఉన్న పరిస్థితి.
By: Tupaki Desk | 3 May 2024 3:53 AM GMTవరసగా మూడు రోజులు సెలవులు పైన మాడు పగిలే ఎండలు. ఇదీ మే 13 పోలింగ్ ముందు ఉన్న పరిస్థితి. అర్బన్ ఓటర్లు ఎపుడూ ఓటింగులో తక్కువ పాల్గొంటారు. ఈసారి మండించే ఎండలలో వారు వస్తారా అన్న టెన్షన్ రాజకీయ పార్టీలకు పట్టుకుంది. మొదటి రెండు విడతల పోలింగ్ దేశంలో చూశాక తెలుగు రాష్ట్రాలలోనూ పోలింగు గుబులు పెద్ద ఎత్తున మొదలవుతోంది.
పోలింగుకు జనాలు రాకపోతే తమకు అనుకూలంగా ఉండే సెక్షన్లు ఓటుకు దూరంగా ఉంటే అపుడు సంగతేంటి అన్నది లెక్కలు వేసుకుని మరీ గుంజాటన పడుతున్నారు. ఇప్పటికే తెలంగాణాలో పోలింగ్ విషయంలో అన్నీ విశ్లేషించుకున్న మీదటన రాజకీయ పార్టీలు విన్నపం చేశాయి. దాంతో తెలంగాణాలో ఒక గంట అదనంగా పోలింగ్ కి టైం ఇచ్చారు. అంటే అయిదుతో ముగియాల్సిన పోలింగ్ ని ఆరుకు పెంచారన్న మాట.
ఇక ఏపీలో కూడా ఇదే రకమైన విన్నపాన్ని టీడీపీ చేసింది. ఏపీలో ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, పోలింగ్ సమయం పెంచాలంటూ టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ సమయాన్ని మరో గంట పెంచాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. సాయంత్రం 5 తర్వాత మరో గంట పాటు పోలింగ్ కొనసాగేలా అనుమతించాలని తన లేఖలో కోరారు.
ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో రాజకీయ లెక్కలు వేరేగా ఉన్నాయి. అర్బన్ ఓటర్లు పూర్తిగా వైసీపీ ప్రభుత్వం పట్ల విముఖంగా ఉన్నారు అని విపక్షం భావిస్తోంది. వారంతా పోలింగ్ కేంద్రాల వద్దకు దండెత్తి వస్తే అది టీడీపీకి పూర్తి అనుకూలంగా మారుతుంది అని అంటున్నారు.
వారు కనుక ముఖం చాటేస్తే ఆ మేరకు టీడీపీకి రాజకీయంగా నష్టం జరుగుతుంది అని కూడా కలవరపడుతున్నారు. మరో వైపు చూస్తే రూరల్ లో వైసీపీకి పట్టు ఉంది అనుకూలంగా ఉంది అన్న అంచనాలు ఉన్నాయి. రూరల్ ఓటర్లు నిబద్ధతతో ఎపుడూ ఓట్లు వేస్తారు అక్కడ ఓటింగ్ శాతం పెరిగి పట్టణాలలో తగ్గితే ఫలితం తేడా కొడుతుంది అని విపక్ష కూటమి భయపడుతోంది.
అసలే ఈ నెల 11న సెకండ్ సాటర్ డే ఉంది, 12న సండే ఆదివారం, 13న పోలింగ్ డే హాలీ డే. దాంతో వరస మూడు రోజులు సెలవులు. మండించే ఎండల నుంచి ఉపశమనం కోసం హాలీడే ట్రిప్పులకు వెళ్ళేవారు కూడా ఈసారి ఎక్కువగా ఉన్నారు. దాంతో పాటు ఎండలు కనుక మండిస్తే ఎవరూ ఓటు వేయడానికి జంకి రారు. అదే ఆరు గంటల వరకూ ఓటింగ్ కి సమయం పొడిగిస్తే చివరి నిమిషం పోలింగ్ కేంద్రానికి వచ్చినా రాత్రి ఎంతసేపు అయినా ఓటేసే చాన్స్ ఉంటుంది. దంతో అదనపు గంట కోసం విపక్షమే ఎక్కువగా పట్టుబడుతోంది. ఈసీ ఏ విధంగా డెసిషన్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది.