గ్రౌండ్ రిపోర్టు: పుంగనూరులో అసలేం జరిగింది? గొడవకు కారణమేంది?
అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న పుంగనూరులో గురువారం మొత్తం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
By: Tupaki Desk | 19 July 2024 3:54 AM GMTఅనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న పుంగనూరులో గురువారం మొత్తం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీవీ చానళ్లలోనూ.. యూట్యూబ్ లలోనూ.. సోషల్ మీడియా పోస్టుల్లోనూ ఎవరికి వారు తమ వాదనను వినిపించారే కానీ.. గ్రౌండ్ జీరోలో ఏం జరిగింది? ఇంతటి తీవ్ర ఉద్రిక్తతకు కారణమేంటి? గొడవ ఎక్కడ మొదలైంది? అధికార టీడీపీ.. వైసీపీ మధ్య రాళ్లు రువ్వుకోవటం.. గాయాల బారిన పడటం వరకు విషయం ఎందుకు వెళ్లింది? ఈ మొత్తం ఎపిసోడ్ లో టీడీపీ కార్యకర్తలకు ఏం జరిగింది? వైసీపీ సానుభూతిపరుల్లో ఎంతమందికి గాయాలయ్యాయి? ఇరు పక్షాలకు సంబంధించి జరిగిన ఆస్తి నష్టం ఏమిటి? లాంటి అన్ని ప్రశ్నలకు సాపేక్షంగా సమాధానాలు వెతికితే..
గురువారం ఉదయం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుంగనూరు పట్టణంలోని మాజీ ఎంపీ.. వైసీప నేత రెడ్డప్ప ఇంటికి వచ్చినట్లుగా సమాచారం బయటకు వచ్చింది. ఆయన రాకకు సంబంధించి ముందస్తుగా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. మిథున్ రెడ్డి పట్టణానికి వచ్చినట్లుగా తెలుసుకున్న పుంగునూరు మండలం నేతిగుట్లపల్లె జలాశయ భూనిర్వాసితులతో పాటు తెలుగుదేశం నేతలు ఎంపీ రెడ్డప్ప ఇంటికి చేరుకున్నారు. ఎంపీ మిథున్ రెడ్డికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ పనులు చేసిందని.. భూనిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదంటూ నిరసన చేపట్టారు.
అయితే.. మాజీ ఎంపీ ఇంటి వద్ద పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు.. సానుభూతిపరులు ఉన్నారు. తమకు న్యాయం చేయాలంటూ భూనిర్వాసితులు డిమాండ్ చేయటంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. చూస్తుండగానే పరిస్థితి అదుపు తప్పింది. టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య మొదలైన వాగ్వాదం.. కర్రలు.. కుర్చీలు విసిరేసుకునే వరకు వెళ్లింది. అలా మొదలైన గొడవ విడతల వారీగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాగింది.
ఇక్కడో విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలి. అల్లర్లు.. గొడవలను నిలువరించటంలో పోలీసులు అడ్డంగా ఫెయిల్ అయ్యారు. ఒకదశలో ఎంపీ మిథున్ రెడ్డి గన్ మెన్ గాల్లోకి రబ్బరు బుల్లెట్లు ఉపయోగించాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. అగ్నికి వాయువు తోడైనట్లుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల వేళ.. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు మాజీ ఎంపీ రెడ్డప్ప కారుకు నిప్పు పెట్టటంతో పరిస్థితి చేజారింది. ఇలాంటి వేళ.. పోలీసులు ఎంపీ మిథున్ రెడ్డిని మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో నుంచి బయటకు రాకుండా నిలువరించారు.
అసలీ ఉద్రిక్తతకు.. నిరసనకు కారణం మిథున్ రెడ్డినే అని చెబుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నేతిగుట్లపల్లి జలాశయాన్ని నిర్మించారని.. భయపెట్టి రైతుల నుంచి భూములు లాక్కున్నట్లుగా మండిపడుతున్నారు. అప్పట్లో మంత్రి పెద్దిరెడ్డి ఒక్క రూపాయి కూడా పరిహారం ఇప్పించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి మిథున్ రెడ్డి కానీ ఆయన వర్గీయులు కానీ ఎలాంటి సమాధానం చెప్పని పరిస్థితి. ఎన్నికల వేళలోనూ నేతిగుట్లపల్లి రిజర్వాయర్ భూనిర్వాసితులకు పరిహారం గురించి ప్రశ్నిస్తే.. వైసీపీకి ఓట్లు వేస్తే సమస్యను పరిష్కరిస్తామని మిథున్ రెడ్డి.. పెద్దిరెడ్డి ప్రచార వేళ హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత మిథున్ రెడ్డి మొదటిసారి పట్టణానికి రావటంతో.. వారి సంస్థ ఈ ప్రాజెక్టు పనులు చేపట్టటంతో పరిహారం ఇవ్వాలని అడిగేందుకు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి చేరుకొని నిరసన చేపట్టారు.
ఇక.. ఎంపీ మిథున్ రెడ్డి కొద్ది రోజుల క్రితం పుంగనూరుకు వచ్చే ప్రయత్నం చేయటం.. ఆయన పట్టణానికి వస్తే శాంతిభద్రతల సమస్య నెలకొంటుందన్న ఉద్దేశంతో ఆయన్ను తిరుపతిలోనే ఆపేశారు. తాజాగా మాత్రం పుంగనూరు పట్టణానికి వస్తున్నట్లుగా ఎలాంటి సమాచారం లేకుండా మందీ మార్బలంతో పుంగనూరు రావటం గమనార్హం. నిరసన చేసేందుకు వచ్చిన రైతులు.. టీడీపీ శ్రేణులపై రాళ్లు.. బాటిళ్లతో దాడి చేసిందెవరు? అన్నది ప్రశ్నగా మారింది. ఎందుకుంటే.. వైసీపీ వర్గీయులు ఆరోపించినట్లుగా దాడి చేయటానికి రైతులు.. టీడీపీ వర్గాలు వస్తే.. వారికే గాయాలు ఎందుకు అయ్యాయి? అన్నది ప్రశ్న.
నిరసన చేయటానికి వచ్చిన వేళలో.. రైతులు.. టీడీపీ వర్గీయుల చేతుల్లో కర్రలు.. సీసాలు లాంటివి ఏమీ లేవని.. నిరసన చేపట్టేందుకే వచ్చారని చెబుతున్నారు. అయితే.. వైసీపీ వర్గీయుల వాదన వేరేలా ఉంది. దాడులకు పాల్పడటానికే వచ్చినట్లుగా ఆరోపిస్తున్నారు. దీనికి కౌంటర్ గా టీడీపీ వర్గీయుల వాదన ఏమంటే.. తిరుపతి నుంచే మిథున్ రెడ్డి తన వర్గీయుల్ని తీసుకొచ్చారని.. ఉద్రిక్త వాతావరణం నెలకొన్నంతనే దాడులకు పాల్పడినట్లుగా మండిపడుతున్నారు.
టీడీపీ వర్గీయులు వాదన ప్రకారం తమ వారికి పెద్ద ఎత్తున గాయాలు అయినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా పన్నెండు మందికి గాయాలు అయ్యాయని.. ఒక కానిస్టేబుల్ కు దెబ్బలు తగిలినట్లుగాచెబుతూ.. వారి పేర్లను కూడా వెల్లడించారు. అదే సమయంలో వైసీపీ నేతలు తమ పార్టీకి చెందిన పాతిక మందికి తీవ్ర గాయాలు అయినట్లుగా చెబుతున్నా.. వారి వివరాలు మాత్రం విడుదల కాలేదు. సాక్షి మీడియాకు చెందిన ఇద్దరికి గాయాల బారిన పడినట్లుగా చెబుతున్నారు. కానీ.. వారి వివరాల్ని వెల్లడించలేదు. ఆస్తుల విషయానికి వస్తే.. వైసీపీకి చెందిన తొమ్మిది వాహనాలు ధ్వంసమయ్యాయి. మాజీ ఎంపీ రెడ్డప్పకు చెందిన స్కార్పియో వాహనం దహనమైంది.
గురువారం ఉదయం 10 గంటలకు మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వచ్చారు. కాసేపటికి మొదలైన ఉద్రిక్త వాతావరణం సాయంత్రం వరకు కొనసాగింది. మధ్యాహ్నం 3.30 గంటల వేళలో చిత్తూరు ఏఎస్పీ ఆరీపుల్లా తన వాహనంలో పోలీసు బందోబస్తు నడుమ మిథున్ రెడ్డిని తిరుపతికి తరలించారు. అనంతరం వాతావరణం కంట్రోల్ లోకి వచ్చింది. ఇదిలా ఉంటే..నిరసన తెలిపేందుకు వచ్చిన రైతులు.. వారికి మద్దతుగా నిలిచిన టీడీపీ వర్గీయులపై ముందుగా వేసుకున్న పథకంలో భాగంగానే దాడులు జరిగినట్లుగా టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు.
ఏపీ రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి పుంగనూరు ఉదంతం గురించి మాట్లాడుతూ.. తనకు ఎక్కువమంది గన్ మెన్ల కోసమే ఎంపీ మిథున్ రెడ్డి అల్లర్లను క్రియేట్ చేశారంటూ ఆరోపించటం గమనార్హం. మొత్తంగా పుంగనూరు ఎపిసోడ్ ఏపీ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. కాకుంటే.. అసలేం జరిగిందన్న దానిపై స్పష్టత లేని కారణంగా.. ఈ ఉద్రిక్తతల్లో ఎవరి పాత్ర ఏమిటన్న దానిపై స్పష్టత లేకపోవటంతో అయోమయం నెలకొంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పరిహారం అంశంపై ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
అయితే.. ఉద్రిక్తతలపై మాట్లాడిన ఆయన.. కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలే అజెండాగా పని చేస్తుందని మండిపడ్డారు. ప్రజలు అన్ని విషయాల్ని గమనిస్తున్నారని.. అధికారం ఎవరికీ శాశ్వితం కాదన్నారు. నియోజకవర్గంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు గతంలో ఎప్పుడూ చూడలేదన్న ఆయన.. వైసీపీ కార్యకర్తల ఇళ్లను కూల్చటం.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయటం.. పిల్లలు ఆడుకునే బ్యాడ్మింటన్ కోర్టును ధ్వంసం చేశారన్నారు. కుటిల యత్నాలతో చంద్రబాబు ప్రభుత్వం హింసాత్మక దాడులకు పాల్పడితే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మండిపడ్డారు.
పుంగనూరు ఉద్రిక్త వాతావరణంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎంపీ మిథున్ రెడ్డి.. మాజీ ఎంపీ రెడ్డప్పలపై దాడి చేయటాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేవారు. టీడీపీ గూండాలు వినుకొండలో రషీద్ ను దారుణంగా హత్య చేసిన 24 గంటల్లోనే పుంగనూరులో దాడి చోటు చేసుకుందని.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతిభద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ హింసకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.