Begin typing your search above and press return to search.

వెర్రి వేలరకాలు.. పిచ్చి పలువిధాలు.. సైన్ బోర్డుపై పుల్ అప్సులు!!

సోషల్ మీడియాలో రీల్స్ కోసం కొంతమంది చేసే విచిత్ర వ్యవహారాలు చూస్తుంటే... వెర్రి వేల రకాలు.. పిచ్చి పలువిధాలు అని అనిపిస్తుంటుంది!

By:  Tupaki Desk   |   30 Sep 2024 6:30 AM GMT
వెర్రి వేలరకాలు.. పిచ్చి పలువిధాలు.. సైన్  బోర్డుపై పుల్  అప్సులు!!
X

సోషల్ మీడియాలో రీల్స్ కోసం కొంతమంది చేసే విచిత్ర వ్యవహారాలు చూస్తుంటే... వెర్రి వేల రకాలు.. పిచ్చి పలువిధాలు అని అనిపిస్తుంటుంది! రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోవాలనో.. సోషల్ మీడియా సెలబ్రెటీగా పేరు సంపాదించాలనో కొంతమంది రీల్స్ పేరుమీద చిత్రవిచిత్రమైన పనులు చేస్తారనే సంగతి తెలిసిందే.

ఈ విషయంలో కొంతమంది చేసే పనులు చికాకు తెప్పిస్తే, మరి కొంతమంది పనులు అసహ్యంగా అనిపిస్తుంటాయి. ఇక ఇంకొన్ని అయితే భయాందోళనలు కలిగిస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా ఓ వ్యక్తి రోడ్డుపై ఉండే సైన్ బోర్డు పైకి ఎక్కి పుల్ అప్స్ తీస్తూ వీడియో తీసుకున్నాడు. ఇప్పుడు అది వైరల్ గా మారింది.

అవును... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమేఠీ లోని నేషనల్ హై వేపై ఓ యువకుడు ప్రమాదకర స్టంట్లు చేశాడు! ఇందులో భాగంగా... రోడ్డుపై ఉండే సైన్ బోర్డుపైకి ఎక్కి పుల్ అప్స్ తీశాడు. నేల నుంచి సుమారు 10 మీటర్ల ఎత్తులో వేలాడుతూ ఈ పనికి పూనుకున్నాడు. ఈ సమాంలో మరో యువకుడు పైకి ఎక్కి వీడియో తీశాడు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన నెటిజలు హెచ్చరికలతో కూడిన కామెంట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా... ప్రాణాలు చాలా విలువైనవని.. ఇలాంటి పనులు చేయడం ఏమాత్రం సరికాదని చెబుతున్నారు. రీల్స్ కోసం ఇలాంటి పనులు చెసేవారిపై చర్యలు తీసుకోవాలని మరొకరు స్పందించారు.

మరోపక్క ఈ వ్యవహారంపై స్థానిక పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఇలాంటి పనులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.