Begin typing your search above and press return to search.

అదేమన్నా ట్రంప్ కుక్కపిల్ల పేరా?.ఇష్టమొచ్చినట్లు మార్చటానికి!

దశాబ్దాలుగా స్థిరపడిపోయిన ఒక భౌగోళిక స్వరూపం పేరును ఊరకే ఒక దేశాధ్యక్షుడు ఇష్టం వచ్చినట్లుగా మార్చితే ఇబ్బందులు రావా? అనేది ఇక్కడ అసలు ప్రశ్న.

By:  Tupaki Desk   |   23 Jan 2025 6:30 AM GMT
అదేమన్నా ట్రంప్ కుక్కపిల్ల పేరా?.ఇష్టమొచ్చినట్లు మార్చటానికి!
X

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేస్తున్న వేళ ట్రంప్ నోటి నుంచి వచ్చిన ఒక మాటకు అక్కడే ఉన్న ఆయన ప్రత్యర్థి పార్టీకి చెందిన హిల్లరీ క్లింటన్ ఫక్కున నవ్వేశారు. ఇదే అంశాన్ని మీడియా కవర్ చేసింది. ఇంతకూ అంత సీరియస్ గా ట్రంప్ మాట్లాడుతుంటే.. ట్రంప్ మాటల్ని కామెడీగా తీసుకొని నవ్వటం వెనుక అసలు లెక్కలు వేరే ఉన్నాయని చెబుతున్నారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు.. వాస్తవానికి దూరంగా ఉండటం.. అదంత తేలికైన విషయం కాదన్న సంకేతం వచ్చేలా ఆమె ఫక్కున నవ్వారన్న విశ్లేషణలు మొదలయ్యాయి.

నచ్చిన కుక్క పిల్లకు కొత్త పేరు పెట్టేసే ఉబలాటం మనిషికి ఉంటుంది. దానికి అంతకు ముందు ఏమైనా పేరుందా? లేదా? అన్నది పట్టించుకోరు. పాపం.. మూగజీవి కావటంతో అది కూడా ఏమీ అనదు. అదే పనిగా ఒక పేరును తనను ఉద్దేశించి అంటుంటే అది స్పందిస్తుంది. సాధారణంగా జంతువుల్లో ఈ లక్షణం కనిపిస్తుంది. ఆ మాటకు వస్తే మనుషులు కూడా అందుకు మినహాయింపు కాదు. అన్నింటికి అదే రూల్ వర్తిస్తుందని చెప్పలేం. ప్రమాణస్వీకార వేళ.. ట్రంప్ నోటి నుంచి వచ్చిన మాట.. నోటి మాటగా అయితే ఓకే. వాస్తవ రూపం దాల్చాలంటే దానికి చేయాల్సిన కసరత్తు.. చేపట్టాల్సిన మార్పులు అన్ని ఇన్ని కావు.

ట్రంప్ ప్రమాణ స్వీకారం వేళ హిల్లరీ క్లింటన్ నవ్విన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి అసలు కారణం.. దశాబ్దాలుగా స్థిరపడిపోయిన ఒక భౌగోళిక స్వరూపం పేరును ఊరకే ఒక దేశాధ్యక్షుడు ఇష్టం వచ్చినట్లుగా మార్చితే ఇబ్బందులు రావా? అనేది ఇక్కడ అసలు ప్రశ్న. గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనే పేరు శతాబ్దాల క్రితమే స్థిరపడిపోయింది. ఇప్పుడు ఆ పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానంటూ ట్రంప్ మాష్టారు భీషణ ప్రతిజ్ఞ మాదిరి మాట్లాడేశారు.

ఒక ప్రాంతాన్ని తనకు తోచినట్లుగా మార్చి పిలవటం ట్రంప్ నకు సులువు కావొచ్చు.కానీ.. అలా పిలవటం ఆచరణలో అంత తేలికైన విషయం కాదు. ఒక దేశం తమకు నచ్చినట్లుగా ఒక ప్రాంతాన్ని ఇప్పుడున్న దానికి భిన్నమైన పేరుతో పిలుస్తామని చెప్పటం వినేందుకు బాగానే ఉన్నా.. అదంత తేలికైన విషయం కాదు. అదో సుదీర్ఘ ప్రక్రియ. వ్యయప్రయాసలు భారీగా ఉంటాయి. ఒక ప్రాంతానికి కొత్తగా పేరు తగిలించటానికి అంతర్జాతీయంగా మ్యాప్ లలో పేర్లు మార్చాల్సి ఉంటుంది.

సదరు మార్గంలో వెళ్లే భారీ నౌకల సాఫ్ట్ వేర్ లలో.. సముద్ర సంబంధ శాటిలైట్ల డేటాలోనూ.. చమురు.. వాణిజ్య సంస్థ ఒప్పందాల్లో.. ఆ మాటకు వస్తే అది ఇది కాదు.. ఎన్నో అంశాల్లో ఆ ప్రాంతం పాత పేరును చెరిపేసి.. కొత్త పేరును రాయాల్సి ఉంటుంది. ఇదంతా ఎంతో శ్రమతోనూ.. ఖర్చుతోనూ కూడుకున్న వ్యవహారం. అయినా.. సరే చేసేద్దాం.. ట్రంప్ ముచ్చట పడ్డారనుకుంటే సరిపోదు. దీనికి.. ప్రపంచ దేశాల నుంచి ఏకాభిప్రాయానికి రావాలి. అందుకు ఎంత శ్రమన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇంత సుదీర్ఘ ప్రక్రియ కళ్ల ముందు కనపడుతున్న వేళ.. అందుకు భిన్నంగా ఆవేశంతో ట్రంప్ నోటి నుంచి వస్తున్న మాటలకు హిల్లరీ క్లింటన్ పెదాల మీద నవ్వులు విరబూశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.