సీఎం మర్యాద మాటలు... తాగి ఓవరేక్షన్ చేస్తే వీఐపీ ట్రీట్ మెంట్ ప్లీజ్!
హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు పర్యాటకులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందని చెబుతున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు.
By: Tupaki Desk | 26 Dec 2023 6:21 AM GMTకడుపు నిండిన వాడికి ఆకలి విలువ తెలియదు కానీ... ఆకలితో ఉన్నవాడికే అన్నం విలువ తెలుస్తుంది అంటారు. ప్రకృతి విపత్తుల కారణంగా పూర్తిగా నష్టపోయిన పర్యాటక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టాలని.. అందుకు తమ వంతు సాయం అందించే వారిని ఉన్నంతలో మర్యాదగా ట్రీట్ చేయాలని.. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా లిమిట్ గా మందు తాగితే ఓకే కానీ... శృతిమించి సేవించి సందడి చేయాలని ఓవర్ యాక్షన్ చేసేవారిని మాత్రం ఎత్తుకెళ్లి హోటల్ లో ఉంచాలని నిర్ణయించారు.
అవును... ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో తలెత్తిన ప్రకృతి విపత్తు సందర్భంగా పర్యాటక రంగం భారీగా నష్టపోయింది! ఈ క్రమంలో ప్రస్తుతం పరిస్థితులు కాస్త అనుకూలిస్తుండటంతో హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు పర్యాటకులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందని చెబుతున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు. ఇందులో భాగంగా... తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో వింటర్ కార్నివాల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సెలవుల సందర్భంగా వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు ఆ వింటర్ కార్నివాల్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే దేశం నలు మూలల నుంచి వచ్చే పర్యాటకులు.. మంచుకురిసే ప్రాంతంలో ఎంజాయ్ చేస్తూ మద్యం సేవించి ఓవరాక్షన్ చేస్తే వారిని జైళ్లకు కాకుండా హోటల్ రూం లకు తరలించాలని హిమాచల్ ప్రదేశ్ పోలీసులకు ఆ రాష్ట్ర సీఎం సూచించారు.
ఇలా తొలిసారిగా సిమ్లాలో ఏడు రోజుల పాటు కొనసాగే ఈ వింటర్ కార్నివాల్ ను ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రారంభించారు. సాంస్కృతిక కవాతు, గ్రాండ్ డ్యాన్స్ తో మొదలు పెట్టిన ఈ కార్నివాల్ లో కార్యక్రమాలను వీక్షించిన ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ.. అక్కడి ఏర్పాట్లను తిలకించారు. ఈ సందర్భంగా ఈ కార్నివాల్ లో మద్యం తాగి డ్యాన్స్ చేసే వారితో సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు మర్యాదపూర్వకంగా ఉన్నట్లు కనిపించారు.
ఈ సందర్భంగా స్పందించిన ఆయన... దేశం మొత్తం నుంచి భారీగా పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్ కు తరలివస్తున్నారని తెలిపారు. అలా భారీ ఎత్తున తరలివస్తున్న వారి కోసం హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లు, ఇతర ఫుడ్ స్టాల్స్ లను 24 గంటలూ తెరిచి ఉంచొచ్చని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఇదే సమయంలో... పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కాగా... హిమాచల్ ప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన సిమ్లా, మనాలిలకు భారీగా పర్యాటకులు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... లక్షల మంది పర్యాటకులు సిమ్లా, మనాలి ప్రాంతాల్లో బస చేస్తున్నారు. ఇటీవల వరుస సెలవులు రావడంతో హిమాచల్ ప్రదేశ్ కు పర్యాటకులు పోటెత్తారు. దీంతో రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ ఏర్పడింది.