సంచలనం.. ఆ రాష్ట్రంలో అమ్మాయిల పెళ్లి వయసు అంతకు మార్చారు
అమ్మాయిగా పుట్టటమే పాపం అన్నట్లుగా.. పెళ్లి కోసమే పుట్టిందన్న మైండ్ సెట్ ఇప్పటికి చాలామందిలో కనిపిస్తుంది.
By: Tupaki Desk | 13 Jan 2024 5:34 AM GMTఅమ్మాయిగా పుట్టటమే పాపం అన్నట్లుగా.. పెళ్లి కోసమే పుట్టిందన్న మైండ్ సెట్ ఇప్పటికి చాలామందిలో కనిపిస్తుంది. సరైన చదువు కంటే కూడా పెళ్లి చేసేస్తే సరిపోతుందన్నట్లుగా ఆలోచించే తల్లిదండ్రులు ఇప్పటికి సమాజంలో ఉన్నారు. అమ్మాయి పెళ్లికి సంబంధించి తల్లిదండ్రులకు చట్టం ద్వారా బంధనాలు వేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని గుర్తించినప్పటికీ దేశంలోని రాష్ట్రాలు సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోవటంలో మాత్రం ఫెయిల్ అవుతూ ఉంటాయి.
తాజాగా ఆ కొరతను తీర్చేస్తూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో అమ్మాయిల పెళ్లి వయసు 18 ఏళ్లు కాగా.. తాజాగా తీసుకున్న నిర్ణయంతో అది కాస్తా 21 ఏళ్లకు పెరిగింది. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో.. ఆడ పిల్లలు చదువుకోవాలన్నా.. జీవితంలో ఏదో ఒకస్థాయికి సొంతంగా చేరుకోవటానికి వీలుగా తాజా నిర్ణయం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అమ్మాయిల చట్టబద్ధమైన వివాహ వయో పరిమితిని పెంచేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలన్న అంశంతో పాటు.. ఈ వ్యవహారంలో సాధ్యాసాధ్యాలపై హిమాచల్ సర్కారు ఒక కమిటీని గత డిసెంబరులో ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చెందిన పలువురు సభ్యులు చేసిన సూచనతో తాజాగా సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ కాళ్లపై తాము నిలబడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలన్న స్ప్రహ అమ్మాయిల్లో పెరిగిందని.. వారి ఆకాంక్షలకు తగ్గట్లే చట్టబద్ధమైన రక్షణ ఇచ్చేందుకు హిమాచల్ సర్కారు సరైన సమయంలో తగిన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ తరహా నిర్ణయాన్ని తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు త్వరలో తీసుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమ్మాయిల పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచటం ద్వారా.. సమాజంలోని కొన్ని రుగ్మతలకు చికిత్స మొదలైనట్లుగా చెప్పక తప్పదు.