ముస్లింల జనాభాపై సీఎం సంచలన వ్యాఖ్యలు!
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 20 July 2024 5:54 AM GMTఅస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో ముస్లింల జనాభా విపరీతంగా పెరిగిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అస్సాంలో ముస్లింల జనాభా ప్రతి పదేళ్లకు 30 శాతం చొప్పున పెరుగుతుంటే.. హిందువుల జనాభా 16 శాతమే పెరుగుతోందన్నారు. హిందువుల జనాభా రేటుకు మించి ముస్లింల జనాభా రేటు ఉందని తెలిపారు.
ఇలా ముస్లింల జనాభా అస్సాంలో పెరిగిపోతే 2041 నాటికి అస్సాం ముస్లిం జనాభా మెజారిటీగా ఉన్న రాష్ట్రంగా మారిపోతుందని హిమంత బిశ్వశర్మ ఆందోళన వ్యక్తం చేశారు. తాను వాస్తవం చెబుతున్నానన్నారు. దీన్ని ఎవరూ ఆపలేరన్నారు. ఈ నేపథ్యంలో ముస్లింల జనాభాను నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అధికారిక లెక్కల ప్రకారం... అస్సాంలో ఇప్పటికే 40 శాతం మంది ముస్లింలు నివసిస్తున్నారని హిమంత బిశ్వశర్మ తెలిపారు. హిందువుల కంటే ముస్లింల జనాభా పెరుగుదల రేటు చాలా ఎక్కువగా ఉందన్నారు. ఈ రేటు ప్రకారం, 2041 నాటికి అస్సాంలో ముస్లింలు మెజార్టీగా ఉంటారని వెల్లడించారు.
ఇదే సమయంలో ముస్లింల పెరుగుదలతో పోల్చితే హిందువుల జనాభా ప్రతి పదేళ్లకు 16 శాతం మాత్రమే పెరుగుతుందని అస్సాం సీఎం వ్యాఖ్యానించారు.
కాగా ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 2011లో అస్సాం జనాభాలో ముస్లింలు 1.40 కోట్ల మంది ఉన్నారు. ప్రతి 10 సంవత్సరాలకు 30 శాతం ముస్లిం జనాభా పెరుగుతోంది. ప్రతి పదేళ్లకు 22 లక్షల మంది ముస్లిం జనాభా అదనంగా పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో అస్సాంలో మారుతున్న జనాభా లెక్కలు తనను చాలా ఆందోళనకు గురిచేశాయని హిమంత బిశ్వశర్మ తెలిపారు. ఇది తనకు రాజకీయ సమస్య కాదని.. జీవన్మరణ సమస్య అని ఆయన హాట్ కామెంట్స్ చేశారు.
జనాభాను మార్చడం తనకు పెద్ద సమస్య అని బిశ్వశర్మ అన్నారు. అస్సాంలో ముస్లిం జనాభా నేడు 40 శాతానికి చేరుకుందన్నారు. 1951లో ఇది కేవలం 12 శాతమేనని చెప్పారు. అస్సాంలో చాలా జిల్లాలు ముస్లిం మెజార్టీ జిల్లాలుగా మారిపోయాయని అన్నారు.
కాగా హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్.. ఈ మేరకు హిమంతపై మండిపడ్డారు. ఆయన ‘మతిమరుపు‘తో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు.