Begin typing your search above and press return to search.

అదానీ ఊపిరిపీల్చుకో.. హిండెన్ బర్గ్ ప్రకటన

హిండెన్ బర్గ్ సంస్థను మూసివేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   16 Jan 2025 5:03 AM GMT
అదానీ ఊపిరిపీల్చుకో.. హిండెన్ బర్గ్ ప్రకటన
X

దిగ్గజ పారిశ్రామిక వేత్త అదానీకి గొప్ప ఉపశమనం. షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్ బర్గ్ వేట ముగించింది. సరిగ్గా రెండేళ్ల క్రితం సంచలన నివేదికతో అదానీ గ్రూపును వణికించిన హిండెన్ బర్గ్ సంస్థ తన కార్యకలాపాలను ముగిస్తున్నట్టు ప్రకటించి షేర్ మార్కెట్ రంగంలోని పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచింది.

హిండెన్ బర్గ్ సంస్థను మూసివేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంస్థను కొనసాగించే ఐడియాలు అన్నీ అయిపోవడంతో మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు ఓ లేఖలో తెలిపారు. ఈ విషయం గురించి గత ఏడాది నుంచి కుటుంబం, స్నేహితులు, సంస్థ ఉద్యోగులతో చర్చించాను. అనంతరం హిండెన్ బర్గ్ సంస్థను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నా, దీనిపై మేం ఎంచుకున్న ప్రణాళికలు, ఐడియాలు అన్నీ అయిపోయాయని తెలిపారు.

హిండెన్ బర్గ్ మూసివేత వెనుక ఇంకే కారణాలు లేవు. నేను కంఫర్ట్ జోన్ లో ఉన్నా. ఆరోగ్య కారణాలు, వ్యక్తిగత అంశాల వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. విజయవంతమైన కెరీర్ ఏదో ఒక రోజు స్వార్థపూరిత చర్యలకు దారితీస్తుందని నాకు తెలుసు. గతంలో నన్ను నేను నిరూపించుకోవాలని అనుకునేవాడిని. హిండెన్ బర్గ్ నా జీవితంలో ఒక భాగం. జీవితానికి సరిపడా చేసిన సాహసం. ఎన్నో ఒత్తిళ్లు, సవాళ్లు ఎదురైనప్పటికీ చాలా ఉత్సాహంగా పనిచేశాం. ఇదంతా నాకో ప్రేమకథలా అనిపిస్తుందని అండర్సన్ రాసిన లేఖలో తెలిపారు.

న్యూయార్క్ కేంద్రంగా పనిచేసిన హిండెన్ బర్గ్ కంపెనీల్లో అవకతవకలు, దుర్వినియోగం, రహస్య కార్యకలాపాలను గుర్తించేది. ఈ కంపెనీ షార్ట్ సెల్లింగ్లో పెట్టుబడులు పెడుతుంది. 2017లో నాథన్ అండర్సన్ ప్రారంభించిన ఈ సంస్థ మానవ నిర్మిత కృత్రిమ విపత్తులను గుర్తిస్తామని ప్రకటించింది. అన్నట్లుగానే అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్లలో కుంభకోణానికి పాల్పడిందని నివేదిక రిలీజ్ చేసి సంచలనం రేపింది. హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ ఉక్కిరిబిక్కిరి అయింది. లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. దీంతో హిండెన్ బర్గ్ పేరు ఒక్కసారిగా మార్మోగింది.

అదానీ గ్రూపుపై సంచలన ఆరోపణలు చేసి ఆ సంస్థను దెబ్బతీసిన హిండెన్ బర్గ్ మూసివేతపై అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం సంచలన నివేదికతో ప్రపంచ వ్యాప్తంగా అందరి ద్రుష్టిని ఆకర్షించిన హిండెన్ బర్గ్ మూసివేతపై ఇన్వెష్టర్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.