Begin typing your search above and press return to search.

బంగ్లా ఎఫెక్ట్ : తెర పైకి హిందూ రాష్ట్ర డిమాండ్ ?

దేశంలో హిందూ రాష్ట్ర డిమాండ్ మరోసారి పురుడు పోసుకుంటోంది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ట్యాగ్ భారత్ కి ఉంది.

By:  Tupaki Desk   |   12 Aug 2024 4:11 AM GMT
బంగ్లా ఎఫెక్ట్ : తెర పైకి హిందూ రాష్ట్ర డిమాండ్ ?
X

దేశంలో హిందూ రాష్ట్ర డిమాండ్ మరోసారి పురుడు పోసుకుంటోంది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ట్యాగ్ భారత్ కి ఉంది. దాంతో పాటు అతి పెద్ద హిందూ దేశంగానూ భారత్ కి గుర్తింపు ఉంది. మొత్తం 143 కోట్ల మంది భారతీయులలో వంద కోట్ల దాకా హిందువులు ఉన్న దేశంగా ఉంది.

ఇక భారత్ తరువాత నేపాల్ హిందూ దేశంగా ఉండేది. కానీ అక్కడ వామపక్ష ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి సెక్యూలర్ బాట పట్టించాయి. తిరిగి హిందూ దేశంగా నేపాల్ ని గుర్తించాలని డిమాండ్ ఉంది. ఇక పోతే భారత్ పొరుగు దేశాలలో హిందువులకు ఎలాంటి రక్షణ లేదు అన్నది పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్ లో జరిగే నర మేధాలు రుజువు చేశాయి. బంగ్లాదేశ్ లో హిందువులు ఈ మధ్య దాకా ప్రశాంతంగానే ఉన్నారు. పైగా ఒక ముస్లిం దేశంలో అత్యధిక శాతం అంటే 12 శాతం హిందువుల జనాభా ఉన్నది బంగ్లాదేశ్ లోనే.

అయితే షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్ లో హిందువులు నరకం చూస్తున్నారు. విద్యార్థులు రిజర్వేషన్ల కోసం లేవనెత్తిన ఉద్యమాన్ని మత చాందసవాదులు హైజాక్ చేసి హిందువుల మీద పడ్డారు. వారి మాన ధన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దాంతో ఎక్కడ చూసినా దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ నేపధ్యంలో నుంచి చూసినపుడు హిందువులు అక్కడ బిక్కుబిక్కుమంటున్నారు. దాంతో వారంతా ధైర్యం కూడదీసుకుని ఈ నెల 9న బంగ్లా వీధుల్లోకి వచ్చారు. లక్షలాది మంది హిందువులతో అతి పెద్ద ర్యాలీ నిర్వహించారు. సుప్రీంకోర్టుతో పాటు అన్ని ప్రభుత్వ భవనాలను హిందూ జనాలు దిగ్బంధనం చేశారు.

తమను తామే రక్షించుకుంటామని అంటున్నారు. ఒక విధంగా బంగ్లాలో హిందువులు తెగువ చూపించారు. ఈ నేపధ్యంలో సెక్యులర్ దేశంగా ఉన్న భారత్ లో హిందువులు ఈ రోజుకు బాగానే ఉన్నా రానున్న దశాబ్దాలలో పరిస్థితి ఏమిటి అన్న చర్చ అయితే సాగుతోంది.

ఎక్కడైతే హిందువులు మైనారిటీలుగా మారుతారో అక్కడ వారు నరకం చూస్తారని పొరుగు దేశాలు నేర్పిన గుణపాఠం అని భారదేశంలోని హిందూత్వ వాదులు అంటున్నారు. అత్యధిక శాతం హిందువులు ఉన్న ఏకైక దేశంగా భారత్ ఉన్నపుడు హిందూ దేశంగా ప్రకటించి హిందువులను పరిరక్షించుకునే చర్యలు ఇప్పటి నుంచే ఎందుకు చేపట్టకూడదు అని హిందూ సంస్థల నుంచి మెల్లగా డిమాండ్ బయల్దేరింది.

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆ పార్టీ నినాదం హిందూత్వనే. కానీ మూడవసారి సొంత మెజారిటీతో బీజేపీ అధికారంలోకి రాలేదు. జేడీయూ టీడీపీ మద్దతుతో అధికారం చలాయిస్తోంది. గత రెండు సార్లూ పూర్తి మెజారిటీ ఉండడంతో తాను అనుకున్న కొన్ని పనులను చేయగలిగింది. ఈసారి 400 ఎంపీ సీట్లు అన్న టార్గెట్ తో బరిలోకి దిగినా కూడా చివరికి దక్కింది 240 సీట్లు మాత్రమే.

దీంతో బీజేపీ ఈ అయిదేళ్ళూ అధికారాన్ని కాపాడుకోవడం మీదనే దృష్టి పెట్టాలి తప్ప హిందూత్వ అంటూ సున్నిత అంశాల మీదకు వెళ్ళకూడదని అంటున్నారు. మరో వైపు చూస్తే సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అని బీజేపీ ఎంత నినదించినా ఓట్లూ సీట్లు ఏ మాత్రం పెరగడం లేదని పైగా విపక్షాలు బలపడుతున్నాయని అంటున్నారు.

దాంతో కాషాయ శిబిరంలో మధనం మొదలైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హిందూత్వ నినాదాన్ని ఎత్తుకోవాలని కూడా పార్టీలో చర్చ సాగుతోందని అంటున్నారు. అలా ఒక టెస్ట్ గా హిందూత్వను మళ్లీ పదును పెడితే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కనుక దక్కితే అపుడు భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేయవచ్చు అని అంటున్నారు.

పైగా ఇపుడు బంగ్లాదేశ్ పరిణామాల నేపధ్యంలో హిందూత్వ నినాదం ఎత్తుకుంటే రాజకీయంగా బలంగా ఉంటుందని కూడా యోచిస్తున్నారుట. ఏది ఏమైనా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నపుడే హిందూ దేశంగా ప్రకటించేలా చేసుకోవాలని హిందూత్వ సంస్థలు ఆరాటపడుతున్నాయి. మరి దానికి రాజకీయ బలం ఎంతవరకూ సరిపోతుంది అన్నది కూడా చూడాల్సి ఉంది.