అక్టోబర్ 'హిందూ వారసత్వ మాసం'... యూఎస్ లో ప్రకటన!
ఈ క్రమంలో తాజాగా జార్జియా రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. హిందువుల మనోభావాలను మరింతగా గౌరవించే పనికి పూనుకుంది.
By: Tupaki Desk | 2 Sep 2023 6:37 AM GMTఅగ్రరాజ్యం అమెరికాలో అక్టోబర్ నెలను హిందూ సాంస్కృతిక వారసత్వ మాసంగా పాటించనున్నారంటూ గత రెండేళ్లుగా కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జార్జియా రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. హిందువుల మనోభావాలను మరింతగా గౌరవించే పనికి పూనుకుంది.
అవును... అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో హిందూ-అమెరికన్ కమ్యూనిటీ చేస్తున్న సేవలను గుర్తిస్తూ... ఇకపై రాష్ట్రంలో అక్టోబర్ నెలను "హిందూ వారసత్వ మాసం"గా జరుపుకుంటామని ఆ రాష్ట్ర గవర్నర్ బ్రియాన్ కెంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇందులో భాగంగా... యుఎస్ లోని హిందూ న్యాయవాద సమూహం కూడా ఈ చర్యను స్వాగతించింది. విభిన్న రంగాలకు గణనీయమైన సహకారాన్ని అందిస్తున్న హిందూ సమాజాన్ని గుర్తించినందుకు గవర్నర్ కెంప్ కు ధన్యవాదాలు తెలిపింది.
ఇదే క్రమంలో "జార్జియా పీఏసీ లోని హిందువులలో మా స్నేహితుల అలుపెరగని అంకితభావం వల్ల ఇది సాధ్యమైంది. అమెరికా సాంస్కృతిక పరిసరాలకు హిందూమతం గొప్పగా దోహదపడింది" అని హిందూ సమూహం ఎక్స్ (ట్విట్టర్) లో పేర్కొంది.
వాస్తవానికి ఈ సంవత్సరం ప్రారంభంలోనే జార్జియా అసెంబ్లీ హిందూఫోబియాను ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో... అలాంటి చట్టబద్ధమైన చర్య తీసుకున్న మొదటి అమెరికన్ రాష్ట్రంగా జార్జియా నిలిచింది.
హిందూఫోబియా, హిందూ వ్యతిరేక మూర్ఖత్వాన్ని ఖండిస్తూ.. అమెరికన్ సమాజం లోని మిలియన్ల మంది జీవితాలను మెరుగుపరచడంలో యోగా, ఆయుర్వేదం, ధ్యానంలకు హిందూ సమాజం చేసిన కృషిని ఈ తీర్మానంలో పేర్కొంది.
కాగా... ప్రపంచంలో మూడవ అతిపెద్ద మతంగా హిందూమతం ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అక్టోబర్ మాసంలో మహాత్మా గాంధీ జయంతితోపాటు నవరాత్రి, దీపావళి వంటి ప్రధాన హిందూ పండుగలు జరుపుకుంటారన్న విషయం తెలిసిందే!