Begin typing your search above and press return to search.

పాక్ పాలిటిక్స్ లో హిందూ మహిళ ... ఎవరీ సవీరా?

అవును... పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ సందర్భంగా ఒక పేరు తెగ మారుమోగుతుంది. అదే... సవీరా ప్రకాష్‌!

By:  Tupaki Desk   |   26 Dec 2023 5:27 AM GMT
పాక్  పాలిటిక్స్  లో హిందూ మహిళ ... ఎవరీ సవీరా?
X

పాకిస్థాన్ లో హిందువులు ఎంతశాతం ఉంటారనేది తెలిసిన విషయమే! ఆ దేశంలో మైనారిటీలుగా హిందువులు ఉంటారు.. వారి శాతం 2.41 మాత్రమే! అలాంటి పాకిస్థాన్ క్రికెట్ లో మాజీ క్రికెటర్ డేనిష్ కనేరియా.. పాక్ క్రికెట్ టీం లో ఏకైక హిందువుగా అప్పట్లో వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలో తాజాగా పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఒక హిందూ మహిళ నామినేషన్ వేసి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.

అవును... పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ సందర్భంగా ఒక పేరు తెగ మారుమోగుతుంది. అదే... సవీరా ప్రకాష్‌! ఈమె తాజాగా పాకిస్థాన్ ఎన్నికల్లో రంగంలోకి దిగుతున్న తొలి హిందూ మహిళగా చరిత్ర సృష్టించారు. ఖైబర్‌ పఖ్తుంఖ్వా బనర్‌ జిల్లా నుంచి పోటీకి నామినేషన్‌ దాఖలు చేసిన సవీరా ప్రకాష్ పేరు ఇప్పుడు పాక్ రాజకీయాల్లో మారుమ్రోగిపోతుంది!

వాస్తవానికి పాకిస్థాన్ లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని... అభివృద్ధి చెందిన, చెందుతున్న ప్రతీ దేశంలోనూ మహిళలకూ ప్రాధాన్యం ఇస్తారని.. అది కూడా అభ్హివృద్ధికి ఒక కారణం అని చెబుతారు. ఇదే విషయాన్ని పాక్ నటి ఇటీవల కాలంలో మైకుల ముందు మొత్తుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల పాక్ ఎన్నికల సంఘం కీలక సవరణ చేసింది. అందులో భాగంగా... జనరల్ స్థానాల్లో మహిళలకు ఐదు శాతం సీట్లు తప్పనిసరి చేసింది.

దీంతో... ఈ సవరణ సవీరా ప్రకాష్ కి కలిసివచ్చింది! సవీరా తండ్రి ఓం ప్రకాశ్‌.. భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి కావడంతోపాటు.. హిందూ సంఘాల పోరాట సమితి సభ్యుడిగా కూడా ఉన్నారు. వృత్తిరీత్యా వైద్యుడు అయిన ఓం ప్రకాశ్... మానవతా దృక్ఫథంతో పేదలకు ఉచిత వైద్యం అందించే వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. ఇదే సమయంలో 35 ఏళ్లుగా పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీలో సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు.

ఈ క్రమంలో... తన తండ్రి ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ తాను మాత్రం బరిలో నిలవాలని నిర్ణయించుకుంది సవీరా. ఇందులో భాగంగా బర్నర్‌ లోని పీకే-25 స్థానానికి నామినేషన్‌ సమర్పించింది. వైద్య విద్యనభసించిన అనంతరం పీపీపీ మహిళా విభాగానికి ఆమె కార్యదర్శిగా కూడా పని చేశారు. కాగా.. పాక్‌ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన జరగనుంది!