Begin typing your search above and press return to search.

ఢిల్లీలో బీజేపీ 'ముగ్గురు సీఎంలు' తెలుసా..? వారెంత పెద్ద నేతలంటే?

ఎప్పుడో 1998లో కాంగ్రెస్ కు అధికారం కోల్పోయిన కాషాయ పార్టీ.. ఇప్పుడు ఆ తర్వాత పుట్టిన పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ఓడించి అధికారం దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   9 Feb 2025 12:30 AM GMT
ఢిల్లీలో బీజేపీ ముగ్గురు సీఎంలు తెలుసా..? వారెంత పెద్ద నేతలంటే?
X

దేశ రాజధాని ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోవడంతో ఇక సీఎం ఎంపికే మిగిలింది. ఎప్పుడో 1998లో కాంగ్రెస్ కు అధికారం కోల్పోయిన కాషాయ పార్టీ.. ఇప్పుడు ఆ తర్వాత పుట్టిన పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ఓడించి అధికారం దక్కించుకుంది. 1956 నవంబరు 1న అమల్లోకి వచ్చిన రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఢిల్లీ రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా మారింది. మళ్లీ 1991లో అసెంబ్లీ పునరుద్ధరణ జరిగింది. 1993లో జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీనే గెలిచింది.

పునాది వేసిన మదన్ లాల్ ఖురానా..

1993 లో బీజేపీ 49 స్థానాలు నెగ్గి అధికారంలోకి రాగా బీజేపీ సీనియర్ నాయకుడు మదన్ లాల్ ఖురానా ముఖ్యమంత్రి అయ్యారు. ఢిల్లీలో బీజేపీకి పునాది వేసింది ఈయనే. 1996 వరకు సీఎం పదవిలో ఉన్నారు. అయితే, ఆ తర్వాత సాహెబ్ సింగ్ వర్మను సీఎం చేశారు. ఇక ఖురానా.. వాజ్ పేయీ ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. హిందూత్వను బలంగా అమలు చేసే విషయంలో పార్టీ అధినాయకత్వంతో విభేదించి 1999లో రాజీనామా చేశారు. ఇక ఖురానా 2004లో కొంత కాలం రాజస్థాన్ గవర్నర్ గా వ్యవహరించారు. 2005లో అగ్ర నేత ఆడ్వాణీ నాయకత్వాన్ని విమర్శించి వేటుకు గురయ్యారు. కొద్ది కాలానికే పార్టీ ఆయనను తిరిగి చేర్చుకుంది. 2006లోనూ బీజేపీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించారు. 2018లో చనిపోయారు.

సాహెబ్ సాబ్ కు ఉల్లి ఘాటు

ఖురానాను సీఎంగా తప్పించాక 1996 పిబ్రవరి 1998 అక్టోబరు మధ్యన సాహెబ్ సింగ్ వర్మను సీఎంగా చేశారు. 1943లో ఢిల్లీలోని లక్రా జాట్స్‌ కుటుంబంలో జన్మించారు. ఆర్య సమాజం పట్ల బాల్యంలోనే ఆకర్షితుడయ్యారు. లైబ్రరీ సైన్స్ లో పీహెచ్ డీ చేసి.. ఢిల్లీలోని భగత్ సింగ్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1998లో ఉల్లిగడ్డల ధరలు విపరీతంగా పెరగడంతో సాహెబ్ సర్కారుకు ఎసరు తెచ్చింది. దీంతో ఆయనను తప్పించి అప్పటి యువ నాయకురాలు సుష్మా స్మరాజ్ ను సీఎం చేశారు. సాహెబ్ సింగ్ 1999లో ఔటర్ ఢిల్లీ నుంచి ఎంపీగా నెగ్గి వాజ్ పేయీ సర్కారులో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆలిండియా జాట్ నేతగా పనిచేసిన సాహెబ్ సింగ్ వర్మ 2007లో రాజస్థాన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.

బీజేపీ కెరటం సుష్మా స్వరాజ్

సుష్మా స్వరాజ్.. భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. వాజ్ పేయీ, మోదీ ప్రభుత్వాలలో కేంద్ర మంత్రిగా పనితీరుతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఢిల్లీకి మూడో ముఖ్యమంత్రి సుష్మా స్వరాజే. 1998లో కేంద్ర మంతిగా ఉన్న సుష్మా సర్వాజ్ పార్టీ అవసరాల రీత్యా ఢిల్లీ సీఎంగా వచ్చారు. ఢిల్లీ తొలి మహిళా సీఎం ఈమెనే కావడం విశేషం. అయితే, 1998 డిసెంబరులో ఎన్నికలలో ఓటమితో సుష్మా వైదొలగక తప్పలేదు. ఆ తర్వాత రెండో మహిళా సీఎంగా కాంగ్రెస్ కు చెందిన షీలా దీక్షిత్, మూడో మహిళా సీఎంగా ఆప్ నకు చెందిన అతీశీ వ్యవహరించారు. సుష్మా 2019 ఆగస్టులో అనారోగ్యంతో చనిపోయిన సంగతి తెలిసిందే.

కొసమెరుపు: సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ. పశ్చిమ ఢిల్లీ ఎంపీ అయిన ఈయన పేరు ఇప్పుడు ఢిల్లీ సీఎం రేసులో ఉన్నారు. ఇక సుష్మా కుమార్తె భన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీ సీటు నుంచి ఎంపీగా ఉన్నారు.