Begin typing your search above and press return to search.

హర్యానాలో బీజేపీ చరిత్ర తిరగరాసినట్లే

హర్యానా విషయానికి వస్తే 1966 రాష్ట్రం ఏర్పాటు అయితే ఇప్పటిదాకా 11 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు.

By:  Tupaki Desk   |   8 Oct 2024 11:08 AM GMT
హర్యానాలో బీజేపీ చరిత్ర తిరగరాసినట్లే
X

హర్యానా రాష్ట్రంలో రాజకీయ చరిత్రను బీజేపీ తిరగరాస్తోంది. అక్కడ వరసగా రెండు సార్లు గెలిచిన పార్టీగా కాంగ్రెస్ బీజేపీ ఇంతవరకూ ఉన్నాయి. కానీ వరసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టిన పార్టీగా బీజేపీ సరికొత్త రికార్డుని క్రియేట్ చేయబోతోంది.

హర్యానా విషయానికి వస్తే 1966 రాష్ట్రం ఏర్పాటు అయితే ఇప్పటిదాకా 11 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఇందులో కాంగ్రెస్ ముఖ్యమంత్రులదే అగ్ర భాగం. ఆ తరువాత లోక్ దల్ నుంచి దేవీలాల్, ఆయక కుమారుడు ఓం ప్రకాష్ చౌతాలా ముఖ్యమంత్రులు అయ్యారు. ఇక బీజేపీ 2014లో హర్యానాలో అధికారం చేపట్టింది. ఇపుడు మూడోసారి ఎన్నికల్లో బీజేపీ గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటోంది.

హర్యానాలో అనేకసార్లు రాష్ట్రపతి పాలన కూడా పెట్టారు. తొలిసారి 1967లో 183 రోజుల పాటు పెట్టారు. ఆ తరువాత రెండోసారి 1977లో 52 రోజుల పాటు రాష్ట్రపతి పాలన పెట్టారు. మూడవసారి 1991లో 78 రోజుల పాటు పెట్టారు.

ఇక హర్యానాను ఎక్కువ కాలం పాలించిన వారుగా కాంగ్రెస్ కి చెందిన భజన్ లాల్ బిష్ణోయ్ ఉన్నారు. ఆయన 11 సంవత్సరాల 10 నెలలు ఆ పదవిలో ఉన్నారు. ఆయన తరువాత కాంగ్రెస్ కే చెందిన భూపిందర్ సింగ్ హూడా 9 సంవత్సరాల 235 రోజులు పాలించారు. ఇక బీజేపీకి చెందిన మనోహర్ ఖట్టార్ 9 సంవత్సరాల 138 రోజులు పాటు పాలించి మూడవ సీఎం గా రికార్డు సృష్టించారు. ఇపుడు అదే బీజేపీ హర్యానాలో ఎవరికీ అందని విధంగా మూడవసారి అధికారం అందుకుని మరో చరిత్రను లిఖించబోతోంది అని అంటున్నారు.

ఒకనాడు హర్యానా రాజకీయాలు పూర్తి అస్థిరంగా సాగాయి. దేవీలాల్ ఆయన కుమారుడు లోక్ దల్ పార్టీ పేరుతో చేసిన రాజకీయంతో అక్కడ రాజకీయాల మీద దేశం ఒకసారి చూసిన పరిస్థితి ఏర్పడింది. దేవీలాల్ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఉప ప్రధాని గా అయి తన కుమారుడు ఓం ప్రకాష్ చౌతాలాను హర్యానా సీఎం గా 1989 ప్రాంతంలో చేయడంతో కొన్ని రకాల రాజకీయ చిక్కులు వచ్చాయి. అలా నాలుగు సార్లు సీఎం గా పనిచేసిన చరిత్రను చౌతాలా సృష్టించారు.

దేవీలాల్ తరువాత చౌతాలా వారసుడిగా దుష్యంత్ చౌతాలా 2019 టైం లో జన్ నాయక్ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ బీజేపీతో పొత్తు పెట్టుకుని అయిదేళ్ళ పాటు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాజా ఎన్నికల ఫలితాలలో ఆయన పార్టీ ఓటమి పాలు అయింది. ఆయన కూడా వెనకంజలో ఉన్నారు. ఏది ఏమైనా బీజేపీకి హర్యానా ప్రజలు పట్టం కట్టారని అర్ధం అవుతోంది. ఆ విధంగా హర్యానా రాజకీయ చరిత్రలో బీజేపీ తన జయ కేతనం ఎగరేసింది అని చెప్పాలి.