దారుణం... అదనపు కట్నం ఇవ్వలేదని కోడలికి హెచ్ఐవీ అంటించారు!
ఈ నేపథ్యంలో.. అదనపు కట్నం కోసం కోడలికి హెచ్ఐవీ కలుషిత ఇంజెక్షన్ ఇచ్చిన అత్తమామల ఘటన తాజాగా తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 16 Feb 2025 8:30 AM GMTఅదనపు కట్నం కోసం మహిళలపై జరుగుతున్న దాడుల గురించి చెప్పే పనిలేదు! ఇలాంటి ఘటనలు ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టినట్లున్నాయని భావించిన ప్రతిసారీ ఒక్కో ఘోరం వెలుగు చూస్తుంటుందని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో.. అదనపు కట్నం కోసం కోడలికి హెచ్ఐవీ కలుషిత ఇంజెక్షన్ ఇచ్చిన అత్తమామల ఘటన తాజాగా తెరపైకి వచ్చింది.
అవును... ఎన్నిసార్లు అడిగినా అదనపు కట్నం ఇవ్వకపోవడంతో తమ కోడలికి హెచ్ఐవీ వైరస్ తో కలుషితమైన ఇంజెక్షన్ ఇచ్చారు అత్తమామలు. ఈ విషయం తెలుసుకున్న మహిళ తండ్రి స్థానిక కోర్టును ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అత్యంత దరుణమైన ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జరిగింది.
వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ కు చెందిన యువతికి 2023 ఫిబ్రవరి 15న ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ కు చెందిన అభిషేక్ తో వివాహమైంది. ఈ సందర్భంగా వరుడికి రూ.15 లక్షల నగదు కట్నంగా ఇచ్చారు. ఈ క్రమంలో వీరి సంసారం సాఫీగానే సాగినట్లు అనిపించింది. అత్తింటివారు అమ్మాయిని బాగానే చూసుకున్నారు!
ఈ క్రమంలో... కొంతకాలం తర్వాత స్కార్పియో కారు కొనడానికి పుట్టింటి నుంచి మరో పాతిక లక్షల రూపాయలు తీసుకురావాలని కోడలిని వేధించడం మొదలుపెట్టారు అత్తామామలు. దీంతో... తాము అంత మొత్తం ఇచ్చుకోలేమని యువతి తల్లితండ్రులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన అత్తామామ.. కోడలిని ఇంటి నుంచి గెంటేశారు.
అనంతరం ఊరి పెద్దల సమక్షంలో వారికి నచ్చజెప్పి యువతిని తిరిగి కాపురనికి పంపించారు. ఆ పంచాయతీలో బాగానే తలాడించిన అత్తమామలు.. మళ్లీ మొదటకు వచ్చారు. అదనపు కట్నం కోసం ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించారు. ఈ సమయంలో.. తమ కుమారుడికి మరో వివాహం చేయాలనే ఉద్దేశ్యంతో ఆమెను హత్య చేసేందుకు కుట్ర పన్నారు.
ఇందులో భాగంగానే... కోడలికి హెచ్ఐవీ తో కలుషితమైన ఇంజెక్షన్ చేశారు. దీంతో... ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలయ్యింది. ఈ నేపథ్యంలో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయగా.. హెచ్ఐవీ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదే సమయంలో.. భర్త అభిషేక్ కు హెచ్ఐవీ నెగిటివ్ గా తేలిందని ఆమె తండ్రి వెల్లడించారు.
దీంతో.. ఆమె అత్తమామలపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే.. వారు నిందితులపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో బాధితురలు స్థానిక కోర్టును అశ్రయించిందని.. కోర్టు ఆదేశల మేరకు పోలీసులు వారిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.