Begin typing your search above and press return to search.

బిల్డర్లకు హెచ్ఎండీఏ షాక్.. ఆ భూములన్నీ నిషేధిత జాబితాలోకి..

నిషేధిత జాబితాలో ఉన్న వాటిని క్రయ, విక్రయాలు జరపరాదని పేర్కొంటూ హెచ్ఎండీఏ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

By:  Tupaki Desk   |   22 Oct 2024 9:33 AM GMT
బిల్డర్లకు హెచ్ఎండీఏ షాక్.. ఆ భూములన్నీ నిషేధిత జాబితాలోకి..
X

హెచ్ఎండీఏ పరిధిలో పంచాయతీల్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. పంచాయతీ లేఅవుట్లను నిషేధిత జాబితాలో చేర్చడం ఈ ఆందోళనకు కారణమైంది. నిషేధిత జాబితాలో ఉన్న వాటిని క్రయ, విక్రయాలు జరపరాదని పేర్కొంటూ హెచ్ఎండీఏ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. దీంతో ఆయా గ్రామపంచాయతీల్లో లేఅవుట్లు వేసిన వారంతా ఆందోళనలో పడ్డారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలకు చెందిన లేఅవుట్లకు సంబంధించిన లిస్టులతోపాటు సర్వే నంబర్లు, లేఅవుట్ల యజమానుల పేర్లను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అయితే.. నిషేధిత జాబితాలో వేసే క్రమంలో సదరు యజమానులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇలాంటి సమయంలో తాము ప్లాట్లను ఎలా అమ్ముకునేది అని తలలు పట్టుకుంటున్నారు.

హెచ్ఎండీఏ పరిధిలోని మూడు ఉమ్మడి జిల్లాల్లోని నిషేధిత భూముల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టారు. రానున్న రోజుల్లో మరికొన్ని జిల్లాలకు సంబంధించిన పంచాయతీ లేఅవుట్లను కూడా జాబితాలో చేర్చనున్నట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం. అయితే.. ఇప్పటికే హైడ్రా వల్ల హైదరాబాద్ నగరం పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. ఎక్కడికక్కడ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా హెచ్ఎండీఏ వెబ్‌సైట్‌లో నిషేధిత జాబితాను పెట్టడంపై రియల్ వ్యాపారం మరింత గందరగోళంలో పడింది.

2020లో అప్పటి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్‌ను తీసుకొచ్చింది. ఆ సమయంలో దాని విధివిధానాలను ప్రకటించింది. గ్రామపంచాయతీ లేఅవుట్ అయినప్పటికీ అప్పటికే రిజిస్ట్రేషన్ అయి ఉంటే యథావిధిగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది. కానీ.. ఎల్ఆర్ఎస్ మాత్రం కట్టుకోవాలని, ఒకవేళ ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లు ఉంటే మాత్రం రిజిస్ట్రేషన్ చేయరాదని ఆదేశించింది. అయితే.. ఎల్ఆర్ఎస్ కట్టుకొని కొందరు యజమానులు విక్రయాలు జరిపిన వాటికి కూడా ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేయవద్దని హెచ్ఎండీఏ ఆదేశించింది. వాటిని కూడా నిషేధిత జాబితాలో చేర్చింది. ఒకసారి రిజిస్ట్రేషన్ అయ్యాక కూడా వాటినీ నిషేధిత జాబితాలో పెడితే ఎలా అని ప్లాట్ల యజమానులు వాపోతున్నారు. ఇన్ని రోజులుగా లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలోని గుర్రంగూడ, నాదర్‌గుల్, బాలాపూర్, రాగన్నగూడ, తుక్కయాంజిల్, కమ్మగూడ, మన్నెగూడ, అబ్బుల్లాపూర్‌మెట్, పెద్ద అంబర్పేట్, ఆదిభట్ల, మంగల్‌పల్లి తదితర ఏరియాల్లో వందలాదిగా పంచాయతీ లేఅవుట్లు వెలిశాయి. హెచ్ఎండీఏ వచ్చాక ఈ లేఅవుట్లలో కొన్నింటిని క్రమబద్ధీకరించారు. కానీ.. ఇందులో కొన్ని పెద్దపెద్ద భవంతులు వెలిశాయి. ఇవన్నీ ప్రస్తుతం నగరానికి సమీపానికి చేరాయి. ఇక్కడ భూముల ధరలు సైతం విపరీతంగా పెరిగిపోయాయి. అయితే.. వీరంతా గతంలోనే ఎల్ఆర్ఎస్ చెల్లించి క్రమబద్ధీకరణ కోసం తిరుగుతున్నారు. ఈ క్రమంలో నిషేధిత జాబితాలో ఆ భూములు, సర్వేనంబర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం ఆశ్చర్యానికి ఆందోళనకు గురిచేసింది.

ఏపీ రిజిస్ట్రేషన్ చట్టం 2007 నవంబర్ 19, సెక్షన్ 22ఎ(1)(ఈ) కింద ఈ పంచాయతీల లేఅవుట్లన్నంటినీ నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో ఇప్పుడు దరఖాస్తుదారులంతా హెచ్ఎండీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. నిషేధిత జాబితాలో చేర్చడంపై ఆరా తీస్తున్నారు. గతంలో వీరు చెల్లించిన ఎల్ఆర్ఎస్‌ను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. నిషేధిత జాబితాలో ఉంటే తాము భూములు అమ్మకాలు, కొనుగోలు చేయలేకపోతామని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.