అగ్రరాజ్యంలో నిరాశ్రయులు... రికార్డ్ స్థాయిలో అంటున్న నివేధికలు!
అయితే అది నిజం కాదు! ప్రస్తుతం అమెరికాలో నిరాశ్రయులైన వారి సంఖ్య రికార్డ్ స్థాయిలో ఉందని తెలుస్తుంది.
By: Tupaki Desk | 16 Dec 2023 1:30 PMప్రపంచాన్ని శాసించే దేశం, అగ్రరాజ్యం, ఎన్నో దేశాల విద్యార్థులకు, ఉద్యోగస్తులకు ఆశల దేశం అని ఎంతో పేరున్న అమెరికాలో నిరాశ్రయులు ఉంటారా? ఈ ప్రశ్నకు చాలా మంది.. అలా ఎందుకు ఉంటారు, అది అగ్రరాజ్యం అని సమాధానం చేప్పే అవకాశం ఉంది. అయితే అది నిజం కాదు! ప్రస్తుతం అమెరికాలో నిరాశ్రయులైన వారి సంఖ్య రికార్డ్ స్థాయిలో ఉందని తెలుస్తుంది.
అవును... అగ్రరాజ్యం అమెరికాలో కూడా నిరాశ్రయులు భారీ సంఖ్యలో ఉన్నారంట. ఇందులో భాగంగా అమెరికాలో నిరాశ్రయులైన వారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిందని, అది ఏకంగా 12శాతానికి చేరుకుందని కొత్త ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. దీంతో ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది. అగ్రరాజ్యంలో నిరాశ్రయులు అనేది హాట్ టాపిక్ గా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... జనవరిలో అమెరికాలో దేశవ్యాప్తంగా సుమారు 6,53,000 మంది నిరాశ్రయులయ్యారని జిన్హువా అనే వార్తా సంస్థ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన నివేదికను ప్రస్థావించింది. ఇదే సమయంలో ఒక సంవత్సరం క్రితం కంటే ఇది సుమారు 70,650 ఎక్కువని పేర్కొంది. 2007లో ఈ సర్వే ప్రారంభమైనప్పటి నుండి లేటేస్ట్ సమాచారం అత్యధిక సంఖ్యను సూచిస్తుందని తెలిపింది.
వాస్తవానికి అమెరికా జనాభాలో ఆఫ్రికన్ - అమెరికన్లు సుమారు 13 శాతం మంది ఉన్నారు. అయితే ఈ నిరాశ్రయుల జాబితాలో వారు మొత్తం 37 శాతం వరకూ ఉన్నారని నివేదిక పేర్కొంది. ఇదే క్రమంలో... 2022 నుండి 2023 వరకు 28 శాతంగా ఉన్న హిస్పానిక్స్ లో నిరాశ్రయులలో అతిపెద్ద పెరుగుదల ఉందని చెబుతుంది.
అయితే అగ్రరాజ్యంలో ఈ స్థాయిలో నిరాశ్రయుల సంఖ్య పెరగడానికి ప్రధానంగా అద్దెలు పెరగడమే అని అంటున్నారు పరిశీలకులు. ఇలా పెరుగుతున్న అద్దెలతో పాటు కరోనావైరస్ మహమ్మారి సమయంలో ఏర్పడిన క్షీణత.. నిరాశ్రయుల సంక్షోభం వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటి అని చెబుతున్నారు.