మహా హోండా.. తస్సాదియ్యా నిస్సాన్.. సై సై మిత్సుబిషి..మూడూ ఒక్కటై
ఇప్పుడు నిస్సాన్, హోండా, మిత్సుబిషిలు జాయింట్ హోల్డింగ్ కంపెనీ ఏర్పాటుకు విధివిధానాల రూపకల్పనకు చర్చలు ప్రారంభించనున్నాయి.
By: Tupaki Desk | 24 Dec 2024 8:30 PM GMTమనకు తెలిసిన కార్ల కంపెనీలు ఏమిటి..? హోండా, మిత్సుబిషి.. నిస్సాన్.. కానీ, ఇప్పుడు ఈ మూడింటినీ కలిపి చదువుకోవాలి.. ఎందుకంటే.. ఈ జపాన్ ఆటో దిగ్గజాలు ఒక్కటయ్యాయి.. మార్కెట్ ను ఏలాలని నిర్ణయించుకున్నాయి. విపరీతమైన పోటీని తట్టుకుని మార్కెట్లో స్థానాన్ని పటిష్ఠం చేసుకోవాలంటే విలీనమే మార్గమని భావించాయి హోండా-నిస్సాన్. తానూ కలిసొస్తానని మిత్సుబిషి ప్రకటించింది.
మహా విలీనం..
ఈ మూడు జపాన్ ఆటో దిగ్గజాలు కలయిక కార్ల మార్కెట్లో పెను సంచలనమే. కాగా, నిస్సాన్ తో ఇప్పటికే మిత్సుబిషికి భాగస్వామ్యం ఉంది. దీంతో హోండా, నిస్సాన్ తో కలిసి వెళ్తున్నట్లు ప్రకటించింది.
ఇకపై ఏం జరగనుంది..?
గతంలో హీరోహోండా విడిపోయాక.. హీరో, హోండాగా మార్కెట్లో మిగిలిపోయాయి. ఇప్పుడు నిస్సాన్, హోండా, మిత్సుబిషిలు జాయింట్ హోల్డింగ్ కంపెనీ ఏర్పాటుకు విధివిధానాల రూపకల్పనకు చర్చలు ప్రారంభించనున్నాయి.
ప్రపంచంలోనే మూడో పెద్ద డీల్
హోండా, నిస్సాన్, మిత్సుబిషి విలీనం పూర్తయితే విలీన కంపెనీ అమ్మకాల్లో ఇది ప్రపంచంలోనే మూడోది కానుంది. ఇక ఈ మూడింటి మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటే అది 5,500 కోట్ల డాలర్ల (రూ.4.68 లక్షల కోట్లు) కంపెనీ అవుతుంది.
హోండా, నిస్సాన్ మధ్య ఏడాది మార్చి నుంచి పరిమిత భాగస్వామ్యం ఉంది. కొత్తతరం వాహన ఇంటెలిజెన్స్, విద్యుదీకరణలో సహకరించుకునేందుకు అవగాహన కుదుర్చుకున్నాయి. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేలా అంగీకరించాయి. ఇప్పుడు తమ వ్యాపారాలను కూడా సమీకృతం చేసి ప్రపంచంలోనే ఆటో రంగంలో మూడో దిగ్గజంగా మారనున్నాయి.
నాలుగో సంస్థ కూడా ఉంది..
నిస్సాన్ కు ఫ్రాన్స్ సంస్థ రెనోతో భాగస్వామ్యం ఉంది. అంటే.. హోండా, నిస్సాన్, రెనో, మిత్సుబిషీ ఒకటైతున్నట్లే. తద్వారా జపాన్, జర్మనీ ఆటో దిగ్గజాలు టయోటా, ఫోక్స్ వేగన్ లకు గట్టి పోటీ ఎదురవనుంది.
టయోటానే టాప్..
పై మూడు సంస్థలు (రెనో కాకుండా) విలీనం అయినా.. టయోటానే మార్కెట్ నంబర్ వన్. ఎందుకంటే ఈ సంస్థ గత ఏడాది 1.15 కోట్ల కార్లను తయారుచేసింది. ఇప్పుడు చేతులు కలుపుతున్న మూడు కంపెనీలు కలిప 80 లక్షల కార్లు (హోండా 40 లక్షలు, నిస్సాన్ 34 లక్షలు, మిత్సుబిషి 10 లక్షలు) మాత్రమే ఉత్పత్తి చేశాయి.
విలీనం ఎవరికి లాభం?
ప్రస్తుతం పెట్రో కార్ల స్థానంలో పర్యావరణ అనుకూల విద్యుత్ వాహనాలకే అగ్ర తాంబూలం. సంస్థలు కూడా ఈవీల తయారీకే ప్రాధాన్యం ఇచ్చేలా వ్యూహాలు రచిస్తున్నాయి. కానీ, నిస్సాన్, మిత్సుబిషి, హోండాలు ఈ విభాగంలో ప్రత్యర్థుల కన్నా చాలా వెనుక ఉన్నాయి. చైనా బీవైడీ, జీపెంగ్, నియో, లీ ఆటోలు తక్కువ ధరలో హైబ్రిడ్, విద్యుత్ కార్లు అందించడం జపాన్ ఆటో దిగ్గజాల మార్కెట్ కు పెను సవాలుగా మారింది.
భారత్ లోకి ఈవీలతో..
ఈవీల ఉత్పత్తిలో హోండా, నిస్సాన్ మరీ వెనుకబడి ఉన్నాయి. అయితే, భారత మార్కెట్లో త్వరలో ఈవీలు తేవాలని ఆలోచిస్తున్నాయి. ఇక హోండా ఎలివేట్ ఎలక్ర్టిక్ ఎస్‌యూవీని, నిస్సాన్ అరియా ఎలక్ర్టిక్ ఎస్‌యూవీని వచ్చే ఏడాది తేనున్నాయి. కాగా, ఈ రెండు ఈవీలు మరి కొత్త భాగస్వామ్యంలో ఉంటాయా లేదా అన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు.
నిస్సాన్ నుంచి హోండాకు భారీ ఎస్‌యూవీలకు అవసరమైన బాడీ ఫ్రేమ్ అందుబాటులోకి వస్తుంది. బ్యాటరీ-విద్యుత్, గ్యాస్-విద్యుత్ హైబ్రిడ్ వాహనాల తయారీలో నిస్సాన్‌కు అనుభవం ఉంది. కొత్త తరం ఈవీలు, హైబ్రిడ్ వాహనాల తయారీలో ఇది మేలు చేయనుంది.
విలీన ప్రక్రియ ఎలా?
రెండు కంపెనీలకు మాతృ సంస్థగా వ్యవహరించేందుకు జాయింట్ హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు చేస్తారు. వాటాదారులు, రెగ్యులేటరీ అధికారుల అనుమతులు లభించిన అనంతరం హోల్డింగ్ కంపెనీకి షేర్లను బదిలీ చేస్తాయి. అనంతరం నిస్సాన్ పునరుజ్జీవ ప్రక్రియను నిలకడగా అమలు పరుస్తారు. నిస్సాన్, హోండా రెండూ జాయింట్ హోల్డింగ్ కంపెనీకి అనుబంధ కంపెనీలుగా ఉంటాయి. 2026 ఆగస్టు నాటికి నిస్సాన్, హోండా కంపెనీల డీలిస్టింగ్ పూర్తి చేసి జాయింట్ హోల్డింగ్ కంపెనీ షేర్లను టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టింగ్ చేయాలని నిర్ణయించారు.
భారత్ లో అవకాశాలు అపారం
వర్థమాన దేశాలైన భారత్, బ్రెజిల్ మార్కెట్లు ప్రపంచ ఆటోమొబైల్ కంపెనీలకు అపారమైన అవకాశాలు అందిస్తున్నాయి. సుజుకీ భాగస్వామ్యంలోని మారుతి సుజుకీ ఇప్పటికే మన దేశంలో మార్కెట్ లీడర్. అందుబాటు ధరల్లో చక్కని ఇంధన సామర్థ్యం గల కార్లకు జపాన్ పెట్టింది పేరు. టయోటా, హోండా, నిస్సాన్ కూడా భారత మార్కెట్లో మంచి వాటా కలిగి ఉన్నాయి.
హోండా సిటీ సెడాన్ తో 1998లో, నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బాక్‌తో 2010లో భారత మార్కెట్లో ప్రవేశించాయి. భారత మార్కెట్లో ప్రవేశించి ఇంతకాలం అయినా రెండు కంపెనీలు తక్కువ పరిమిత ఉత్పత్తులతోనే నెట్టుకొస్తున్నాయి.
హోండా మార్కెట్ వాటా 1.39 శాతం ఉండగా నిస్సాన్ 0.73 శాతం ఉంది. విలీనంతో వారు మరిన్ని కొత్త కార్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. విలీనం భారత ఆటో కంపెనీలకు సవాలు విసిరనుంది. కాబట్టి సరికొత్త టెక్నాలజీలతో అడుగేయాల్సి ఉంటుంది.