నూహ్ లో ఆగని బుల్డోజర్..నిన్నమెడికల్ షాపులు.. నేడు హోటల్
సరిగ్గా వారం అవుతోంది. హరియాణాలోని నూహ్ లో అల్లర్లు చెలరేగి. ఓ వర్గం వారి ర్యాలీపై మరో వర్గం వారు రాళ్లు రువ్వి కాల్పులకూ తెగించడంతో ఏడు రోజులుగా ఆ రాష్ట్రంలో ఉద్రికత్త నెలకొంది.
By: Tupaki Desk | 6 Aug 2023 8:39 AM GMTసరిగ్గా వారం అవుతోంది. హరియాణాలోని నూహ్ లో అల్లర్లు చెలరేగి. ఓ వర్గం వారి ర్యాలీపై మరో వర్గం వారు రాళ్లు రువ్వి కాల్పులకూ తెగించడంతో ఏడు రోజులుగా ఆ రాష్ట్రంలో ఉద్రికత్త నెలకొంది. మొత్తం ఆరుగురు చనిపోవడం, పలువురు గాయపడడంతో విషయం తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికీ ఆ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు లేవు. వాస్తవానికి నూహ్ మత సామరస్యానికి ప్రతీకగా ఉంటుంది. అన్ని వర్గాల వారు ఏళ్ల నుంచి సామరస్యంగా ఉంటున్నారు. కానీ, ఓ చిన్న విషయం అనవసర స్పర్థలకు దారితీసింది. ఢిల్లీ శివారు గురుగ్రామ్ వరకూ అల్లర్లు పాకాయి.
బుల్డోజర్ కు పనిచెప్పిన సర్కారు
నూహ్ విధ్వంసం ప్రణాళిక ప్రకారం జరిగిందని చెబుతున్న హరియాణ సర్కారు.. బుల్డోజర్లను బయటకు తీసింది. ఓ వర్గం వారి దుకాణాలనే లక్ష్యం చేసుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో శనివారం ఏకంగా 24 మెడికల్, ఇతర షాపులను ధ్వంసం చేసింది. ఇందులో సంవత్సరాల తరబడి ఉన్నవీ ఉండడం గమనార్హం. అంతేగాక ఇవన్నీ ప్రభుత్వం ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద ఉన్నవి. అక్రమ నిర్మాణాలంటూ.. నూహ్ అల్లర్ల తర్వాత గుర్తొచ్చిన సర్కారు కూల్చివేతలు మొదలుపెట్టింది.
రాళ్ల దాడుల కేంద్రమంటూ హోటల్ ను..
‘‘నూహ్ ఘర్షణలకు ముందు ఆందోళనకారులు భవనాలపైకి చేరి ఓ వర్గం వారు చేస్తున్న ర్యాలీపై రాళ్లు రువ్వారు. వారు గుడిలో దాక్కుండగా బయటకు రాకుండా వాహనాలకు నిప్పు పెట్టారు. గుడి పక్కనున్న కొండపైకి చేరి కాల్పులకు తెగించారు’’ అని ప్రభుత్వం చెబుతోంది. దీనికితగ్గట్లే చర్యలు చేపట్టింది. దుండగులు రాళ్ల దాడికి వాడుకున్నారంటూ రజా సహారా హోటల్ ను జిల్లా అధికారులు ఆదివారం బుల్డోజర్లతో కూల్చివేశారు. హోటల్ ఓనర్ జంషెద్ మాత్రం తనకు అల్లర్లతో సంబంధం లేదంటున్నాడు. దుండగులు స్థావరంగా వాడుకున్న హోటల్ మరోచోట ఉందని అంటున్నాడు.
పరారీలో వందల మంది?
శనివారం అంతా నూహ్ అధికార యంత్రాంగం బుల్చోజర్లతో కూల్చివేత పనిలోనే ఉంది. కాగా, అరెస్టులకు భయపడి ఈ భవనాల ఓనర్లు పరారీలో ఉన్నారు. ఇక ఈ జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఈ నెల 8 వరకు నిలిపివేశారు. వాయిస్ కాల్స్ చేసుకునే వెసులుబాటు మాత్రమే ఉంది. ఇక విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నారంటూ 200 సోషల్ మీడియా పోస్టులను అధికారులు తొలగించారు. నాలుగు ఖాతాలను బంద్ చేయించి 16 ఖాతాలను సస్పెండ్ చేశారు.