Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ప్రజలకు సీఎం రేవంత్ తీపికబురు

కాలం మారింది. అలవాట్లు మారాయి. జీవనశైలిలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి.

By:  Tupaki Desk   |   3 Aug 2024 6:30 AM GMT
హైదరాబాద్ ప్రజలకు సీఎం రేవంత్ తీపికబురు
X

కాలం మారింది. అలవాట్లు మారాయి. జీవనశైలిలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. వీటికి తగ్గట్లు ప్రభుత్వ విధానాల్లోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వానికి.. ప్రభుత్వ విధానాలకు.. ప్రజలకు మధ్య దూరం పెరుగుతోంది. ఇలాంటి వేళ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ మహానగర వాసులకు తీపి కబురు చెప్పారు.

ఇకపై.. అర్థరాత్రి ఒంటి గంట వరకు హోటళ్లు.. రెస్టారెంట్లు.. వీధుల్లో నిర్వహించే తినుబండారాల షాపులను తెరుచుకోవచ్చని.. వ్యాపారం చేయొచ్చని పేర్కొన్నారు. మద్యం షాపుల్ని మాత్రం ఎప్పటిలానే రాత్రి 11 గంటలకు మూసి వేస్తారని చెప్పారు. మద్యం తాగటానికి వ్యక్తిగతంగా తాను వ్యతిరేకినని.. అర్థరాత్రి వరకు తెరిచి ఉంచితే.. అప్పటివరకు తాగుతూనే ఉంటారని.. అందుకే మద్యం దుకాణాల్ని ఇప్పటికే అమలు చేస్తున్న పదకొండు గంటల టైంను ఫాలో అవుతామని చెప్పారు.

మారిన హైదరాబాద్ మహానగర స్వరూపానికి తగ్గట్లు కాకుండా పోలీసులు శాంతిభద్రతల పేరుతో రాత్రి 11 గంటలకే ఫుడ్ కోర్టులు.. హోటళ్లను మూసి వేయటం కారణం.. రాత్రిళ్లు మహానగర వాసులు ఆహారం దొరక్క తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి. ఐటీ హబ్ గా మారిన హైదరాబాద్ లో రాత్రి షిఫ్టుల్లో పని చేసే వారు తినేందుకు తిండి దొరక్క విలవిలలాడుతున్న పరిస్థితి. నిజానికి.. ఇటీవల కాలంలో మూడు పోలీసు కమిషనరేట్లలో పోలీసు కమిషనర్లు అమలు చేస్తున్న విధానాల కారణంగా రాత్రిళ్లు టీ కూడా దొరకని పరిస్థితి.

గడిచిన పదేళ్లుగా మహానగరం నిద్ర పోని పరిస్థితి ఉంది. రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా వివిధ కంపెనీలు పని చేస్తున్నాయి. మరి.. ముఖ్యంగా ఐటీ కంపెనీలు రౌండ్ ద క్లాక్ పని చేస్తాయి. ఇలాంటప్పుడు.. రాత్రిళ్లు పని చేసే వారికి ఫుడ్ సౌకర్యం లేకపోవటానికి మించిన దుర్మార్గం ఇంకేం ఉంటుంది. ఇలాంటి సమస్యలకు చెక్ చెప్పేలా శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో.. అర్థరాత్రి ఒంటి గంట వరకు హోటళ్లు.. రెస్టారెంట్లు మాత్రమే కాదు.. వీధుల్లో పెట్టే ఫుడ్ ట్రక్ లకు సైతం అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించిన ఈ నిర్ణయం.. మహానగర వాసులకు పెద్ద తీపికబురుగా చెప్పకతప్పదు. అదే సమయంలో వ్యాపారులకు సైతం ఈ నిర్ణయం భారీ ఊరట కలిగిస్తుందని చెప్పక తప్పదు.