ఇంట్లో ఉన్నా వడదెబ్బ.. అదెలా? దాన్ని తప్పించుకోవటమెలా?
ఇంట్లో ఉన్నప్పటికీ వడదెబ్బకు అవకాశం ఉందని.. అందుకే ఈ హాట్ సమ్మర్ లో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరమని స్పష్టం చేస్తున్నారు.
By: Tupaki Desk | 3 April 2024 4:34 AM GMTఅంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రెండు తెలుగు రాష్ట్రాలు వేసవి వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. గత ఏడాది కంటే ఈ వేసవి కాలం మరింత హాట్ గా ఉంటుందన్న అంచనా అక్షరసత్యం కావటమే కాదు.. దాని ప్రభావం ఫిబ్రవరి మొదటి వారం నుంచే మొదలైంది. మార్చిలో ఎండల తీవ్రత పెరగ్గా.. ఏప్రిల్ ఎంట్రీలోనే ఠారెత్తిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ మహానగరం ఇందుకు మినహాయింపు కాదు. గ్రేటర్ లో ఉదయం 8 గంటలకు మొదలయ్యే ఎండ తీవ్రత.. రాత్రి 9 గంటలు అయ్యాక కూడా చల్లబడని పరిస్థితి నెలకొంది.
దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధిక వేడి కారణంగా అనారోగ్యం పాలవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ.. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందంటున్నారు. పెద్ద వయస్కులు.. చిన్న పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవి కాలంలో ఇంట్లో ఉంటే వడదెబ్బ ముప్పు నుంచి తప్పించుకోవచ్చన్న భావనతో చాలామంది ఉంటారు. అయితే.. అందులో నిజం లేదంటున్నారు వైద్యులు.
ఇంట్లో ఉన్నప్పటికీ వడదెబ్బకు అవకాశం ఉందని.. అందుకే ఈ హాట్ సమ్మర్ లో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరమని స్పష్టం చేస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వడదెబ్బ నుంచి తప్పించుకోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు.. ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొంత కేర్ తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యాన్ లేదంటే ఏసీ.. కూలర్లకు సమీపంలో ఉండాలి. ఇంట్లోకి వేడి గాలులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వడగాల్పులు ఇంట్లోకి చేరకుండా కర్టెన్లను వాడటం తప్పనిసరి.
ఇంట్లో ఉన్నామన్న కారణంగా నీళ్లు తాగే విషయంలో అశ్రద్ధ మంచిది కాదు. ఇంట్లో ఉన్నా తరచూ నీటిని తాగటం.. ఉప్పు కలిపిన నిమ్మరం.. మజ్జిగ.. కొబ్బరినీళ్లు తీసుకోవటం చాలా అవసరం. వీటిని తరచూ తీసుకోవటం ద్వారా ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా లభిస్తాయి. వడదెబ్బ బారిన పడకుండా తప్పించుకునే వీలుంది. రోజుకు నాలుగు లీటర్లు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎండలో పని చేసే వారు మరో లీటర్ ను అదనంగా తీసుకోవటం అవసరం.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల్లోపు వరకు ఎండలో తిరగటం తగ్గిస్తే మంచిది. పెద్ద వయస్కుల వారు ఆ సమయంలో బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర పని మీద వెళ్లినా గొడుగు తీసుకెళ్లటం మరవొద్దు. వదులుగా ఉండే కాటన్ దుస్తుల్ని ధరించటం చాలా ముఖ్యం. వేసవిలో ఎక్కడబడితే అక్కడ నీళ్లు తాగకుండా.. మంచినీళ్ల బాటిల్ ను వెంట తీసుకెళ్లటం చాలా మంచిది. నూనెలు ఉన్న ఆహారాన్ని తక్కువగా తీసుకుంటూ.. తాజాగా వండిన ఆహారాన్ని తినటం ముఖ్యం.
మద్యం సేవించే అలవాటు ఉన్న వారు.. వేసవి వరకు తగ్గిస్తే మంచిది. మద్యం డీహైడ్రేషన్ కు గురి చేస్తుంది. వేడి చేసి చల్లార్చిన నీటిలో ఓఆర్ఎస్ ను కలుపుకొని తాగటం మంచిది. షుగర్.. బీపీ ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో విరేచనాలు. వాంతులు.. జ్వరం లాంటివి ఎదురైతే వైద్యుల్ని సంప్రదించి.. సలహాలు తీసుకోవటం చాలా అవసరం. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వద్దు.