నిజం నిప్పులాంటిది...వైసీపీలో ఇదే హాట్ టాపిక్...!
వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో నాయకులు కూడా మానసికంగా సిద్ధపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
By: Tupaki Desk | 12 Jan 2024 5:30 PM GMTసగానికి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లను మారుస్తూ.. వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో నాయకులు కూడా మానసికంగా సిద్ధపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే.. విడతల వారీగా ఇస్తున్న ఈ షాకులు సహజంగానే నాయకులకు ఇబ్బందిగా మారాయి. ఇదే సమయంలో మార్పులకు సంబంధించి అధిష్టానం మాటలోనూ కొంత వాస్తవం ఉండే సరికి.. నాయకులకు తెలిసి వస్తోంది.వాస్తవానికి.. తమదే ప్రాబల్యమని.. తమకు తిరుగులేదని అనుకున్న నాయకులు.. జనం నాడిని పట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారనే వాదన ఉంది.
అందుకే.. చాలా నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు తెరమీదికి వచ్చాయి. సమన్వయం లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కొన్నినియోజకవర్గాల్లో నాయకులకు ఎదురు తిరిగే పరిస్థితిని వారే కల్పించుకున్నారు. ఎక్కడికక్కడ.. నాయకులు గుత్తాధిపత్య ధోరణికి దిగారు. ఇలాంటి వారి విషయంలోనే ఇప్పుడు.. పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు కొన్ని మాత్రమే తెరమీదికి వచ్చినా.. దాదాపు వచ్చే ఎన్నికల నాటికి 60కి పైగా నియోజకవర్గాల్లో మార్పులు తథ్యమనేది ఖాయంగా కనిపిస్తోంది.
ఇక, ఈ మార్పుల వెనుక కేవలం ప్రజాభిప్రాయం.. జనాల నాడిని బేస్ చేసుకుని.. మార్పుల కు శ్రీకారం చుట్టారనేది పార్టీలో చర్చ సాగుతోంది. నాయకులు కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముందు తొందరపడిన నాయకులు కూడా.. ఇప్పుడు చల్లబడుతున్నారు. అంతేకాదు.. అధిష్టానం తప్పులేదని.. మార్పు తప్పదని.. ప్రజల మధ్య గెలిస్తేనే.. మళ్లీ అధికారం దక్కుతుందని అంటున్నారు.
ముఖ్యంగా కొలుసు పార్థసారథి వంటివారు.. బెట్టు చేస్తున్న తీరును చూసి కొందరు నివ్వెర పోతున్నారు. లేనిపోని పంతాలకు పోతే నష్టాలు తప్పవని.. నాయకులు తమలో తాము చర్చించుకుంటున్నారు. "వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది పక్కన పెడితే.. మా తప్పులు మాకు ఉన్నాయి" అని అంటున్నా రు. మరీ ముఖ్యంగా కొందరు నాయకులు సర్దుబాటు ధోరణిని ఎంచుకుంటుండడం గమనార్హం.