'నోట్' పెట్టి మరీ దొంగలకు షాకిచ్చాడు
ఇలాంటి వేళలో.. కాలనీలకు కాలనీలు ఖాళీ అయ్యే వేళ.. దొంగలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం తెలిసిందే.
By: Tupaki Desk | 14 Jan 2025 8:50 AM GMTసొంతూళ్లకు వెళ్లే పెద్ద పండుగ సంక్రాంతి సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహానగరాలు మొదలు కొని పట్టణాల వరకు ఊరి నుంచి దూరంగా వచ్చేసేటోళ్లు.. ఏడాది మొత్తం వెళ్లకున్నా.. సంక్రాంతి పండక్కి ఊరెళ్లటం తెలిసిందే. ఈ కారణంగా హైదరాబాద్ మహానగరాలు సైతం ఖాళీ అవుతుంటాయి. రోడ్ల మీద బ్రేకులు వేయకుండా వాహనాలు నడిపేంత విశాలంగా మారుతుంటాయి. ఇలాంటి వేళలో.. కాలనీలకు కాలనీలు ఖాళీ అయ్యే వేళ.. దొంగలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం తెలిసిందే.
అందుకే.. సంక్రాంతికి ఊరెళ్లే వారికి పోలీసులు సైతం సూచనలు చేస్తూ.. ఊరెళ్లే ముందు తమకు సమాచారం ఇవ్వాలని చెబుతుంటారు. అలా చేస్తే.. తాము ఒక కన్నేసి ఉంచుతామని చెబుతుంటారు. అయితే.. ఇంత పెద్ద ప్రాసెస్ ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ.. ఒక ఇంటి యజమానికి తన ఇంటి తలుపులకు అంటించిన స్పెషల్ నోట్ ఇప్పుడు వైరల్ గా మారింది. సదరు ఫోటోను సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేయటంతో అది కాస్తా విపరీతంగా ఫార్వర్డ్ అవుతోంది.
దొంగలను ఉద్దేశించి సదరు ఇంటి యజమాని.. ‘మేము సంక్రాంతికి ఊరికి వెళ్లిపోతున్నాము. ‘‘డబ్బు.. నగలు’’ తీసుకొని పోతున్నాము. మా ఇంటికి రాకండి - ఇట్లు మీ శ్రేయోభిలాషి’ అంటూ ఒక పేపర్ మీద పెద్ద అక్షరాలతో రాసేసి.. దాన్ని తగిలించి వెళ్లిపోయాడు. దీన్ని ఫోటో తీసిన ఒకరు సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో.. ఇది కాస్తా ఆసక్తికరంగా మారింది. దొంగలకు పని తగ్గించేందుకు అన్నట్లుగా సూచన చేసిన సదరు యజమాని ఆలోచన ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
సాధారణంగా ఊరికి వెళ్లిన ఇంటి యజమానులకు దొంగలు షాకిస్తుంటారు.తాజా ఉదంతంలో మాత్రం దొంగలకే ముందస్తుగా షాకిచ్చిన వైనం అందరూ ఆసక్తికరంగా మాట్లాడుకునేలా చేసింది. ఈయన ఎవరో కానీ దొంగలకే లేఖ రాశారంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఈ నోట్ పెట్టిన పెద్ద మనిషి ఏ ప్రాంతానికి చెందిన వాడన్నది మాత్రం బయటకు రాలేదు. సోషల్ మీడియా పుణ్యమా అని సదరు ఇంటి యజమానికి వివరాలు త్వరలో బయటకు వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.