పెద్దన్న తలచుకుంటే అట్టుంటది... హౌతీలకు అమెరికా బిగ్ షాక్!
ప్రధానంగా అమెరికా వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటూ యెమెన్ తిరుగుబాటుదారులు క్షిపణి దాడులకు పాల్పడుతున్నారు
By: Tupaki Desk | 18 Jan 2024 4:33 AM GMTగాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి నిరసనగా హౌతీలు ఎర్రసముద్రం గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా అమెరికా వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటూ యెమెన్ తిరుగుబాటుదారులు క్షిపణి దాడులకు పాల్పడుతున్నారు. దీంతో ఈ విషయాన్ని అగ్రదేశాలు సీరియస్ గా తీసుకున్నాయి. ప్రధానంగా హౌతీల విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.
అవును... ఎర్ర సముద్రంలో నైకలపై హౌతీలు చేస్తున్న దాడులకు ప్రతిచర్యగా ఇటీవల యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై అమెరికా, బ్రిటన్ లు మూడు రోజుల పాటు వైమానిక దాడులు నిర్వహించాయి. ఈ సమయంలో హౌతీ రెబెల్స్ మరోసారి రెచ్చిపోయారు. గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో అమెరికాకు చెందిన జెన్ కో పికార్డీ అనే కంటైనర్ నౌకపై దాడికి పాల్పడ్డారు.
ఇందులో భాగంగా ఆ నౌకపై డ్రోన్ తో బాంబులు జారవిడిచిన యెమెన్ తిరుగుబాటుదారులు... ఎర్రసముద్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ఈ దాడుల్లో యూఎస్ నౌకలోని కొంత భాగం ధ్వంసమైందని బ్రిటిష్ నావికాదళానికి చెందిన యునైటెడ్ కింగ్ డం మారిటైం ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. ఎడెన్ కు ఆగ్నేయంగా 70 మైళ్ల దూరంలో ఈ దాడి జరిగిందని.. ఈ ఘటనలో స్టాఫ్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది.
హౌతీలపై అంతర్జాతీయ ఉగ్ర ముద్ర:
ఇలా విరుచుకుపడుతున్న హౌతీలపై అమెరికా ఉగ్రవాద ముద్ర వేసింది. ఇందులో భాగంగా... యెమెన్ కేంద్రంగా పనిచేసే ఈ హౌతీ రెబల్స్ ను ప్రత్యేకంగా వర్గీకరించబడిన అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించింది. అయితే 3.2 కోట్ల మంది యెమెన్ పేద ప్రజల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అతి తక్కువ ఆంక్షలను విధిస్తున్నట్లు ఈ సందర్భంగా అమెరికా పేర్కొంది. వీరిపై ఆర్ధిక ఆంక్షలు విధించింది.
వాస్తవానికి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగిపోయే ముందే హౌతీలపై ఉగ్ర ముద్ర వేస్తూ పలు ఆంక్షలు విధించారు. అయితే... ఆ తర్వాత వచ్చిన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఆ ఆంక్షలను ఎత్తివేశారు. ఈ క్రమమలో తాజాగా అమెరికా నౌకలపై దాడులకు దిగుతున్న నేపథ్యంలో హౌతీ రెబల్స్ పై అమెరికా మళ్లీ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా... అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా ముద్ర వేసి ఆంక్షలను విధించింది.