టీడీపీ ఎమ్మెల్యేలకు ఫార్చునర్ కార్లు ఎలా వచ్చాయి ?
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి గట్టిగా రెండు నెలలు కూడా కాలేదు. కానీ కొత్త ఎమ్మెల్యేలు ఫార్చునర్ కార్లలో తిరుగుతున్నారు.
By: Tupaki Desk | 3 Aug 2024 9:37 AM GMTఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి గట్టిగా రెండు నెలలు కూడా కాలేదు. కానీ కొత్త ఎమ్మెల్యేలు ఫార్చునర్ కార్లలో తిరుగుతున్నారు. ఇది నిజంగా విడ్డూరమే అని అంటున్నారు. చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఈ మధ్య కొత్తగా ఫార్చునర్ కార్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు అని అంటున్నారు.
ఇలా పదవి దక్కింది అలా పాత కార్లు మార్చేసి కొత్త కార్లు కొనడం మాత్రం రాజకీయంగా చిత్రంగా ఉంది. ఫార్చునర్ కార్ల ధర మార్కెట్ లో అర కోటి పై దాటి ఉంటుంది. ఇవి పూర్తిగా లగ్జరీ కార్లు. మరి కొత్తగా ప్రజా ప్రతినిధులు అయిన వారికి ఇంత ఖరీదైన కార్లు ఎలా వస్తున్నాయి అన్నదే చర్చగా ఉంది.
నిన్ననే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఒక మాట అన్నారు. ఓటేసిన వేలికి సిరా ఇంకా ఆరలేదని. మరో వైపు హానీమూన్ పీరియడ్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఒకటే ఒక అసెంబ్లీ సెషన్ జరిగింది. అది కూడా గట్టివా వారం రోజులు సాగలేదు.
ఇంకా ప్రభుత్వమే కుదురుకుంటోంది. ప్రభుత్వాధినేత అయితే ఖజానా ఖాళీ అని ఎక్కడ చూసినా అదే మాట పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు చాలా మంది ఫార్చునర్ లగ్జరీ కార్ల మీద మనసు పడడం అనుకున్నదే తడవుగా కొనుగోలు చేయడాన్ని అంతా వింతగానే చూస్తున్నారు.
మరీ ఇంతగా ఆర్భాటం చేస్తూ ఏకంగా అత్యంత ఖరీదు అయిన ఫార్చునర్ లగ్జరీ కార్లు కొంటున్నారు అంటే ప్రజలకు కొత్త డౌట్లు ఎన్నో పుట్టుకుని వస్తున్నాయి. అయితే లోపాయికారీ విషయం ఏంటి అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత వివిధ శాఖల్లో భారీ ఎత్తున ట్రాన్స్ ఫర్లు జరిగాయి. అలా జరిగిన ఈ బదిలీలలో ఎన్నో లీలలు చోటు చేసుకున్నాయని కూడా ఆరోపణలు గుప్పుమన్నాయి.
ఈ క్రమంలో లక్షలాది రూపాయలు అటు నుంచి ఇటు చేతులు మారాయని కూడా అంతా గుసగుసలు పోయిన నేపధ్యం ఉంది. సరిగ్గా ఆ డబ్బులే ఫార్చునర్ కార్ల రూపంలో కనిపిస్తున్నాయని అంటున్నారు. ఎంతైనా ఎమ్మెల్యేలు కదా ఆ పాటి దర్జా ఉండొద్దా అని భావించారో ఏమో పాత కార్లు పక్కన పెట్టేసి ఫార్చునర్ కారెక్కిపోతున్నారు అని అంటున్నారు చూస్తే గట్టిగా అయిదేళ్ల కాలం ముందు ఉంది. దాంతో మొదట్లోనే ఇలా అధికార హవా చలాయిస్తేనే పదవికి ఒక లెక్క ఉంటుందని కూడా భావిస్తూ చాలా మంది ఈ ఫార్చునర్ వైభోగాన్ని అనుభవిస్తున్నారుట.
మరో వైపు చూస్తే ఎమ్మెల్యేలు స్థానికంగా తమ నియోజాకర్గాలలో ఏమేమి అభివృద్ధి పనులు చేయాలి ఎలా చేయాలి అన్నది ముందుగా పరిగణనలోకి తీసుకోవడం లేదు అని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన నియోజకవర్గం ప్రజలు ఎంతో ఆశతో గెలిపించారు కాబట్టి వారి కోసం కచ్చితమైన యాక్షన్ ప్లాన్ ని రూపొందించాలని ఆలోచన కూడా కనిపించడం లేదు.
గత అయిదేళ్లలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎంత డబ్బు సంపాదించారు. ఎలా సంపాదించారు, వారి ఆదాయ మార్గాలు ఏమిటి ఆ కిటుకులు ఏమిటి ఆ షార్ట్ కట్ మెథడాలజీ ఏమిటి అన్నది టీడీపీ ఎమ్మెల్యేలు ఆరా తీస్తూ అందులోనే ఫుల్ బిజీ అయిపోతున్నారు అన్న ప్రచారం కూడా సాగుతోంది.
ఏపీలో చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఎలా ఏపీని అభివృద్ధి చేయాలి దానికి ఏమేమిటి అవసరం అన్న దాని మీద తలలు బద్ధలు కొట్టుకుంటూంటే ఆయా పార్టీలకు చెందిన నేతలు మాత్రం తమ ఆదాయ మార్గాల మీదనే ఫుల్ ఫోకస్ పెట్టడం పట్ల నియోజకవర్గాల స్థాయిలోనే చర్చ సాగుతోంది.
మాంసం తిన్నామని ఎముకలు మెడలో ఎవరూ వేసుకోరు అన్నది ఒక సామెత. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే బదిలీల మీద పడి ఏదో ఎంతో కొంత వెనకేసుకుని ఉండొచ్చు కానీ అపుడే దానికి ఆర్భాటం చేసి ఫార్చునర్ లగ్జరీ కార్లను కొనేసి అందరి దృష్టిలో పడిపోవడం అవసరమా అన్న చర్చ సాగుతోంది. ఇలా అయితే మిగిలిన నలభై ఎనిమిది నెలలు ఏ తీరుగా జోరు చూపిస్తారో అని ఫార్చునర్ కార్ల అధిపతులు అయిన ఎమ్మెల్యేలను చూసి సెటైర్లు పెద్ద ఎత్తున పేల్చుతున్నారుట.