Begin typing your search above and press return to search.

ఎన్నికల ముంగిట ‘మహా’ సంకటం.. సిద్దిఖీ హత్య ఎటు పోతుందో?

అందులోనూ అజిత్ డిప్యూటీ సీఎంగానే ఉన్నారు.

By:  Tupaki Desk   |   13 Oct 2024 10:30 PM
ఎన్నికల ముంగిట ‘మహా’ సంకటం.. సిద్దిఖీ హత్య ఎటు పోతుందో?
X

షెడ్యూల్ ప్రకారం అయితే ఇప్పటికే మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఇక్కడ గత ఐదేళ్లలో రాజకీయాలు అత్యంత వేగంగా మారాయి. 2019లో ఫలితాల వెల్లడి అనంతరం తొలుత ఎన్సీపీ అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వంలో భాగమయ్యారు. కానీ, ఆ వెంటనే మనసు మార్చుకుని బాబాయ్ శరద్ పవార్ వద్దకు వచ్చేశారు. ఎవరూ ఊహించని విధంగా శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అందులోనూ అజిత్ డిప్యూటీ సీఎంగానే ఉన్నారు. ఇక రెండేళ్ల కిందట ఏక్ నాథ్ శిందే సారథ్యంలో

శివసేన నిలువునా చీలి.. బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 15 నెలల కిందట ఇదే విధంగా ఎన్సీపీ నిలువునా చీల్చిన అజిత్.. శివసేన-బీజేపీ ప్రభుత్వంలో భాగమయ్యారు. కాలక్రమంలో అసలైన శివసేన, అసలైన ఎన్సీపీలుగా ఏక్ నాథ్, అజిత్ వర్గాలే నిలిచాయి.

తీవ్ర వ్యతిరేకత నడుమ?

చీలిక పార్టీలైన శివసేన-ఎన్సీపీలతో కూడిన బీజేపీ మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతున్నారు. దీనికితగ్గట్లే ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయి. మొత్తం 48 స్థానాలకు గాను అధికార పార్టీ కూటమికి 30 సీట్లు మాత్రమే దక్కాయి. కాంగ్రెస్-ఎన్సీపీ (శదర్ పవార్)-శివసేన (ఉద్ధవ్) కూటమి 30 సీట్లు నెగ్గింది. ఆరు నెలల లోపునే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో బీజేపీ కూటమి గట్టెక్కడం కష్టమేనని పేర్కొంటున్నారు.

అసలు ఎన్నికలు ఎప్పుడు?

దాదాపు అక్టోబరు-నవంబరులోనే మహారాష్ట్ర ఎన్నికలు జరగాల్సి ఉంది. అలాగైతే ఇటీవలి కశ్మీర్, హరియాణా ఎన్నికలతో పాటే నిర్వహించాలి.

కానీ, ఇప్పటివరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నోటిఫికేషన్, షెడ్యూల్ రాలేదు. మరోవైపు జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీలతో పాటే మహారాష్ట్ర ఎన్నికలూ నిర్వహిస్తారని చెబుతున్నారు. జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీలకు ఇంకా సమయం ఉంది. అందుకనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఆపుతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంలో హరియాణా షెడ్యూల్ వెల్లడి సమయంలో.. మహారాష్ట్రలో వర్షాలను,పండుగలను కేంద్ర ఎన్నికల సంఘం కారణంగా చూపింది. ఇప్పుడు అవేమీ లేకున్నా ప్రకటన మాత్రం రాలేదు.

సిద్ధిఖీ హత్యతో..

మహారాష్ట్ర మరీ ముఖ్యంగా ముంబై నగరం దేశానికి చాలా కీలకమైనవి. అలాంటి రాష్ట్రం, నగరంలో శాంతిభద్రతల పరిస్థితిపై విమర్శలు వస్తున్నాయి. బాబా సిద్ధిఖీ హత్యతో ఇప్పుడు ఏక్ నాథ్ శిందే ప్రభుత్వం తీవ్ర చిక్కుల్లో పడినట్లే. మాజీ మంత్రి, తమ కూటమిలోని పార్టీ ఎన్సీపీ (అజిత్)కి చెందిన నాయకుడి హత్యకు నెలలుగా రెక్కీ జరుగుతున్నా కనిపెట్టలేకపోవడం కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. దీంతోనే మహారాష్ట్రలో అధికార పార్టీ కూటమికి ఎన్నికల్లో గడ్డుకాలం తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.