Begin typing your search above and press return to search.

కల్తీ నెయ్యిని కనిపెట్టటం ఎలా?

ఈ నేపథ్యంలో దుకాణాల్లో లభిస్తున్న నెయ్యిలో నాణ్యత మీద బోలెడన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Tupaki Desk   |   22 Sep 2024 6:30 AM GMT
కల్తీ నెయ్యిని కనిపెట్టటం ఎలా?
X

తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో వినియోగించిన ఆవునెయ్యిలో కల్తీ దేశ వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దుకాణాల్లో లభిస్తున్న నెయ్యిలో నాణ్యత మీద బోలెడన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వేళ.. మనం కొనే నెయ్యి నాణ్యత మాటేంటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. నెయ్యి స్వచ్ఛతను తెలుసుకోవటం ఎలా అన్న దానిపై చాలామందికి అవగాహన ఉండదు. అయితే.. చిన్న చిట్కాలతోనెయ్యి నాణ్యతను ఇట్టే తెలుసుకోవచ్చని చెబుతున్నారు.

నెయ్యి నాణ్యతను గుర్తించేందుకు ఉన్న విధానాల్ని చూస్తే..

- నీళ్లతో పరీక్ష

అవును.. నెయ్యి నాణ్యతను తేల్చేందుకు నీళ్లతోనూ తేల్చొచ్చు. ఈ విధానంలో గ్లాసు నీటిలో చెంచా నెయ్యి వేయాలి. నెయ్యి నీళ్లపై తేలితే అది స్వచ్ఛమైనది. అదే అడుగుకు చేరితో కల్తీ అని నిర్దారణ చేసేయొచ్చు.

- వేడితోనే నిగ్గు తేల్చొచ్చు

నేతి నాణ్యతను వేడితోనూ నిగ్గు తేల్చొచ్చు. పాన్ లో రెండు మూడు చెంచాల నెయ్యి వేసి కొంతసేపు వేడి చేయాలి. ఆ తర్వాత ఓ రోజంతా దాన్ని అలానే వదిలేయాలి. తర్వాతి రోజు అది చిన్న చిన్న రేణువులుగా మారి మంచి వాసన వస్తుంటే ఆ నెయ్యి స్వచ్ఛమైనది. అదే.. ముద్దలానే ఉంటే మాత్రం కల్తీనే.

ఇందులోనూ మరో విధానం ఉంది. చెంచా నెయ్యిని పాన్ లో వేసి వేడి చేయాలి. వెంటనే కరిగి ముదురు చాక్లెట్ రంగులోకిమారితే అది స్వచ్ఛమైనది. కరగటానికి ఎక్కువ టైం తీసుకొని.. లేత పసుపు రంగులోకి మారితే మాత్రం తేడా నెయ్యి అని అర్థం.

- ఉప్పుతోనూ లెక్క తేల్చొచ్చు

రెండు చెంచాల నెయ్యిలో అర చెంచా ఉప్పు వేసి.. ఇరవై నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత నెయ్యి రంగు మారితే అది కల్తీనే. ఎప్పటిలానే ఉంటే అది నాణ్యమైన నెయ్యిగా తేల్చొచ్చు.

- ఆయొడిన్ తోనూ చెప్పొచ్చు

నెయ్యి నాణ్యతను తేల్చేందుకు నెయ్యిని ఒక గిన్నెలో కాస్త వేసి.. అందులో నాలుగైదు చుక్కల అయొడిన్ వేయాలి. అది నీలి రంగులోకి మారితే నకిలీదని అర్థం. బంగాళదుంపలు లాంటి పిండి పదార్థాల్ని కలిపితే ఈ రంగు వస్తుంది.

- పంచదారతోనూ పరీక్షించొచ్చు

కల్తీ నెయ్యిని గుర్తించేందుకు పంచదారను అస్త్రంగా వాడొచ్చు. కొంచెం నెయ్యిని ప్లేట్ లో వేసి.. కాస్త చక్కర వేయాలి.దానికి హైడ్రోక్లోరిక్ అమ్లాన్ని కాస్త కలపాలి. ఎరుపు రంగులోకి మారితే అది కల్తీనే.

- చేతితోనే తేల్చేయొచ్చు

నెయ్యి నాణ్యతను తేల్చేందుకు మన రెండు చేతులు కూడా చెప్పేస్తాయి. ఇందులో కాస్త నెయ్యిని అరచేతిలో వేసుకొని.. రెండు చేతుల్ని బాగా రుద్దాలి. కాసేపటికి నెయ్యి వాసన రాదు. అలా జరిగితే అది కల్తీ నెయ్యి. అదే.. నాణ్యమైన నెయ్యి అయితే.. ఎంత రుద్దినా సువాసన వస్తూనే ఉంటుంది. వాసన పోదు. అదే నాణ్యమైన నెయ్యి.

- పూసలా ఉందంటే..

నాణ్యమైన నెయ్యి తెల్లగా గడ్డ కట్టినట్లుగా.. పూసపూసలా ఉంటుంది. వేడి చేసినప్పుడు మాత్రం నూనెలా మారుతుంది. అదే కల్తీ నెయ్యి అయితే ఇలా ఉండదు. ఏ మాత్రం చిక్కగా లేకున్నా నెయ్యిలో కల్తీ జరిగినట్లే.