Begin typing your search above and press return to search.

బూతులు, దూషణలతో టెంపరరీ క్రేజ్.. పర్మినెంటుగా కెరీర్ క్లోజ్

కానీ, దూకుడు పేరుతో దౌర్జన్యాలు.. దూషణలకు దిగడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఇటీవల చోటుచేసుకుంటున్న సంఘటనలు నిరూపిస్తున్నాయంటున్నారు.

By:  Tupaki Desk   |   2 March 2025 9:00 PM IST
బూతులు, దూషణలతో టెంపరరీ క్రేజ్.. పర్మినెంటుగా కెరీర్ క్లోజ్
X

రాజకీయాల్లో హుందాతనం, గౌరవం ఎంతో ముఖ్యం. దూకుడుగా ఉండటం.. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం అంతకన్నా ముఖ్యం. కానీ, దూకుడు పేరుతో దౌర్జన్యాలు.. దూషణలకు దిగడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఇటీవల చోటుచేసుకుంటున్న సంఘటనలు నిరూపిస్తున్నాయంటున్నారు. అధికారంలో ఉండగా ఆ తరహా రాజకీయం తాత్కాలికంగా క్రేజ్ తీసుకువచ్చినా, ఆ తర్వాత జరిగే పరిణామలతో కెరీర్ క్లోజ్ అయ్యే పరిస్థితి ఎదుర్కోక తప్పదని ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ ను చూసి అర్థం చేసుకోవాల్సివుంటుందని అంటున్నారు.

ఏపీలో మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, తెలంగాణలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సినీ నటుడు పోసాని క్రిష్ణమురళి ప్రస్తుతం రాజకీయంగా క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఏపీలో నోటి దురుసు చూపుతున్న నేతలను అరెస్టు చేసి జైలుకు తరలిస్తుండగా, తెలంగాణలో ఇంకా అలాంటి వాతావరణం కనిపించడం లేదు. కానీ, నోటిని అదుపులో ఉంచుకోకపోతే తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సివస్తుందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసి అధికార పార్టీ హెచ్చరికలు పంపింది. ఈ సంఘటనలతో ఈ తరహా రాజకీయాలు చేస్తున్న వారి రాజకీయ జీవితంపై చర్చ మొదలైంది.

ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా, మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, సినీ నటుడు పోసాని క్రిష్ణమురళి, వైసీపీ సానుభూతి పరుడు బోరుగడ్డ అనిల్ వంటివారు ఇష్టానుసారం నోరుపారేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. అదేవిధంగా సోషల్ మీడియా కార్యకర్తలపైనా పెద్ద ఎత్తున కేసులు, అరెస్టులు జరిగాయి. అయితే ప్రధాన నేతలుగా గుర్తింపు తెచ్చుకున్న కొడాలి, వల్లభనేని వంశీ, పోసాని క్రిష్ణమురళి వంటి వారు అనుచితంగా మాట్లాడటంతోనే ప్రస్తుతం చిక్కులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. వారి ప్రవర్తన వల్లే గత ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకున్నారనే వాదన వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే వారి నోటి దురుసు వల్లే తమ అధికారం పోయిందని వైసీపీలో చాలా మంది నేతలు ఆరోపిస్తున్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వంటి వారు ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించినా, కొందరు పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చిస్తున్నారు.

అటు తెలంగాణలోనూ ఇదే విధంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఓ సామాజికవర్గాన్ని టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. ఏకంగా బహిరంగ సమావేశంలో అనుచితంగా మాట్లాడటమే కాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై పార్టీ వేటు వేసింది. తెలంగాణలో ఏ పార్టీ అండ లేకుండా తీన్మార్ మల్లన్న స్వతంత్రంగా ఎదగడం సాధ్యమా? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. గతంలో ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసిన తీన్మార్ మల్లన్న ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ మద్దతు పొందిన తర్వాతే ఎమ్మెల్సీ కల నెరవేర్చుకున్నారు. అయితే ఏడాది తిరగకముందే పార్టీతో తెగతెంపులు జరగడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

గత అసెంబ్లీ ఎన్నికల వరకు కొడాలి నాని, వల్లభనేని వంశీ వారి సొంత నియోజకవర్గాల్లో బలమైన నేతలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారీ అనుచర గణం కారణంగా వారిని ఎదుర్కొని గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో రాజకీయం చేయడం అంత ఈజీ కాదనే భావన ఉండేదని అంటున్నారు. అలాంటి శక్తి సంపాదించిన వారు ఇప్పుడు ఓడిపోవడమే కాకుండా, కొన్నాళ్లుగా బయటకు రాలేని పరిస్థితిని ఎదుర్కోవడం విశేషంగా చెబుతున్నారు. ఈ పరిస్థితి చూసిన వారు బూతులు, దూషణలతో తాత్కాలికంగా క్రేజ్ సంపాదించినా, శాశ్వతంగా రాజకీయ జీవితాన్ని కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని అంటున్నారు. ఏపీ, తెలంగాణల్లో ఏ నేత అయినా ప్రస్తుత పరిణామాలను గమనించి మసులు కోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.