Begin typing your search above and press return to search.

అమెరికా-పాకిస్థాన్‌లో అలా.. మ‌న దెగ్గ‌ర మోడీ విక‌సిత భార‌త్ ఎలా?

బ‌హుశ అందుకేనేమో.. చ‌ట్ట స‌భ‌ల్లో క్రిమిన‌ల్ నేరాల కింద కేసులు న‌మోదైన వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంద‌ని ఇటీవ‌ల అసోచామ్ నివేదిక స్పష్టం చేసింది.

By:  Tupaki Desk   |   31 Dec 2023 2:30 PM GMT
అమెరికా-పాకిస్థాన్‌లో అలా.. మ‌న దెగ్గ‌ర  మోడీ విక‌సిత భార‌త్ ఎలా?
X

ఎన్నిక‌ల్లో పోటీ చేసే నాయ‌కుల విష‌యంలో భార‌త్ ఎలాంటి విధానం అనుస‌రిస్తోంది? అంటే.. ఏ పార్టీకి ఆ పార్టీ గెలిచేవాడైతే.. చాలు! అనే మంత్రాన్నే ప‌ఠిస్తోంది. బ‌హుశ అందుకేనేమో.. చ‌ట్ట స‌భ‌ల్లో క్రిమిన‌ల్ నేరాల కింద కేసులు న‌మోదైన వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంద‌ని ఇటీవ‌ల అసోచామ్ నివేదిక స్పష్టం చేసింది. ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌ల‌లో తీవ్ర నేరాలు చేసిన‌ట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న‌(కేసులు న‌మోదు) వారు 46 శాతం మంది చ‌ట్ట‌స‌భ‌ల‌కు ఎన్నిక‌య్యారు.

ఈ విష‌యంలో అటు బీజేపీ నుంచి ఇటు కాంగ్రెస్ వ‌ర‌కు కూడా ఏ పార్టీ ఆలోచ‌న చేయ‌డం లేదు. క‌నీసం ఈ తీవ్ర‌త‌ను కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. గెలిచే వ్య‌క్తి, డ‌బ్బులు ఖ‌ర్చు చేసే నాయ‌కుడు అయితే చాలు.. అన్నట్టుగా టికెట్ల‌ను పందేరం చేస్తున్నాయి. కానీ, మ‌నం శ‌త్రువుగా చూసే పాకిస్థాన్‌లోను.. అగ్ర‌రాజ్యంగా అనుస‌రించే అమెరికాలోనూ ఎలాంటి ప‌రిస్థితి ఉందంటే.. మ‌న‌క‌న్నా అద్భుత‌మైన మెకానిజంను అక్క‌డ అనుస‌రిస్తున్నారు.

అమెరికా ప‌రిస్థితిని చూస్తే.. విధ్వంసాలు, కుట్ర‌పూరిత రాజ‌కీయాల కేసులు ఎదుర్కొంటున్న వారు ఎవ‌రైనా.. ఎంత‌టి వారైనా ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు అర్హులు కానేకాదు. ఇక‌, మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపులు, అత్యాచార కేసుల్లో నిందితులుగా ఉంటే.. అస‌లు వారు పేరును కూడా ప‌రిశీలించ‌రు. తాజాగా దీనికి మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంపే పెద్ద ఉదాహ‌ర‌ణ‌. కానీ, భార‌త్ విష‌యానికి వ‌స్తే.. మాత్రం ఇక్క‌డ అనేక కేసుల్లో ఉన్న‌వారికి కూడా టికెట్లు వ‌స్తాయి.. అదేంటో వారు గెలిచేస్తారు కూడా!!

ఇక‌, మ‌న దాయాది శ‌తృదేశంవిష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డా ఇదే ప‌రిస్థితి ఉంది. పాకిస్థాన్‌ ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ అధికారంలోకి వద్దామని ఆశించిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మరో రెండు నెలల్లో జరగనున్న పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ కోసం ఇమ్రాన్‌ ఖాన్‌ వేసిన నామినేషన్లను పాక్‌ ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీనికి కార‌ణం.. అధికారంలో ఉండ‌గా ప్రభుత్వ కానుకలకు సంబంధించిన తోషాఖానా అవినీతి కేసులో ఆయ‌న ఇరుక్కోవ‌డ‌మే.

ఈ కేసులో ఇస్లామాబాద్‌ జిల్లా కోర్టు గ‌తంలో ఇమ్రాన్‌కు మూడేళ్ల జైలుశిక్షను ఖరారు చేసింది. దీంతో ఆయ‌న‌ను ఎన్నిక‌ల‌కు దూరం పెట్టేశారు. మ‌రి అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశ‌మైన భార‌త్ ప‌రిస్థితి ఏంటి? మ‌రో మూడు మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇలాంటి సంచ‌ల‌న నిర్ణ‌యాలు ఏమైనా తీసుకునే ఆలోచ‌న ఉందా? అంటే.. `ఆ ఒక్క‌టీ అడ‌గ‌ద్దు`` అనే సూత్రాన్నే అన్ని పార్టీలూ పాటిస్తున్నాయి. ఇదీ.. ప్ర‌ధాని మోడీ చెబుతున్న విక‌సిత భార‌త్‌!