బీజేపీలో పురంధేశ్వరి ఎన్నాళ్ళు ఉంటారో...?
దాంతో కాంగ్రెస్ లో ఉమ్మడి ఏపీ తరఫున పదవులు అనుభవించి కేంద్రంలో మంత్రులుగా చేసిన వారు అంతా ఏ మాత్రం సంకోచం లేకుండా బీజేపీలోకి జంప్ చేసారు.
By: Tupaki Desk | 14 Nov 2023 12:30 AM GMTభారతీయ జనతా పార్టీ 2014లో మంది స్వింగ్ లో ఉంది. అధికారంలోకి వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అలాగే జరిగింది. నాడు ఏపీలో కాంగ్రెస్ కుదేల్ అయింది. విభజన వల్ల కాంగ్రెస్ కి ఏపీలో మంచి నీళ్ళు పుట్టలేదు. దాంతో కాంగ్రెస్ లో ఉమ్మడి ఏపీ తరఫున పదవులు అనుభవించి కేంద్రంలో మంత్రులుగా చేసిన వారు అంతా ఏ మాత్రం సంకోచం లేకుండా బీజేపీలోకి జంప్ చేసారు.
అలా చేసిన వారిలో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఒకరు. ఆమె బీజేపీలో చేరగానే బాగానే ఆదరించింది ఆ పార్టీ. అయితే ఆమె కోరుకున్న విశాఖ ఎంపీ సీటు ఇవ్వకుండా రాజంపేటకు పంపించారు. అప్పటికే ఆమె కాంగ్రెస్ తరఫున విశాఖ పార్లమెంట్ కి సిట్టింగ్ ఎంపీ. అయితే అక్కడ బీజేపీ సీనియర్ నేత ఆనాటి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అయిన కంభంపాటి హరిబాబు రేసులో ఉన్నారు. అలా ఆయనకే టికెట్ ఖరారు అయింది.
బీజేపీకి కొంత బలం ఉన్న ప్లేస్ కావడం టీడీపీ పొత్తు తోడుగా ఉండడంతో ఆయన్ గెలిచారు. ఇక వైసీపీకి కంచు కోట అయిన రాజంపేటలో పురంధేశ్వరి బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆమెకు రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిని చేస్తారు అని ఆశలు పెట్టుకున్నా నెరవేరలేదు.
అయితే బీజేపీ మాత్రం జాతీయ కార్యవర్గంలో ఆమెకు మంచి ప్రాధాన్యత కలిగిన పోస్టులలో నియమించింది. ఇక ఆమె పార్టీలో చేరి పదేళ్ళు కావస్తున్న నేపధ్యంలో ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా ప్రమోట్ చేసింది. ఈ నేపధ్యంలో టీడీపీతో పొత్తుల కోసం ఆమె చూస్తున్నారు అని ప్రచారం ముమ్మరం అయింది. అదే జరిగితే ఈసారి తాను విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవాలని చూస్తున్నారు. అలా కేంద్రంలో మంత్రి కావాలని భావిస్తున్నారు
అయితే ఆమె మీద గత కొంతకాలంగా విమర్శలు చేస్తూ వస్తున్న వైసీపీ ఎంపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి పురంధేశ్వరికి సరైన ప్రశ్నే వేశారు అంటున్నారు. పురంధేశ్వరి ఎన్నాళ్ళు బీజేపీలో ఉంటారు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆయన తాజాగా తన ట్విట్టర్ లో పురంధేశ్వరిని కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. అక్కడ ఎన్నాళ్ళు ఉంటారు అని నిలదీశారు.
అంతే కాదు మొదట మీరు టీడీపీలో ఉన్నారు, ఆ తరువాత కాంగ్రెస్ లోకి వచ్చారు. ఆ మీదట ఇపుడు బీజేపీలో కొనసాగుతున్నారు. ఈ పార్టీలో అయినా పూర్తిగా కొనసాగుతారా అని తన డౌటానుమానాన్ని వ్యక్తం చెశారు. మీ తండ్రి గారు పెట్టిన టీడీపీలో ఉన్నారు. అందులో నుంచి ఎందుకు బయటకు వచ్చారో తెలియదు, మీ తండ్రి జీవితకాలం వ్యతిరేకించిన కాంగ్రెస్ లో చేరి ఎనిమిదేళ్ల పాటు కేంద్ర మంత్రిగా పదవిని అనుభవించారు.
కాంగ్రెస్ ని వీడి ఎందుకు బయటకు వచ్చారో తెలియదు. ఇపుడు బీజేపీలో ఎన్నాళ్ళు ఉంటారో అదైనా చెప్పగలరా అని విజయసాయిరెడ్డి ప్రశ్నలను సంధించారు. ఎన్టీయార్ కి పెద్ద కుమార్తెగా పుట్టి ఏకంగా తండ్రికే వెన్నుపోటు పొడిచారు అని విజయసాయిరెడ్డి దెప్పిపొడిచారు.
ఇక మీ మరిది చంద్రబాబు కాంగ్రెస్ కి తెలంగాణా ఎన్నికల్లో మద్దతు ఇస్తూ వస్తున్నారు. అలాంటి ఆయన కోసం ఏపీలో బీజేపీ నుంచి మద్దతు ఇస్తున్నారు మీరు అని విమర్శలు సంధించారు. బీజేపీకి కాంగ్రెస్ కి పడదు, కానీ పురంధేశ్వరి మాత్రం ఇండైరెక్ట్ గా తెలంగాణాలో కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్న బాబు కోసం ఏపీలో బీజేపీ తరఫున పనిచేస్తున్నారు అని విజయసాయిరెడ్డి విమర్శలు గిప్పించారు.
ఒక విధంగా విజయసాయిరెడ్డి వరస ప్రశ్నలతో ఏపీ బీజేపీలో కూడా కొంత కలవరాన్ని రేకెత్తించారు అని అంటున్నారు. ఏపీ బీజేపీలో మొదటి నుంచి ఉంటున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే వలస వచ్చిన వారికే పదవులు కట్టబెడుతున్నారు అన్న అసంతృప్తి చాలా మందిలో ఉంది. ఇపుడు విజయసాయిరెడ్డి పురంధేశ్వరిని టార్గెట్ చేయడంతో ఏపీ బీజేపీలో వర్గ పోరు కూడా తెలియకుండా బయటపడుతోంది అని అంటున్నారు. ఆమెకు మద్దతు కూడా పార్టీ నుంచి అనుకున్న స్థాయిలో రావడంలేదు అని అంటున్నారు