''9999'' నెంబరు కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా?
నెంబర్ల మీద నమ్మకం ఉన్న వారికి.. తాము కోరుకున్న నెంబర్లను సొంతం చేసుకోవటానికి ఎంతకైనా సిద్దమన్నట్లుగా వ్యవహరించటం చూస్తుంటాం.
By: Tupaki Desk | 12 Dec 2023 6:21 AM GMTఫ్యాన్సీ నెంబర్ల మీద ఉండే మోజు అంతాఇంతా కాదు. తాము కొనుగోలు చేసిన కారు నెంబరు కోసం ఎంతకైనా సిద్ధమన్నట్లుగా ఖర్చు చేసే అలవాటు కొందరికి ఉంటుంది. నెంబర్ల మీద నమ్మకం ఉన్న వారికి.. తాము కోరుకున్న నెంబర్లను సొంతం చేసుకోవటానికి ఎంతకైనా సిద్దమన్నట్లుగా వ్యవహరించటం చూస్తుంటాం. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చోటు చేసుకుంది.
తాజాగా 9999 నెంబరు కోసం భారీగా ఎత్తున ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సోమవారం ఆన్ లైన్ లో నిర్వహించిన కొత్త సిరీస్ నెంబర్ల వేలంలో భారీ డిమాండ్ ఏర్పడింది. 9999 నెంబరు కోసం సదరు కారు ఓనర్ పెట్టిన ఖర్చు అక్షరాల రూ.17,35,000 కావటం గమనార్హం. అయితే.. ఈ భారీ మొత్తాన్ని ఒక కీస్టోన్ ఇన్ ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ పేరుతో తీసుకోవటం గమనార్హం. అదే విధంగా మరికొన్ని నెంబర్లకు భారీ మొత్తాల్ని చెల్లించి మరీ సొంతం చేసుకున్నారు.
TS09 GE 9999 కోసం రూ.17.35 లక్షలు పలకగా.. TS09 GE 0005 నెంబరు కోసం రూ.3.75 లక్షలు లలిత జ్యూవెలర్స్ మార్ట్.. TS09 GE 0001 రూ.3.50లక్షలు.. TS09 GE 0099కు రూ.2,31,999.. TS09 GE0111 నెంబరుకు రూ.2,09,999 మొత్తం పలికినట్లుగా చెబుతున్నారు. ఈ నెంబర్లలో ఒకరు తప్పించి.. మిగిలిన వారంతా కంపెనీల పేరుతో కొనుగోలు చేసినట్లుగా వెల్లడించారు. మొత్తంగా ఒక్కరోజు నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల కోసం రూ.45.98 లక్షల ఆదాయం ప్రభుత్వానికి సమకూరినట్లుగా ప్రకటించారు.