ఈ 'అవినీతి' ని నమ్మేదెలా? తెలంగాణ టాక్!
ముఖ్యంగా బీజేపీ కేంద్ర పాలకులు చెబుతున్న మాటలు హాట్ టాపిక్ అయ్యాయి.
By: Tupaki Desk | 25 Nov 2023 4:47 AM GMTప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మరో నాలుగు రోజులు మాత్రమే ఎన్ని కల ప్రచారానికి అవకాశం ఉంది. ఈ నెల 30న జరగనున్న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నిబంధనల మేరకు ఈ నెల 28 సాయంత్రం 5గంటలకల్లా.. ప్రచారాన్ని కట్టిపెట్టాలి. దీంతో పార్టీలు ఈ నాలుగు రోజులను అత్యంత చాకచక్యంగా వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ కేంద్ర పాలకులు చెబుతున్న మాటలు హాట్ టాపిక్ అయ్యాయి.
తాజాగా ముగ్గురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనాయకులు.. తెలంగాణలో పర్యటించి ప్రచారం చేశారు. వీరిలో హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నారు. వీరు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ.. ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. అయితే.. ఈ ముగ్గురు నోటి నుంచి కూడా కేసీఆర్ కుటుంబ పాలన, ఆయన కుటుంబ అవినీతి వ్యవహారమే వస్తోంది.
తెలంగాణను దోచుకున్నారని.. ప్రాజెక్టుల్లో అవినీతి చేశారని.. దోచుడు-దాచుడు నినాదంతో ముందుకు సాగారని.. కేంద్ర మంత్రులు తలకోచోట విరుచుకుపడ్డారు. అంతేకాదు.. రాజ్‌నాథ్ సింగ్ అయితే.. ఇంకేముంది.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే.. కేసీఆర్‌ను ఆయన కుటుంబాన్ని కూడా గుండుగత్తగా జైల్లో పెట్టేస్తామని చెప్పుకొచ్చారు. ఇక, దాదాపు అమిత్ షా కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతామనే చెప్పారు. ఆయన అవినీతి ఊడల్లా పెరిగిపోయిందన్నారు.
అయితే.. ఈ బీజేపీ నాయకులు చెబుతున్న అవినీతి వ్యాఖ్యలు.. జైలు మాటలునమ్మేదెలా? అనేది ప్రధాన ప్రశ్న. ఎందుకంటే.. నిజానికి చర్యలు తీసుకోవాలని అనుకుంటే.. రాష్ట్రంలో అవినీతి జరిగిందని ఆధారాలు ఉంటే.. కేంద్రంలో ఉన్నా.. చర్యలు తీసుకోవచ్చు. ఇప్పటికే జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌పై సీబీఐ దాడులు చేయడం లేదా? పశ్చిమ బెంగాల్ సీఎం మమతకు చుక్కలు చూపించడం లేదా అనేది ప్రశ్న.
కానీ, తెలంగాణలో అంత అవినీతీ లేదు.. ఇక్కడచర్యలు తీసుకునే ఛాన్సేలేదని పరిశీలకులు చెబుతున్నారు. ఎన్నికల టైం కాబట్టి నాయకులు ఇలానే మాట్లాడతారని అంటున్నారు. ఈ అవినీతికి లెక్కలు, చర్యలు ఉండవని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.