Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న హెచ్ ఎస్ డీడీ కేసులు?

సంసారం చక్కగా చేయకుండా పిల్లలు పుట్టాలనుకునే జంటలు ఎక్కువ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   31 March 2025 6:38 AM
తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న హెచ్ ఎస్ డీడీ కేసులు?
X

తెలుగు జంటల్లో అంతకంతకూ పెరుగుతున్న ఒక సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఇద్దరికి ఉద్యోగం.. డబ్బులకు ఇబ్బంది లేనప్పటికీ వారిలో ఒక లోటు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. అదే సంసార సౌఖ్యం. అంతకంతకూ పెరుగుతున్న యాంత్రికత శృంగారం మీద ఆసక్తిని తగ్గించేస్తున్నాయి. వినేందుకు సిత్రంగా అనిపించినా ఇది నిజం. కెరీర్ పరుగు పందెంతో వెనుకా ముందు చూసుకోకుండా పరుగులు తీస్తున్న యువ జంటలు.. తమ మధ్య బంధాన్ని మరింత గాఢంగా పెనవేసుకునే శృంగారం విషయంలో మాత్రం అనాసక్తిని ప్రదర్శిస్తున్నారు.

తనివితీరా సంసార సుఖాన్ని అనుభవించకుండానే పిల్లలు పుట్టటం లేదంటూ సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్న జంటలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. లేచామా.. తిన్నామా.. పడుకున్నామా.. పని చేసుకున్నామా.. ఇంటికి వచ్చామా.. మధ్యలో ఏ మాత్రం గ్యాప్ దొరికినా సోషల్ మీడియా ప్రపంచంలో విహరించటమే తప్పించి.. భాగస్వామితో కులాశా కబుర్లు.. చతుర్లు.. సరదా చేష్టలకు తావివ్వకుండా ఎవరి స్పేస్ లో వారు ఉండేస్తున్న పరిస్థితి.

సంసారం చక్కగా చేయకుండా పిల్లలు పుట్టాలనుకునే జంటలు ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఈ సంఖ్య ఎక్కువైనట్లుగా చెబుతున్నారు. ఈ సమస్యను హెచ్ ఎస్ డీడీగా పేర్కొంటారు. మరింత వివరంగా చెప్పాలంటే.. ‘‘హైపో యాక్టివ్ సెక్సువల్ డిజైర్ డిజార్డర్ గా దీన్నిచెప్పాలి. ఈ సమస్యను సింఫుల్ గా.. సూటిగా చెప్పాలంటే లైంగిక ఆసక్తి తగ్గటం.. వాంఛలు లేకపోవటమే. గతంలోనూ ఈ సమస్య ఉన్నప్పటికి ఇటీవల కాలంలో ఈ కేసులు మరింత పెరిగాయి.

ఇటీవల కాలంలో విడాకులు ఎక్కువగా తీసుకుంటున్న వారిలో ఇదో కారణంగా చెబుతున్నారు.గతంతో పోలిస్తే మనిషి జీవనవిధానం పూర్తిగా మారింది. కెరీర్ టార్గెట్లు.. అనారోగ్యకర అలవాట్లు జీవితంలో భాగమవుతున్నాయి. ఉద్యోగాల్లో ఒత్తిడితో ఆందోళన.. ఆత్మన్యూనత లాంటి అంశాలు లైంగిక వాంఛలు తగ్గేందుకు కారణమవుతున్నాయి.

నగరాల్లో ఉన్న చాలా జంటలు తాము శృంగారంలో పాల్గొనటానికి టైం దొరక్కట్లేదని చెబుతారు. అదే.. వారి సెల్ ఫోన్ స్క్రీన్ టైం చూస్తే.. వారెంతలా దానికి బానిస అయ్యారో అర్థమవుతుంది. ఆఫీసుల్లో గడిపే సమయంతో పోలిస్తే.. బెడ్రూంలో కలిసే సమయం చాలా తగ్గిపోయింది. ఇంటికి ఆలస్యంగా రావటం.. కాసేపు మాట్లాడుకోవటం.. ఎవరి సెల్ ఫోన్లలో వారు మునిగిపోవటం లాంటివి ఎక్కువ అవుతున్నాయి.

ఇటీవల కాలంలో కొత్తగా పెళ్లైన జంటలు సైతం నెలకు ఒకట్రెండుసార్లు మాత్రమే శృంగారంలో పాల్గొంటున్నట్లుగా చెబుతున్న వైనాన్ని వైద్యులు చెబుతున్నారు. మరికొందరు పిల్లలు కావాలనుకునే వారు షెడ్యూల్ వేసుకొని మరీ శృంగారం చేయటం ఎక్కువైనట్లుగా చెబుతున్నారు. భార్యతో రొమాన్సును సైతం ఒక ప్రాజెక్టు మాదిరి.. పని మాదిరి చూడటమే అసలు సమస్యగా చెప్పాలి. దీనంతటికి కారణం ఏమిటన్న ప్రశ్న వేస్తే.. పొగాకు.. అతిగా మద్యం తాగటం.. ఒబెసిటి.. ఒత్తిడి.. రాత్రిళ్లు సైతం పని చేయటం..లాంటివి చెబుతున్నారు.

ఇవన్నీ సంసార జీవితం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అనారోగ్య జీవన విధానం కారణంగా వీర్యకణాలు తగ్గటమే కాదు.. లైంగిక పటుత్వం మీదా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఇటీవల కొన్ని అధ్యయనాల ప్రకారం కనీసం 15 శాతం మంది మగవారిలో జీవితంలో ఏదో ఒక దశలో లైంగిక వాంఛలు తగ్గిపోవటం జరుగుతుందంటున్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. శృంగార వాంఛలకు.. గుండెజబ్బులకు లింకు ఉందంటున్నారు. అదెలానంటే.. గుండె సంబంధ జబ్బులు రావటానికి ఏడాది ముందే అంగస్తంభన సమస్యలు మొదలవుతాయని చెబుతున్నారు.

గుండెలకు వెళ్లే రక్తనాళాలతో పోలిస్తే.. అంగానికి వెళ్లే రక్తనాళాల పరిమాణం చాలా తక్కువగా ఉంటుందని.. అందువల్ల అవి ముందుగా ప్రభావితం అవుతాయని చెబుతున్నారు. అయితే.. చాలామందికి ఈ అంశాల మీద అవగాహన లేకపోవటం కనిపిస్తుందని చెబుతున్నారు. జీవనశైలిలో కాస్తంత మార్పులు చేసుకుంటే శృంగార జీవితంలో మార్పు వస్తాయని చెబుతున్నారు. ఒత్తిడిని వదిలేయటం ద్వారా చక్కటి శృంగార జీవితం ఖాయమంటున్నారు. ఒత్తిడిని అధిగమించేందుకు యోగా.. వ్యాయామంతో పాటు చెడు అలవాట్లకు దూరంగా ఉంటే సరిపోతుందని చెబుతున్నారు. అదే సమయంలో ఏదైనా సమస్య వస్తే గూగుల్ చేసే కన్నా.. మంచి వైద్యుడ్ని సంప్రదించటం చాలా మంచిదన్న మాట చెబుతున్నారు.