లోకేష్ అపాయింట్మెంట్ కోసం భారీ క్యూ
ఆయనే పార్టీలో బాధ్యతలు ఎక్కువగా తీసుకుంటున్నారు అని ప్రచారం సాగుతోంది.
By: Tupaki Desk | 7 Oct 2024 1:30 AM GMTతెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోనూ పార్టీలోనూ సగానికి పైగా భారాన్ని నారా లోకేష్ చంద్రబాబుకు తగ్గించేస్తున్నారు. ఆయనే పార్టీలో బాధ్యతలు ఎక్కువగా తీసుకుంటున్నారు అని ప్రచారం సాగుతోంది.
గతంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు రెండేళ్ళ పాటు లోకేష్ మంత్రిగా చేశారు. అయితే ఈ మధ్యలో అయిదేళ్ల కాలంలో ప్రతిపక్షంలో ఆయన బాగా రాటు తేలారు. దాంతో పాటు పార్టీలో ప్రభుత్వంలో పట్టుని బాగా పెంచుకున్నారు. అన్ని విషయాల మీద అవగాహన కూడా పెరిగింది.
యువగళం పేరుతో భారీ పాదయాత్ర చేయడం వల్ల కూడా ఆయనకు ఏపీలోని ఉమ్మడి పదమూడు జిల్లాలలో పార్టీ నేతలతో డైరెక్ట్ గా కనెక్షన్ ఏర్పడింది. గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలిశాయి. పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చుని ఎవరు ఏమిటి ఏ జిల్లాలో ఎవరు ఏ విధంగా పనిచేస్తారు, జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటి అన్నది మొత్తం డేటా ఆయన మెదడులోనే నిక్షిప్తం చేసుకున్నారు అని అంటున్నారు.
ఇక లోకేష్ క్యాడర్ కి లీడర్ కి బాగా అందుబాటులో ఉంటారని పేరు తెచ్చుకున్నారు. ఆయనకు కలవాలని అనుకున్న వారిని నిరుత్సాహపరచరు అని తమ్ముళ్ళు చెబుతారు. తన వద్దకు ప్రతీ రోజూ వచ్చే పార్టీ నేతలను ఆదరించడం వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం తగిన పరిష్కారాలను చూపడం ద్వారా టీడీపీలో అందరికీ లోకేష్ ఒక పెద్ద దిక్కుగా మారారు అని అంటున్నారు.
గతంలో టీడీపీలో అయితే చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం నేతలు ఎదురు చూసేవారు. బాబు సీఎం గా పార్టీ అధినేతగా ఫుల్ బిజీగా ఉండడం వల్ల సులువుగా అపాయింట్మెంట్ దొరికేది కాదు. తమ బాధలు చెప్పుకోవడానికి కానీ తమ వినతులు ఇవ్వడానికి కానీ తమ కోరికలను వెల్లడించడానికి కానీ టీడీపీలో ఆక్సెస్ అంతగా అప్పట్లో ఉండేది కాదు అని అంటారు.
అయితే ఇపుడు లోకేష్ ఒక సరికొత్త కేంద్రంగా మారారు అని అంటున్నారు. చంద్రబాబు సైతం బాధ్యతలను కుమారుడికి అప్పగించారని అంటున్నారు. పార్టీలో నేతలు అంతా ఈ విధంగా లోకేష్ దగ్గరకు వస్తూ తమ నియోజకవర్గం సమస్యలను చెప్పుకోవడంతో పాటు తమ మనసులోని ఆకాంక్షలను కూడా చెబుతున్నారు.
ఆ విధంగా పదవులు ఆశిస్తున్న వారు అంతా లోకేష్ దగ్గరకే వెళ్తున్నారు. ఏపీలో వంద దాకా కార్పోరేషన్లు ఉన్నాయి. ఇందులో ఇరవై దాకా భర్తీ చేశారు. అయితే మరో ఎనభై దాకా కార్పోరేషన్ చైర్మన్ పదవులు ఉన్నాయి. వీటిని విడతల వారీగా భర్తీ చేస్తారు. దాంతో లోకేష్ ని డైరెక్ట్ గా కలసి తన కోరికను చెప్పుకుంటున్నారు.
ఇక తొలి విడత నామినేటెడ్ పదవుల భర్తీలో కూడా లోకేష్ ముద్ర ఉందని అంటున్నారు. ఆయన సైతం యువతకు కొత్త ముఖాలకు పదవులు నోచుకోని వారికి కష్టపడేవారికీ గుర్తించి మరీ ప్రయారిటీ ఇస్తున్నారు అని అంటున్నారు. దాంతో లోకేష్ వద్దకు ప్రతీ రోజూ నేతల సందడి కనిపిస్తోంది. లోకేష్ సైతం అందరికీ భరోసా ఇస్తూ పార్టీ కోసం పనిచేయండి అని సూచిస్తున్నారు. మొత్తానికి గతంలో ఎన్టీఆర్ హయాంలో రెండు అధికారిక కేంద్రాలు ఉండేవి. చంద్రబాబు దగ్గుబాటి వాటిని మెయిన్ టెయిన్ చేసేవారు.
చంద్రబాబు టీడీపీ ప్రెసిడెంట్ అయ్యాక ఒకే కేంద్రంగా మారింది. అయితే బాబుని కలిసేందుకు మాత్రం నేతలకు అంతగా వీలు చిక్కేది కాదు, ఇపుడు లోకేష్ రూపంలో తమకు ఆ చాన్స్ దక్కుతోందని తమ్ముళ్ళు ఆనందిస్తున్నారు. అదే విధంగా చూస్తే లోకేష్ కూడా బాగా హైలెట్ అవుతున్నారు. టీడీపీ ఫ్యూచర్ లీడర్ గా ఆయన ఎదుగుతున్నారు అని అంటున్నారు.ఈ కారణంగా కూడా లోకేష్ ని అంతా కలుసుకుంటున్నారు అని వినిపిస్తోంది.