జలదిగ్బంధనంలో బెజవాడ.. దీనికి అసలు కారణమేంటి?
నగరం మొత్తం క్రిష్ణ నదిలో ఉండిపోయినట్లుగా ఉన్న విజువల్స్ ను టీవీల్లో చూసిన వారంతా షాక్ తిన్న పరిస్థితి.
By: Tupaki Desk | 2 Sep 2024 5:04 AM GMTబెజవాడ కేరాఫ్ విజయవాడకు ఏమైంది? నిత్యం కళకళలాడుతూ.. విపరీతమైన రద్దీతో మనుషులు.. వాహనాలతో నిండి ఉండే విజయవాడకు ఏమైంది? ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా మొత్తంగా చెరువులో ఊరు వెలిసినట్లుగా పరిస్థితికి కారణం ఏమిటి? చరిత్రలో ఎప్పుడూ లేనంత వర్షం కురిసిన మాట వాస్తవమే అయినప్పటికీ.. మరీ ఇంతటి దారుణ పరిస్థితికి కారణమేంటి? అన్నది ప్రశ్నగా మారింది.
నగరం మొత్తం క్రిష్ణ నదిలో ఉండిపోయినట్లుగా ఉన్న విజువల్స్ ను టీవీల్లో చూసిన వారంతా షాక్ తిన్న పరిస్థితి. రోడ్లు సైతం కాలువల మాదిరి మారిపోయిన పరిస్థితికి అసలు కారణం ఏమిటన్న దానిపై ఆరా తీస్తే ఆసక్తికర విషయం వెలుగు చూసింది. విజయవాడ తాజా పరిస్థితికి ‘‘11’’ కారణంగా చెబుతున్నారు. ఈ పదకొండు ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం.
భారీ వర్షాల కారణంగా విజయవాడ మొత్తం మునిగిపోయిందనుకుంటే తప్పులో కాలేసినట్లేనని చెబుతున్నారు. దీనికి మరో కారణం ఉందంటున్నారు. భారీ వర్షాల కారణంగా ఇబ్రహాంపట్నం మండలం ఈలప్రోలు వద్ద బుడమేరుకు గండి పడింది. దీంతో.. వరద తీవ్రత పెరిగింది. వెలగలేరు వద్ద షట్టర్లు ఎత్తకపోతే ఎగువ ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న వాదన వచ్చింది.
ఈ నేపథ్యంలో అధికారులు తీసుకున్న నిర్ణయం తాజా దుస్థితికి కారణమంటున్నారు. వెలగలేరు వద్ద షట్టర్లను ఎత్తకపోతే.. క్రిష్ణా వరద వెనక్కు తన్ని ఎన్టీటీపీఎస్ ప్లాంట్ లోకి నీళ్లు చేసే ప్రమాదం ఉందని.. అదే జరిగితే ఇబ్బందికర పరిస్థితి ఉంటుందన్న ఉద్దేశంతో అధికారులు వెలగలేరు వద్ద 11 షట్టర్లను 11 అడుగుల ఎత్తుకు ఎత్తి దిగువకు వరద నీటిని వదిలేశారు. ఒక్కసారిగా వచ్చి పడిన ప్రవాహంతో విజయవాడ నగరం మునిగిపోయింది. ఎన్టీటీపీఎస్ ప్లాంట్ లోకి వరద నీరు చేరితే జరిగే నష్టాన్ని నివారించటానికి వచ్చిన ఒత్తిళ్లతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతుననారు.శనివారం రాత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో విజయవాడ మొత్తాన్ని వరద ముంచెత్తింది. మొత్తం బెజవాడ జలదిగ్బంధంలో చిక్కుకుపోయిన పరిస్థితి.