Begin typing your search above and press return to search.

పడవ నడిపే కుటుంబానికి రూ.12.8 కోట్ల ఐటీ నోటీసు!

ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రిగిన మ‌హా కుంభ‌మేళాలో ఒక బోట్ల కుటుంబం అద్భుత‌మైన ఆదాయం పొందింది. కేవలం 45 రోజుల్లోనే వారు ఏకంగా రూ. 30 కోట్లు సంపాదించ‌డం విశేషం.

By:  Tupaki Desk   |   15 March 2025 5:28 PM IST
పడవ నడిపే కుటుంబానికి రూ.12.8 కోట్ల ఐటీ నోటీసు!
X

ఎక్కడ పన్ను పీకాలో ‘నిర్మలమ్మ’కు తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలియదని ఎంతో మంది నేతలు, సోషల్ మీడియాలో నెటిజన్లు ఆరోపణలు చేస్తూనే ఉంటారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక జీఎస్టీ, ఐటీ సహా అన్ని పన్నులను ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.. దేశంలోనూ, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాటి విషయంలో ఈ పన్ను ఖచ్చితంగా చెల్లించేలా పకడ్బందీగా రూపొందించారు. అందుకే డొనాల్డ్ ట్రంప్ సైతం.. భారత్ లోనే పన్నులు అధికం అంటూ ఆరోపణలు గుప్పించారు. ఇటీవల యూపీసీఎం యోగి సైతం కుంభమేళాలో పడవ నడిపి రూ.30 కోట్లు సంపాదించిన ఓ పడవ నడిపే కుటుంబంపై గొప్పగా చెప్పుకున్నాడు. కానీ రాష్ట్ర బీజేపీ సీఎం ఇలా చెప్పాడో లేదో.. కేంద్రంలోని బీజేపీ ఆర్థిక మంత్రి అలా పన్ను నోటీసులు పంపి షాక్ ఇచ్చారు.

ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రిగిన మ‌హా కుంభ‌మేళాలో ఒక బోట్ల కుటుంబం అద్భుత‌మైన ఆదాయం పొందింది. కేవలం 45 రోజుల్లోనే వారు ఏకంగా రూ. 30 కోట్లు సంపాదించ‌డం విశేషం. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ అసెంబ్లీలో వెల్ల‌డించ‌డంతో ఈ వార్త సంచ‌ల‌నం సృష్టించింది.

అరైల్‌ గ్రామానికి చెందిన బోట్‌మ్యాన్ పింటూ మ‌హ్రా కుటుంబం కుంభ‌మేళా సంద‌ర్భంగా త్రివేణి సంగ‌మం వ‌ద్ద దాదాపు 130 బోట్ల‌ను న‌డిపారు. నెల‌న్న‌ర కాలంలో వారు సుమారు రూ. 30 కోట్ల ఆదాయాన్ని ఆర్జించారు. ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ కూడా త‌న ప్ర‌సంగంలో పేర్కొన్నారు. అయితే ఈ అనూహ్య‌మైన సంపాదన త‌ర్వాత పింటూ మ‌హ్రా కుటుంబానికి ఆదాయ‌ప‌న్ను శాఖ నుంచి ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961 ప్రకారం వారికి రూ. 12.8 కోట్లు ప‌న్ను చెల్లించాల‌ని నోటీసులు జారీ చేసింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర ఆందోళ‌న‌లో ఉంది.

ఈ విష‌యంపై సెబీ రీసెర్చ్ అన‌లిస్ట్ ఏకే మంధ‌న్ త‌న ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా స్పందించారు. బోట్‌మ్యాన్ పింటూ డ‌బ్బు సంపాదించిన‌ప్ప‌టికీ ఇప్పుడు ఆయ‌న ఆనందం కోల్పోయార‌ని అన్నారు. కుంభ‌మేళాలో అధిక ర‌ద్దీ ఉండ‌టం వ‌ల్ల ఒక్కో ట్రిప్‌కు రూ. 1000 వ‌చ్చింద‌ని, ఇది వారికి బాగా లాభ‌దాయ‌కంగా మారింద‌ని తెలిపారు.

గ‌తంలో ఒక్కో ట్రిప్‌కు కేవ‌లం రూ. 500 మాత్ర‌మే వ‌చ్చేద‌ని, అది కూడా రోజుకు ఒక‌టి లేదా రెండు ట్రిప్పులు మాత్ర‌మే ఉండేవ‌ని మంధ‌న్ గుర్తు చేశారు. కుంభ‌మేళా కార‌ణంగా పింటూ మంచి సంపాద‌న పొందిన‌ప్ప‌టికీ, త‌ర్వాత ఎదురైన ప‌రిస్థితులు వారిని షాక్‌కు గురి చేశాయ‌ని ఆయ‌న త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆదాయ‌పు ప‌న్ను శాఖ 1961లోని ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్లు 4, 68 కింద ఈ నోటీసు జారీ చేసింద‌ని మంధ‌న్ వెల్ల‌డించారు. ప‌న్ను శ్లాబ్‌ల గురించి అవ‌గాహ‌న లేని ఒక సామాన్యుడు ఇప్పుడు భారీ మొత్తంలో ప‌న్ను క‌ట్టాల్సి రావ‌డం బాధాక‌ర‌మ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఒక‌ప్పుడు నెలకు రూ. 15 వేలు సంపాదించ‌డానికి కూడా క‌ష్ట‌ప‌డిన పింటూ కుటుంబం ఇప్పుడు ఒకే ఏడాదిలో రూ. 12.8 కోట్ల ప‌న్ను క‌ట్టాల్సి రావ‌డం నిజంగా క‌ష్ట‌మైన విష‌య‌మ‌ని ఆయ‌న అన్నారు.

దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్ను తీరుపై మరోసారి వార్తల్లో నిలిచింది. ఎవరినీ వదలకుండా పన్నులు వేయడం సరైనదా? కాదా? అన్న దానిపై పలువురు విశ్లేషఖులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.