బెజవాడ హైవే పై భారీ ట్రాఫిక్ జాం
దీంతో.. ఏపీ నుంచి హైదరాబాద్ కు వచ్చే రోడ్లు మొత్తం కిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీ బస్సులు.. ప్రైవేటు బస్సులు.. కార్లు ఇతర ప్రైవేటు వాహనాలతో పాటు బైకుల రద్దీ జోరుగా ఉంది.
By: Tupaki Desk | 17 Jan 2025 5:26 AM GMTపండగ వస్తుందంటే చాలు ఊరు గుర్తుకు వస్తుంది. క్యాలెండర్ లో ఎన్ని పండగులు ఉన్నా దసరా.. దీపావళి.. సంక్రాంతి లెక్క వేరు. మిగిలిన రెండు పండగుల లెక్క ఎలా ఉన్నా.. సంక్రాంతి వేళకు మాత్రం ఏదోలా ఊరికి వెళ్లాలన్న పట్టుదల ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంటుంది. దీనికి తోడు ఎప్పుడూ వచ్చే సెలవులకు అదనంగా సెలవులు రావటంతో ఈసారి సంక్రాంతికి సొంతూరుకు వెళ్లే జోరు మరింత పెరిగింది. దీంతో పండక్కి ముందు హైదరాబాద్ హైవేలు ఎంతలా కిటకిటలాడాయో తెలిసిందే. సంక్రాంతి ముందు రెండు రోజులు భారీ జామ్ అయ్యాయి.
ఇప్పుడు సీన్ రివర్సు అయ్యింది. సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్న ఏపీ వాసులు తిరిగి హైదరాబాద్ కు వచ్చేందుకు ప్రయాణమయ్యారు. దీంతో.. ఏపీ నుంచి హైదరాబాద్ కు వచ్చే రోడ్లు మొత్తం కిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీ బస్సులు.. ప్రైవేటు బస్సులు.. కార్లు ఇతర ప్రైవేటు వాహనాలతో పాటు బైకుల రద్దీ జోరుగా ఉంది. దీంతో. 65వ నంబరు జాతీయ రహదారి.. ఉమ్మడి నల్గొండ జిల్లా చిట్యాల శివారులోని రైల్వే బ్రిడ్జి వద్ద కంటైనర్ ఇరుక్కుపోయింది. దీంతో.. రోడ్డుకు ఇరువైపులా నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి.. వాహనదారులకు ప్రత్యక్ష నరకాన్ని చూపించింది.
క్రేన్ సాయంతో పోలీసులు వాహనాన్ని తొలగించి.. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఏపీ నుంచి హైదరాబాద్ కు వచ్చే వాహనాల రద్దీకి అనుగుణంగా జాతీయ రహదారులపై ఉండే టోల్ గేట్ల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టారు. అయినప్పటికి.. వాహనాల జోరుతో భారీ జాంలు అయ్యాయి. నల్గొండ జిల్లా గూడూరు.. పంతంగి.. కొర్లపహాడ్ టోల్ ప్లాజాల మీదుగా గురువారం ఒక్కరోజున లక్ష వాహనాలు హైదరాబాద్ కు వెళ్లాయి. గూడూరులో టోల్ ప్లాజా వద్ద రద్దీని తప్పించేందుకు వంద అడుగుల దూరంలోనే ఫాస్టాగ్ స్కాన్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. రద్దీని తట్టుకోలేని పరిస్థితి.
ఏపీ నుంచి వరదలా వస్తున్న వాహనాల జోరుకు తగ్గట్లే జాతీయ రహదారి మీద పోలీసు బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు. 200 మంది పోలీసులను హైవే మీద పెట్రోలింగ్ కోసం ఏర్పాటు చేశారు. చౌటుప్పల్ మండలం పంతంగి ప్లాజా వద్ద సాధారణంగా రోజుకు 20 వేల వాహనాలు ప్రయాణమవుతుంటాయి. గురువారం మాత్రం అందుకు అదనంగా మరో 10 వేల వాహనాలు ప్రయాణాలు చేసినట్లుగా చెబుతన్నారు.
ఇక.. కేతే పల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజాలో సాధారణంగా 17వేల వాహనాలు వెళుతుంటాయి. గురువారం మాత్రం ఏకంగా 50 వేల వాహనాలు వెళ్లటం గమనార్హం. బుధవారం కనుమ కావటంతో అందరూ ఊళ్లలోనే ఉండిపోయారు. గురువారం ఉదయం నుంచి ఊర్ల నుంచి హైదారబాద్ కు బయలుదేరారు. గురు.. శుక్రవారాల్లో ఇంటి నుంచి పని చేసే అవకాశం ఉన్న వారంతా ఊళ్లలోనే ఉండిపోయినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మరోసారి భారీ వాహనరద్దీ ఉంటుందన్న అంచనా వేస్తున్నారు.