విశాఖలో "దేవీపుత్రుడు" సీన్... బీచ్ లోకి కొట్టుకొచ్చిన భారీ బాక్స్!
విశాఖ బీచ్ లో గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక భారీ బాక్స్ కొట్టుకొచ్చింది
By: Tupaki Desk | 30 Sep 2023 7:00 AM GMTవెంకటేష్, సౌందర్య నటించిన "దేవీ పుత్రుడు" సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో సముద్రం మధ్యలో ఒక పవర్ బాక్స్ ఉంటుంది. ప్రతీ అమావాస్యకూ సముద్రంలో ఆ బాక్స్ ఉన్న చోట భారీ సుడిగుండం ఏర్పడుతుంటుంది. ఆ సమయంలో సముద్రపు నీటిపైన పక్షులు సర్కిల్ గా ఏర్పడతాయి. దీంతో అందులో ఏదో మిస్టరీ ఉందని హీరో ప్రయత్నిస్తాడు.. ఆ బాక్స్ ని బయటకు తీసుకొస్తాడు!
ఇదే క్రమంలో తాజాగా విశాఖ బీచ్ లో గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక భారీ బాక్స్ కొట్టుకొచ్చింది. దీన్నీ ఏ హీరో తీసుకురాలేదు కానీ... అలలతో పాటు ఒడ్డుకు కొట్టుకువచ్చింది. దీంతో ఈ బాక్స్ ఏమిటి.. ఇందులో ఏముంది.. ఎప్పటిదై ఉంటుంది.. ఇందులో ఏదైనా మిస్టరీ ఉందా అనే అంశాలపై ఆసక్తి మొదలైంది. దీంతో ఈ బాక్స్ చూడటానికి విశాఖ సముద్ర తీరానికి భారీగా జనం తరలివస్తున్నారు.
అవును... విశాఖపట్నంలో వైఎంసీఏ సముద్ర తీరానికి ఓ భారీ చెక్క పెట్టె కొట్టుకుని వచ్చింది. శుక్రవారం రాత్రి కొందరు పర్యాటకులు, మత్స్యకారులు ఈ పెట్టెను గమనించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. బీచ్ కి చేరుకున్న పోలీసులు ప్రొక్లెనర్ సహాయంతో ఒడ్డుకు చేర్చారు. ప్రస్తుతం ఆ పెట్టె దగ్గరకు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ కూడా వచ్చాయి!
దీని బరువు సుమారు వంద టన్నుల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రంత ఈ బాక్స్ కి పోలీసులు కాపలాగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ బాక్స్ ని పురావస్తు శాస్త్రవేత్తలు పరిశీలించారు. అనంతరం రెండు ప్రొక్లెయినర్స్ సాయంతో భారీ పెట్టెను ఓపెన్ చేశారు. ఈ క్రమంలో అది చెక్కలతో చేసిన దిమ్మెగా అధికారులు తెల్చారు. దీంతో భారీ సస్పెన్స్ కు తెరపడింది.
కాగా, అంతకముందు... ఇంత భారీ పెట్టె సముద్ర తీరానికి కొట్టుకురావడం ఇదే తొలిసారని స్థానికులు చెబుతుండగా.. ఇదేదో మాయా పేటికలా ఉందని మరికొందరు కామెంట్ చేశారు. ఇంకొంతమంది ముందుగా చెప్పుకున్నట్లుగా దేవీ పుత్రుడు సినిమాని తలచుకున్నారు! తీరా చూస్తే ఇది చెక్కలతో నిండిన చెక్క దిమ్మ అని తేలిపోయింది.