Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌లో ఘోరం.. ప్రైవేటు ఆసుప‌త్రిలో భారీ అగ్నిప్ర‌మాదం

తొలుత ఆరో అంతస్తులో మొదలైన మంటలు క్రమంగా మొదటి అంతస్తు వరకు వ్యాపించాయి.

By:  Tupaki Desk   |   23 Dec 2023 3:17 PM GMT
హైద‌రాబాద్‌లో ఘోరం.. ప్రైవేటు ఆసుప‌త్రిలో భారీ అగ్నిప్ర‌మాదం
X

హైద‌రాబాద్‌లో అగ్ని ప్ర‌మాదాల వార్త‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. రెండు రోజుల కింద‌ట జ‌రిగిన అగ్ని ప్ర‌మాదం ఇంకా మ‌రువ‌క ముందే.. తాజాగా గుడిమల్కాపూర్‌లోని అంకుర ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రి ఉన్న ఆరు అంతస్తుల భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో ఒక్క‌సారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తొలుత ఆరో అంతస్తులో మొదలైన మంటలు క్రమంగా మొదటి అంతస్తు వరకు వ్యాపించాయి. అగ్ని కీల‌ల‌కు స‌మీపంలో ఉన్న భ‌వ‌నాల్లోని వారు కూడా హ‌డ‌లి పోయారు.

సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని 4 అగ్నిమాపక యంత్రాలతో మంటలా ర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆసుపత్రి భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనతో అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది రోగులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

గ్యాస్ సిలెండ‌ర్ పేలుడే కార‌ణ‌మా?

ఆసుప‌త్రి భవనంలోని ఆరో అంతస్తులో ఇక్క‌డ‌ పనిచేసే నర్సులకు హాస్టల్ సౌక‌ర్యం క‌ల్పించారు. వీరికి వంట స‌దుపాయం లేక పోవ‌డంతో ఇక్క‌డే వండుకుని భోజ‌నం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో సాయంత్రం 4 గంట‌లకు గ్యాస్ సిలెండ‌ర్ వెలిగించిన స‌మ‌యంలో అది పేలి మంట‌లు వ్యాపించి ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. కాగా, ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో దాదాపు 100 మంది నర్సులు భయంతో కిందకు ప‌రుగులు తీశారు.

ఇక‌, అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ఎంత మంది రోగులు ఉన్నారనే విషయంపై ఆసుప‌త్రి యాజ‌మాన్యం మౌనం వ‌హిస్తోంది. అంకుర ఆసుపత్రి పరిసరాల్లో దట్టమైన పొగ అలముకోవడంతో భీతావహ పరిస్థితి నెలకొంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది తెలిపారు.